ఇంకెన్నాళ్లు..?
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:57 AM
గతంలో మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో 26 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో వ్యవసాయ క్షేత్రం ఉండేది. ఈ క్షేత్రం భూములను మచిలీపట్నం మెడికల్ కళాశాలకు కేటాయించి, అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ తర్వాత క్షేత్రం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్షేత్రంలో నూతన వంగడాలు కనుగొనే ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వమైనా ఈ అంశాన్ని పట్టించుకుని వ్యవసాయ పరిశోధనా క్షేత్రం అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నాలుగేళ్లుగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి అందని అనుమతులు
మచిలీపట్నంలోని పాత క్షేత్రాన్ని మెడికల్ కళాశాలకు కేటాయింపు
ప్రతిగా రుద్రవరంలో 16.34 ఎకరాలు అప్పగింత
భూమి అప్పగించేందుకు పంపిన ఫైల్ పెండింగ్‌లో..
భవన నిర్మాణానికి అంచనాలు వేసినా రాని అనుమతులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : గతంలో మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో 26 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో వ్యవసాయ క్షేత్రం ఉండేది. ఈ క్షేత్రం భూములను మచిలీపట్నం మెడికల్ కళాశాలకు కేటాయించి, అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ తర్వాత క్షేత్రం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్షేత్రంలో నూతన వంగడాలు కనుగొనే ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వమైనా ఈ అంశాన్ని పట్టించుకుని వ్యవసాయ పరిశోధనా క్షేత్రం అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తీసుకున్నది 26 ఎకరాలు, ఇచ్చింది 16.34 ఎకరాలు
28 ఏళ్ల కిందట మచిలీపట్నం రాడార్ కేంద్రం సమీపంలో అన్ని హంగులతో 26 ఎకరాల విస్తీర్ణంలో మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల కిందట ఈ క్షేత్రం భూములను మచిలీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణానికి తీసుకున్నారు. మచిలీపట్నం మండలం రుద్రవరంలోని కృష్ణా యూనివర్సిటీ, గురుకుల జూనియర్ కళాశాలల సమీపంలో 16.34 ఎకరాలను క్షేత్రానికి కేటాయించారు. కానీ, ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈ భూమిని అప్పగిస్తూ అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వానికి ఫైల్ పంపి తమ పని అయిపోయిందన్నట్టుగా అధికారులు మిన్నకుండిపోయారు. గతంలో రాడార్ కేంద్రం సమీపంలోని క్షేత్రాన్ని ఖాళీ చేయించడంతో పరిశోధనలకు ఉపయోగించే పరికరాలను మచిలీపట్నం మార్కెట్ యార్డులో ఉంచారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది పెడన రోడ్డులోని వ్యవసాయశాఖ జిల్లా ఏరువాక కేంద్రంలో ఉంటున్నారు. రుద్రవరంలో కేటాయించిన భూమిలో గురుకుల పాఠశాల భవనం ఉండగా, ఆ భవనాన్ని కూలగొట్టారు. ఇంతా జరిగినా ఈ నాలుగేళ్లలో క్షేత్రం నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేదు.
20 శాతం మేర చౌడు
రాష్ట్రవ్యాప్తంగా సముద్రతీర ప్రాంతంలోని చౌడు భూముల్లో అధిక దిగుబడులు సాధించేలా వరి వంగడాలను కనుగొనేందుకు మచిలీపట్నంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రం భూములను మెడికల్ కళాశాలకు తీసుకుని ఖాళీ చేయించడంతో నూతన వరి వంగడాలపై పరిశోధనలు నిలిచిపోయాయి. తొలి ఏడాది పరిశోధనల కోసం వరినాట్లు వేసినా పైరు చనిపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించారు. ప్రస్తుతం ఈ భూమి ఖాళీగానే ఉంటోంది. రుద్రవరంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రానికి కేటాయించిన భూమిలో 20 శాతం మేర చౌడు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడు శాతం 4 నుంచి 8 వరకు ఉంటే మాత్రమే వరి వంగడాలపై పరిశోధనలు చేయడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. మూడేళ్ల కిందట ఖరీఫ్‌లో 3.50 ఎకరాల్లో వరిసాగు చేశారు. పైరు చనిపోవడంతో ఈ ప్రయత్నాలను విరమించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం అభివృద్ధి కోసం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ సభ్యులు ఈ క్షేత్రం అభివృద్ధిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
ఎంసీఎం100, ఎంసీఎం101 వరి వంగడాల ఉత్పత్తి
ఎంసీఎం100, ఎంసీఎం101 వరి వంగడాలను మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలోని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనరాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాల్లోని తీరప్రాంతంలో ఉన్న చౌడు భూముల్లో ఈ రెంటినీ సాగు చేస్తున్నారు. కాగా, ఈ క్షేత్రానికి కేటాయించిన భూమికి సాగునీటిని అందించేందుకు పంటకాల్వ, మురుగునీరు త్వరగా పోయేందుకు డ్రెయినేజీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. రూ.5.80 కోట్ల అంచనాతో భవనాల నిర్మాణం, చుట్టూ ప్రహరీ, తదితర పనులు చేయాలని నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఈ ఫైల్ ఎక్కడుందో, ఎప్పటికి ఆమోదం పొందుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
Updated Date - Jun 21 , 2025 | 12:57 AM