రాత్రి గొడవ.. ఉదయం హత్య
ABN, Publish Date - May 16 , 2025 | 01:12 AM
స్నేహితుల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం.. చివరికి పెద్దదై హత్యకు దారితీసింది. గుణదల, విజయనగర్ కాలనీలో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం మత్తులో స్నేహితుల వార్
గడ్డకట్టిన సిమెంట్ బస్తాతో దాడి
గుణదల, మే 15 (ఆంధ్రజ్యోతి) : స్నేహితుల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం.. చివరికి పెద్దదై హత్యకు దారితీసింది. గుణదల, విజయనగర్ కాలనీలో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.లక్ష్మణ్ (36)కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. అదే ప్రాంతానికి చెందిన మల్లేశ్.. లక్ష్మణ్‌కు మంచి స్నేహితుడు. ఇద్దరూ కొంతకాలం హైదరాబాద్‌లో సెంట్రింగ్ పనిచేశారు. రెండు నెలల క్రితమే లక్ష్మణ్.. విజయనగర్ కాలనీకి వచ్చి, రూమ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. స్నేహితుడు మల్లేశ్ కూడా మూడు రోజుల క్రితమే గుణదల చేరుకుని లక్ష్మణ్‌తో కలిసి సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ మద్యం సేవించి రూమ్‌కు చేరుకున్నారు. మత్తులో ఇద్దరూ గొడవ పడుతుండటంతో స్థానికులు సర్దిచెప్పారు. దీంతో ఎవరికి వారు నిద్రపోయారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో లక్ష్మణ్ నిద్రమత్తులో ఉండగా, మల్లేశ్ గడ్డకట్టి ఉన్న సిమెంట్ బస్తాను లక్ష్మణ్ తలపై మోదాడు. దీంతో లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోవడంతో మల్లేశ్ పరారయ్యాడు. తెల్లవారాక స్థానికులు వెళ్లి చూడగా, లక్ష్మణ్ రక్తపు మడుగులో పడి కనిపించాడు. సమాచారం అందుకున్న మాచవరం సీఐ ప్రకాశ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పూర్వాపరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న మల్లేశ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Updated Date - May 16 , 2025 | 01:12 AM