ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కంట్లో కారంకొట్టి హత్య

ABN, Publish Date - Jul 12 , 2025 | 01:01 AM

కేర్‌టేకర్‌గా ఇంట్లో పనికి చేరిన మహిళ వారం కాకుండానే యజమానిని హత్య చేసి నగదు, నగలతో ఉడాయించింది.

మృతుడు రామారావు

యజమానిని హతమార్చిన కేర్‌టేకర్‌

సహజీవనం చేసిన వ్యక్తితో కలిసే..

నగలు, నగదుతో తిరుపతికి పరార్‌

ఎన్టీఆర్‌ కాలనీలో దారుణం

నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

విజయవాడ/గుణదల, ఆంధ్రజ్యోతి, జూలై 11 : కేర్‌టేకర్‌గా ఇంట్లో పనికి చేరిన మహిళ వారం కాకుండానే యజమానిని హత్య చేసి నగదు, నగలతో ఉడాయించింది. మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ కాలనీ రెండో రోడ్డులో నివాసం ఉంటున్న బొద్దులూరి వెంకట రామారావు (70) రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇద్దరు పిల్లలు. వివాహాలై కుమార్తె హైదరాబాద్‌లో, కుమారుడు చెన్నైలో సెటిల్‌ అయ్యారు. తల్లి సరస్వతి (95)ని చూసుకుంటూ రామారావు ఎన్టీఆర్‌ కాలనీలో ఉంటున్నారు. వంట చేయడంతో పాటు తల్లిని కనిపెట్టుకుని ఉండేందుకు రామారావు వారం కిందట అనూష (28) అనే మహిళను నియమించుకున్నారు. తన ఇంట్లోనే ఉంటూ వంటావార్పూ చేసుకునేలా, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంట్లో తల్లికి తోడుగా నిద్రపోయేలా మాట్లాడుకున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె గురువారం తండ్రి రామారావుకు ఫోన్‌ చేసి డబ్బులు కావాలని అడిగింది. ఇంట్లో రూ.90 వేలే ఉన్నాయని, మరుసటిరోజు బ్యాంకుకు వెళ్లి ఖాతాలో వేస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో వృద్ధురాలి వద్ద నిద్రపోయిన అనూష తనకు గాలి సరిపోవట్లేదని హాల్లో పడుకుంటానని చెప్పి బయటకు వెళ్లింది. నిద్రలో ఉన్న రామారావును లేపి, కంట్లో కారంకొట్టి, దిండుతో ముఖం మీద గట్టిగా నొక్కి హత్య చేసింది. తాను సహజీవనం చేస్తున్న ఉపేందర్‌రెడ్డితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇద్దరూ బీరువా పగలకొట్టి అందులోని రూ.90 వేలు, నగలు తీసుకుని పరారయ్యారు. రాత్రి 12 గంటల సమయంలో వృద్ధురాలు లేచి చూడగా, అనూష కనిపించలేదు. బెడ్‌రూమ్‌లో కుమారుడు అచేతనంగా పడి ఉండటంతో అందరినీ పిలిచే ఓపిక లేక.. కర్రతో తలుపులు, కిటికీలు గట్టిగా కొట్టింది. పక్కింటి వారు వచ్చి చూసి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. సౌతజోన్‌ ఏసీపీ దేవినేని పవన్‌ కుమార్‌, సీఐ జానకి రామయ్య ఘటనాస్థలానికి చేరుకుని పూర్వాపరాలు సేకరించారు. మాచవరం సీఐ ప్రకాష్‌.. రామారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు, కుమార్తెకు సమాచారం తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల కోసం గాలింపు

నులకపేటకు చెందిన ఉపేందర్‌రెడ్డితో అనూష సహజీవనం చేస్తోంది. కొద్దిరోజులుగా ఇద్దరూ నులకపేటలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రామారావును హత్య చేయడానికి స్కెచ్‌ వేసిన అనూష ఉపేందర్‌రెడ్డిని ఎన్టీఆర్‌ కాలనీలోని ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి రామారావును హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. తర్వాత ఉపేందర్‌రెడ్డి, అనూష కలిసి ఆటోలో నులకపేట వెళ్లారు. సామాన్లు సర్దుకుని ఇద్దరూ కలిసి మరో ఆటోలో బస్టాండ్‌ వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పీఎన్‌బీఎస్‌ వద్దకు చేరుకోగానే, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. ప్రైవేట్‌ కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయారన్న అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే, వారు హైదరాబాద్‌ వెళ్లలేదు. పీఎన్‌బీఎస్‌లో బస్సెక్కి తిరుపతి చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఓ బృందం తిరుపతి వెళ్లింది. నిందితుల కోసం ఓపక్క మాచవరం పోలీసులు, మరోపక్క సీసీఎస్‌ పోలీసులు వేట సాగిస్తున్నారు. పోలీసులు ఏవిధంగా అడుగులు వేస్తున్నారన్న విషయాలను తెలుసుకోవడానికి నిందితులు హాట్‌స్పాట్‌ ద్వారా యూట్యూబ్‌లో టీవీ చానళ్లను చూస్తున్నారని పోలీసులు సాంకేతికంగా గుర్తించారు.

Updated Date - Jul 12 , 2025 | 01:01 AM