ఇదేం మాయ గోవిందా?
ABN, Publish Date - May 20 , 2025 | 01:04 AM
దాతలు దాతృత్వంతో దానం చేసిన దాదాపు రూ.250 కోట్ల విలువైన భూమి రికార్డులు ఎక్కడైనా మాయమవుతాయా? ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖలో జరిగింది అదే. వైసీపీ హయాంలో తెరలేచిన ఈ కబ్జాపర్వంలో నిజానిజాలు బయటపడుతుండటంతో సదరు స్థలం రికార్డులు తమ వద్దే లేవని అధికారులు దాటవేస్తుండటంపై అనుమానాలు కలుగుతున్నాయి.
రూ.250 కోట్ల విలువైన భూముల రికార్డులు లేవట!
గోవిందరాజులు భూములపై దేవదాయ శాఖ వివరణ
తమ కార్యాలయంలో రికార్డులు లేవని వాదన
ఉన్నతాధికారులను పక్కదారి పట్టించే కథలు
రికార్డుల మాయం వెనుక సూత్రధారులెవరు?
ఇంద్రకీలాద్రి, మే 19 (ఆంధ్రజ్యోతి) : పటమటలంకలోని దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్ట్ భూముల రికార్డులు మాయమై నట్లు తెలుస్తోంది. జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో భద్రంగా ఉండాల్సిన రికార్డులు మాయం కావటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ట్రస్టుకు సంబంధించిన భూముల అన్యాక్రాంతంపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు వచ్చినప్పటికీ దేవదాయ అధికారులు.. ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపిస్తూ వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గోవిందరాజుల వంశీకుల నుంచి సంక్రమించిన సర్వే నెంబర్ 91/2లోని ఏ5.92 సెంట్ల స్థలాన్ని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టుకు దానం చేశారు. ఇది దేవదాయ చట్టం 1966 సెక్షన్ 38 ప్రకారం రిజిస్టరైంది. ట్రస్ట్ ఆధీనంలో ఉండగానే ఈ భూమిని లీజుకిచ్చారు. ఈ భూమిలో ఏ3.92 సెంట్ల స్థలాన్ని వన్‌టౌన్‌కు చెందిన ఆంధ్రా ఆయిల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, సురేంద్ర కాటన్ ఆయిల్ మిల్స్ వారికి ఏడాదికి రూ.3,800 ప్రాతిపదికన లీజుకిచ్చారు. లీజుదారుడు ఆ భూమిని ప్లాట్లుగా సబ్‌లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. లీజుదారుడి మరణాంతరం అతని కుమారుడు ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు తయారు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగా ట్రస్టుకు సంబంధించిన భూమిని సీలింగ్ భూమిగా పరిగణించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే తన మొదటి సిఫారసు పత్రంపై ఎన్‌వోసీ ఇవ్వమని సంబంధిత శాఖ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ఆ తర్వాత సర్వే నెంబరును తారుమారు చేసి లీజుదారుడి కుమారుడు ఈ భూమిని ఓ బ్యాంక్‌లో తనఖా పెట్టి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాయిదాలు చెల్లించకపోవటంతో 2018 నాటికి అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.100 కోట్లకు బకాయి పేరుకుపోవటంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న వ్యక్తికి కోర్టు ద్వారా నోటీసులు పంపి ఓ పేపర్‌లో సదరు యజమానిని డిఫాల్టర్‌గా పేర్కొంటూ ప్రకటన ఇచ్చినట్లు తెలిసింది. తాజాగా గోవిందరాజులు ఈనాం ట్రస్టుకు చెందిన వారసుడొకరు ఈ భూములు, ఆస్తుల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. తమ పూర్వీకులు ఆస్తులు రాయలేదంటూ, అవి తమకే చెందుతాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
ఇంటిదొంగల పనేనా?
రికార్డుల మాయం వ్యవహారం ఇంటిదొంగల పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్టుకు మేనేజర్‌ను కానీ, కార్యనిర్వాహణాధికారిని కానీ ఇంతవరకు నియమించకపోవటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. సుమారు రూ.250 కోట్ల విలువైన భూముల రికార్డుల మాయంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
రికార్డులు మావద్ద లేవు
ట్రస్టుకు సంబంధించిన రికార్డులు తమ కార్యాలయంలో లేవని ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అధికారి నటరాజన్ షణ్ముగం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గతంలో వచ్చిన కథనాలపై జిల్లా కార్యాలయంలో ఎటువంటి ఆధారాలు లేవని ఉన్నతాధి కారులకు నివేదిక పంపినట్లు చెప్పారు. ఆధారాలు ఎవరి వద్ద నుంచి అయినా లభిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
భూములు దేవదాయ శాఖవే..
గతంలో ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావటంతో నాడు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 2023, సెప్టెంబరులో విచారణాధికారిగా మచిలీపట్నంలోని శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సుబ్బారెడ్డి పూర్తి విచారణ చేసి అన్యాక్రాంతానికి గురైన భూమి వివరాలను తెలియజేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అంతేకాకుండా 1981లో ట్రస్ట్ ప్రతినిధి జి.శ్రీనివాసరావు అడిగిన మేరకు.. ఆ భూములు ట్రస్టుకే చెందుతాయని, 1982లో నాటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ధ్రువీకరించారు. ఇప్పుడు రికార్డులు లేవని చెబుతున్న అధికారులు.. ఈ విషయాలను మాత్రం మరిచిపోయారు.
Updated Date - May 20 , 2025 | 01:04 AM