అర్ధరాత్రి కిక్కుకు ఇక చెక్
ABN, Publish Date - May 24 , 2025 | 12:45 AM
ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన బార్లు.. సూర్యోదయానికి ముందే రహస్యంగా ప్రారంభమై పోతున్నాయి. రాత్రి 10 గంటలకు షెటర్ దించేసినా.. పక్కన ఉన్న బడ్డీకొట్లలో విక్రయాలు సాగుతున్నాయి. ఇదీ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కొన్నిచోట్ల పరిస్థితి. లైసెన్సులు పొందినప్పుడు నిబంధనల ప్రకారం షాపులు, బార్లు నిర్వహిస్తామని చెప్పి, తర్వాత ఆదాయం కోసం వాటిని ఉల్లంఘించిన వారికి చెక్ పెట్టాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు.
మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఇక నిఘా
సమయం దాటి అమ్మకాలు సాగిస్తే చర్యలు
మూడంచెల నిఘాకు అధికారుల నిర్ణయం
రెండు జిల్లాల్లో తనిఖీ బృందాల ఏర్పాటు
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు, లైసెన్స్ రద్దు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన బార్లు.. సూర్యోదయానికి ముందే రహస్యంగా ప్రారంభమై పోతున్నాయి. రాత్రి 10 గంటలకు షెటర్ దించేసినా.. పక్కన ఉన్న బడ్డీకొట్లలో విక్రయాలు సాగుతున్నాయి. ఇదీ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కొన్నిచోట్ల పరిస్థితి. లైసెన్సులు పొందినప్పుడు నిబంధనల ప్రకారం షాపులు, బార్లు నిర్వహిస్తామని చెప్పి, తర్వాత ఆదాయం కోసం వాటిని ఉల్లంఘించిన వారికి చెక్ పెట్టాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న బార్లు, మద్యం దుకాణాలపై నిరంతర నిఘా కోసం మూడు దశల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు శనివారం నుంచి రంగంలోకి దిగనున్నాయి.
ప్రత్యేక కమిటీలతో నిఘా
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలపై నిరంతర నిఘా కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు మూడు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంటుంది. దీని తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్/అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయిలో రెండో కమిటీ ఉంటుంది. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మూడో కమిటీ ఉంటుంది. ఈ కమిటీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఎక్సైజ్ అధికారులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా జిల్లావ్యాప్తంగా నిత్యం తనిఖీలు చేస్తారు. కృష్ణాజిల్లాలో ఉన్న కమిటీలను ఎన్టీఆర్ జిల్లాకు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కమిటీలను కృష్ణాజిల్లాకు పంపి మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేయిస్తారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు లైసెన్స్ రద్దు చేయాలని కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు.
ఆదాయం కోసమే..
ఎన్టీఆర్ జిల్లాలో 124 మద్యం దుకాణాలు, 122 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 135 మద్యం దుకాణాలు, 33 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయాలి. బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయాలి. ఈ వ్యాపారంలో లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి తక్కువ సమయంలోనే లాభాలను ఆర్జించడం కోసం కొంతమంది వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కొంతమంది బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఉదయం 6 గంటలకే రహస్యంగా మద్యం అమ్మేస్తున్నారు. మద్యం వ్యాపారులు షాపుల్లో ఉన్న సరుకును బడ్డీకొట్లకు తరలించి అమ్ముతున్నారు.
Updated Date - May 24 , 2025 | 12:47 AM