ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అరాచక‘వాది’

ABN, Publish Date - Apr 17 , 2025 | 01:19 AM

అతనో న్యాయవాది. కానీ, అతను ఏం కోరుకుంటే అది దక్కి తీరాలి. అనుకున్నది జరిగి తీరాలి. లేకపోతే అరాచకశక్తిగా మారిపోతాడు. తనను కాదనుకున్న వారు తిరిగి కాళ్లు పట్టుకునేలా చేయడానికి కారుతో ఢీ కొట్టడానికైనా వెనుకాడడు. అవసరమైతే న్యాయస్థానాల ప్రాంగణంలోనే బెదిరిస్తాడు. మాట వినకపోతే బంధించి దాడి చేస్తాడు. అతడే వన్‌టౌన్‌కు చెందిన అన్వర్‌ షేక్‌. పేరుకు తగ్గట్టుగానే పంజా సెంటర్‌, వించిపేటను ‘షేక్‌’ చేస్తున్న ఇతని పేరును పోలీసులు రౌడీషీట్‌ జాబితాలో చేర్చారు.

వన్‌టౌన్‌లో పెరిగిపోతున్న న్యాయవాది అరాచకాలు

సన్నిహితురాలితో కలిసి ఆమె భర్త హత్య

చివరికి ఆమెతోనే గొడవ.. కారుతో ఢీ

ఫీజు కోసం కక్షిదారులను బంధించి దాడి

తోటి న్యాయవాదిపైనా బెదిరింపు ధోరణి

పంజా సెంటర్‌, వించిపేటలో రౌడీయిజం

అన్వర్‌పై రౌడీషీట్‌ తెరిచిన పోలీసులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వన్‌టౌన్‌లోని మహంతిపురానికి చెందిన అస్లాం, కుమ్మరిపాలెం సెంటర్‌కు చెందిన అన్వర్‌ స్నేహితులు. అస్లాం రెండో భార్య నసీమాను అన్వర్‌ ట్రాప్‌ చేశాడు. ఇద్దరూ కలిసి అస్లాంపై దాడి చేసి, ఊపిరాడకుండా చేసి చంపేశారు. గుండెపోటుగా చిత్రీకరించారు. అస్లాంది హత్య అని అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు పోరాడినా.. నాడు వైసీపీ నేతల అండదండలు, మంత్రిగా ఉన్న ఓ నాయకుడి సహకారంతో పోలీసులు కేసును పట్టించుకోలేదు. తర్వాత అన్వర్‌ను నసీమా దూరం పెట్టడంతో అస్లాం హత్యకు సంబంధించిన కుట్రను తెలియజేసే సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో పోలీసుల చేతుల్లో పడటంతో అన్వర్‌, నసీమాను అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ కేసులో నసీమాను ఇరికించడానికి అన్వర్‌ ఈ వీడియో విడుదల చేశాడు. ఇక్కడ అతి తెలివి ఉపయోగించడంతో అన్వర్‌ దొరికిపోయాడు. జైలు నుంచి బయటకు వచ్చాక అన్వర్‌ కొత్త అవతారమెత్తాడు. నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారాడు. ప్రముఖ న్యాయవాదిలా రెండు సంచుల్లో చట్టాలకు సంబంధించిన పుస్తకాలను తీసుకుని నిత్యం కోర్టుకు వెళ్లడం మొదలుపెట్టాడు. అస్లాం హత్యకు సంబంధించి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.

న్యాయవాదికి బెదిరింపులు

అస్లాం హత్య కేసులో ఆయన భార్య ఫాతిమా మొదటి నుంచి పోరాడుతోంది. ఈ కేసును వాదిస్తున్న న్యాయవాదిపై అన్వర్‌ న్యాయస్థానాల ప్రాంగణంలోనే బెదిరింపులకు దిగాడు. విచారణలో భాగంగా నసీమాను ఆ న్యాయవాది విచారణ చేశారు. ప్రశ్నలు సంధించారు. ఈ విషయం తెలుసుకున్న అన్వర్‌ ఏకంగా ఆ న్యాయవాది వద్దకు వెళ్లి బెదిరించాడు. ఆయన అంతుచూస్తానని హెచ్చరించాడు. న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో సూర్యారావుపేట పోలీసులు అన్వర్‌పై కేసు నమోదు చేశారు.

రూ.50 వేల కోసం బంధించి..

విశాఖపట్నానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఎయిర్‌ హోస్టస్‌ ఉద్యోగాల పేరుతో పలువురు నిరుద్యోగులను మోసం చేశారు. బాధితులంతా సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విశాఖలో ఉన్న అక్కాచెల్లెళ్లను విచారణకు పిలిపించారు. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారన్న భయంతో బెయిల్‌ కోసం వారు అన్వర్‌ను సంప్రదించారు. తర్వాత నిర్ణయం మార్చుకుని మరో న్యాయవాది వద్దకు వెళ్లారు. ఆ అక్కాచెల్లెళ్లకు అన్వర్‌ ఎలాంటి సాయం చేయలేదు. కోర్టులో ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదు. వారు తనను సంప్రదించినందుకు ఫీజుగా రూ.50 వేలు డిమాండ్‌ చేశాడు. దీనికి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఎదురుతిరిగారు. దీంతో తన బలాన్ని ఉపయోగించుకుని వారిని బంధించి దాడి చేశాడు. వారి ఫోన్ల నుంచి పేమెంట్‌ యాప్‌ ద్వారా రూ.50 వేలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. దీనిపై వారు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదిపై కేసు ఎలా నమోదు చేస్తారని ఇతర న్యాయవాదులను రెచ్చగొట్టాడు. అన్వర్‌ను అరెస్టు చేసినందుకు వాళ్లంతా పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి నానా హంగామా సృష్టించారు.

కారుతో బీభత్సం

తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న సిద్ధాంతం అన్వర్‌ది. నసీమా సోదరి కుమార్తె, అల్లుడు హైదరాబాద్‌లో ఉంటారు. రంజాన్‌ షాపింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లిన నసీమా వారితో కలిసి విజయవాడకు వచ్చింది. కారులో నసీమా, ఆమె సోదరి కుమార్తె, అల్లుడు ఉన్నారు. మహంతిపురంలో ఈ కారును చూడగానే అన్వర్‌కు పూనకాలు వచ్చాయి. ఒక్కసారిగా అతడు తన కారుతో నసీమా ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ క్రమంలో అక్కడున్న ద్విచక్ర వాహనాలను తుక్కుతుక్కు చేశాడు. దీనిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసుల జాబితా

క్రైం నెంబరు 187/2015తో ఐపీసీ 506, 323, 324, 509 కింద భవానీపురంలో ఓ కేసు నమోదైంది. అలాగే, క్రైం నెంబరు 51/2022తో సీఆర్పీసీ 174గా ఉన్న కేసును ఐపీసీ 302, 202 కింద కొత్తపేట పోలీసులు మార్పు చేశారు. క్రైం నెంబరు 84/2022తో ఐపీసీ 153 కింద కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబరు 203/2023తో ఐపీసీ 341, 506 రెడ్‌విత 34 కింద సూర్యారావుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. క్రైం నెంబరు 88/2025తో బీఎన్‌ఎస్‌ 140(2), 127(2), 115(2), 308(2) రెడ్‌విత 3(5) కింద సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబరు 126/2025తో బీఎఎన్‌ఎస్‌ 281, 324(3) కింద కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 17 , 2025 | 01:19 AM