ఫలించిన భగీరథయత్నం
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:01 AM
వేదాద్రి ఎత్తిపోతల పథకం అభివృద్ధికి పక్షం రోజులుగా సాగునీటి సంఘాలు చేస్తున్న భగీరథ ప్రయత్నం ఫలిచింది. కదిలివచ్చిన పాలకులు అన్నదాతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ పథకం పనులకు హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు.
వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మతులకు ఎంపీ కేశినేని చిన్ని అభయం
మోటారు పనులకు రూ.30 లక్షలు మంజూరు
రేపటికి విద్యుత సరఫరా పునరుద్ధరించే అవకాశం
మరోసారి అంచనాల రూపకల్పనతో సీఎం వద్దకు..
ఆయకట్టు రైతులకు ఎంపీ చిన్ని భరోసా
నందిగామ, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : వేదాద్రి ఎత్తిపోతల పథకం అభివృద్ధికి పక్షం రోజులుగా సాగునీటి సంఘాలు చేస్తున్న భగీరథ ప్రయత్నం ఫలిచింది. కదిలివచ్చిన పాలకులు అన్నదాతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈ పథకం పనులకు హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు.
కృషికి తగిన ఫలితం
ఆయకట్టుకు కీలకమైన వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేయడంతో మూలనపడింది. ఈ పథకం కింద 17 వేల ఎకరాలు సాగులో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ పథకం మరమ్మతులకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను కలుస్తూ వినతులు అందించారు. నిధుల విడుదలలో జాప్యంతో అన్నదాతలు ఈ ఏడాది సాగుపై ఆశలు వదులుకున్నారు. ఈ తరుణంలో పథకంలోని నాలుగు మోటార్లలో ఒక మోటార్ పనిచేస్తుందన్న సమాచారం సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులకు అందింది. ఈ విషయాన్ని జలవనరుల శాఖా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన 15 రోజుల కిత్రం పథకాన్ని సందర్శించారు. తక్షణమే పరిసరాలను శుభ్రం చేయుంచే కార్యక్రమం చేపట్టారు. ఇంజనీర్లను పిలిపించి మోటారును పరిశీలించాలని కోరారు. ఒక మోటారు పనిచేసే అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అద్దె జనరేటర్ల సహాయంతో ఆ మోటారును ఒక రూపానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్ ఈ సమస్యను ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన శనివారం ఈ పథకాన్ని సందర్శించారు. పనిచేసే అవకాశం ఉన్న మోటారును యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని అఽధికారులను ఆదేశించారు. రూ.30 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు చెప్పడంతో తన ఎంపీ లాడ్స్ నుంచి అందిస్తానని హామీ ఇచ్చారు. రూ.21 కోట్ల బకాయు ఉండటం వల్ల విద్యుత సరఫరా నిలిచిపోయిన అంశంపై స్పందించిన ఎంపీ సోమవారం నాటికి విద్యుత సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన రూ.15 కోట్ల నిధుల విడుదలకు అంచనాల రూపకల్పనలో జరిగిన పొరపాట్ల వల్ల ఆలస్యమైనట్లు తెలిపారు. కచ్చితమైన అంచనాలతో సోమవారం ప్రభుత్వానికి తిరిగి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అనంతరం తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్‌తో కలిసి ముఖ్యమంత్రికి సమస్యను చెబుతామని, నిధులు విడుదల చేయిస్తామన్నారు. ఆయకట్టు రైతులు ధైర్యంగా సాగు ప్రారంభించుకోవచ్చన్నారు. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. 15 రోజులుగా సొంత నిధులతో పనులు చేయిస్తున్న డీసీ చైర్మన్ రాటకొండ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని సాగునీటి సంఘాలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jul 20 , 2025 | 01:01 AM