జనం సొమ్ము మింగి జల్సాలు
ABN, Publish Date - Jul 12 , 2025 | 01:04 AM
జనాలను నిండా ముంచేసి కూడా జల్సాలు బాగానే చేశాడు అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ యజమాని తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య. రూ.లక్షకు నెలకు రూ.6 వేల వడ్డీ చెల్లిస్తానని నమ్మించి వందలాది మందికి రూ.కోట్లు టోకరా వేసిన ఈయన.. స్టార్ హోటళ్లలో జల్సాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
బయటపడుతున్న ‘అద్విక’ బాగోతాలు
ఖరీదైన హోటళ్లలోనే ఆదిత్య బస
ఖాతాదారులకు ముఖం చాటేసి విలాసాలు
స్టార్ హోటల్‌లో నెలకు రూ.3 లక్షల బిల్లు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జనాలను నిండా ముంచేసి కూడా జల్సాలు బాగానే చేశాడు అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ యజమాని తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య. రూ.లక్షకు నెలకు రూ.6 వేల వడ్డీ చెల్లిస్తానని నమ్మించి వందలాది మందికి రూ.కోట్లు టోకరా వేసిన ఈయన.. స్టార్ హోటళ్లలో జల్సాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ స్టార్ హోటల్‌లో కొన్ని నెలలపాటు బస చేసినట్టు ఆధారాలు సేకరించారు.
స్టార్ హోటల్‌కు నెలకు రూ.3 లక్షల బిల్లు
ఏజెంట్లకు, ఖాతాదారులకు సక్రమంగా చెల్లింపులు చేసిన రోజుల్లో అద్విక కార్యాలయానికి నిత్యం వెళ్లిన ఆదిత్య చెల్లింపులు ఆగిపోయాక వెళ్లడమే మానేశాడు. ఆ తర్వాత స్టార్ హోటల్‌లో కొన్ని నెలలపాటు బస చేశాడు. అక్కడి నుంచి కార్యాలయంలో ఏం జరుగుతుందో సిబ్బందికి ఫోన్ చేసి తెలుసుకునేవాడు. ఇలా హోటల్‌లో బస చేసినందుకు నెలకు రూ.3 లక్షల బిల్లు చెల్లించినట్టు గుర్తించారు. ఈ డబ్బును ఖాతాదారుల పెట్టుబడుల నుంచే చెల్లించినట్టు తేల్చారు. ఈ హోటల్‌లో లగ్జరీ గదుల్లో కూర్చుని ట్రేడింగ్ చేస్తున్నట్టుగా చెప్పేవాడు. అద్విక కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, ఏజెంట్లు ఇదంతా నిజమేనని విశ్వసించారు. వాస్తవానికి బకాయిల గురించి ఖాతాదారులు పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో స్టార్ హోటల్‌లో కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకునేవాడు. అద్విక కంపెనీకి నగరంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఏడు ఖాతాలు ఉన్నాయి. ఇవికాకుండా కంపెనీ ఎండీ ఆదిత్య, ఆయన సతీమణి సుజాత పేరుతో మరో ఐదు ఖాతాలు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వాటిద్వారా జరిగిన లావాదేవీల వివరాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందాలు ఉన్నాయి. అద్వికకు రెండు తెలుగు రాషా్ట్రల్లో 42 మంది ఏజెంట్లుగా వ్యవహరించారు. వాళ్లందరినీ పోలీసులు పిలిపించి విచారణ చేస్తున్నారు. ఏజెంట్లుగా వ్యవహరించిన వారు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారు, వారికి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఎంత పెట్టుబడిని పెట్టించారు.. అనే వివరాలు తేల్చారు. సొంత పెట్టుబడి ద్వారా ఎంత కమీషన్ తీసుకున్నారు, ఖాతాదారుల పెట్టుబడుల ద్వారా ఎంత పొందారు.. అనే లెక్కలు కూడా తేలుస్తున్నారు. అసలు పెట్టుబడి కంటే తీసుకున్న కమీషన్ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు దాన్ని తిరిగి ఖాతాదారులకు చెల్లించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే ఆదిత్యతో పాటు కేసుల్లో నిందితులుగా చేర్చాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నరు. కేసుల తలనొప్పులు ఎందుకులే.. అనుకున్న ఏజెంట్లు లాభం మాట దేవుడెరుగు అసలు మిగిలితే చాలనుకుంటున్నారు. తమను కలిసిన బాధితులకు లాభాల కోసం ఆశ పడకుండా అసలుతో సరిపెట్టుకోవాలని చెబుతున్నారు. దీంతో ఏజెంట్లు తీసుకున్న కమీషన్ల నుంచి కింద ఉన్న ఖాతాదారులకు అసలు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఏజెంట్లు పోలీసులకు స్పష్టం చేస్తున్నారు. తాము పెట్టుబడులు పెట్టిన వారికి అసలు మొత్తాన్ని చెల్లిస్తామని కొందరు ఏజెంట్లు చెప్పినట్టు తెలిసింది.
Updated Date - Jul 12 , 2025 | 01:04 AM