జెట్ సిటీలో కదలిక
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:56 AM
జక్కంపూడి ఎకనమిక్ టౌన్‌షిప్ (జెట్ సిటీ) ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయి. జెట్ సిటీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఫ్లాటెట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను పూర్తి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనను తీసుకురాగా, సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పూర్తి చేయటానికి ప్రభుత్వం సిద్ధం
రాష్ట్ర క్యాబినెట్‌లో జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ప్రతిపాదన
బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు ఏపీ ఎడ్కో, ఏపీఐఐసీలకు బాధ్యత
రూ.20.39 కోట్ల నిధులు కేటాయింపు
పూర్తికాగానే.. ఫుట్‌వేర్ ఇండ స్ర్టీస్‌కు కేటాయింపు
ఆ తర్వాత వరుసగా.. 2, 3, 4 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గత టీడీపీ ప్రభుత్వ హయాం లో అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినప్పుడే.. రాష్ట్రంలో ఆర్థిక నగరంగా జక్కంపూడిని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. లివ్ అండ్ వర్క్ విధానంలోనే నివాసం, పని ఒకే చోట ఉండేలా జెట్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 15 వేల ఇళ్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలవగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 10 వేల ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో 6,750 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇక్కడ నివశించే వారు పనిచేయటం కోసం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అంటే విడివిడిగా పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయకుండా ఒకే కాంప్లెక్స్ కింద యూనిట్లు పనిచేస్తాయి. అప్పట్లో నగరంలోని ఫుట్‌వేర్ ఇండస్ర్టీస్ కోసం దీని ఏర్పాటుకు పూనుకున్నారు. జక్కంపూడిలోని వేమవరం దగ్గర మొదటి దశ ఫ్లాటెడ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చకచకా జరిగాయి. నిర్మాణం మూడొంతులు జరిగినా.. కొంత పనులు మిగిలి ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం రాకతో ఆగిన పనులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పనులను నిలుపుదల చేయటం జరిగింది. ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ తర్వాత మరో నాలుగు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను నిర్మించాల్సి ఉండగా.. అవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ జెట్ సిటీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. జెట్ సిటీలో అత్యంత కీలకమైన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ బ్యాలెన్స్ పనులు పూర్తి చేయటానికి ఏపీ ఎకనమిక్ డెవలపమెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎడ్కో), ఏపీఐఐసీల మధ్య ఒప్పందాన్ని కుదర్చింది. రూ.20.39 కోట్ల పని బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయటానికి నిర్ణయించింది. దీని బ్యాలెన్స్ పనులు పూర్తి చేసిన తర్వాత అందులోని స్పేస్‌ను ఫుట్ వేర్ ఇండస్ర్టీస్‌కు ఏపీఐఐసీ కేటాయింపులు జరుపుతుంది. తొలి దశలో దీనిని కనుక పూర్తి చేయగలిగితే రెండో దశలో ఫర్నిచర్ ఇండస్ర్టీస్‌కు సంబంధించి రెండవ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుడతారు. ఒక వైపు జెట్ సిటీలో నిర్మాణ పనులు, మరోవైపు పనిచేసే ప్రదేశాలుగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను పూర్తి చేయటం ద్వారా ఈ ప్రాంతాన్ని తొలిదశలో కొంతమేర ఆర్థిక నగర రూపు తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Updated Date - Jun 05 , 2025 | 12:56 AM