‘బఫర్’ ఆఫర్
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:50 AM
పరిటాల ఇండస్ర్టియల్-మైనింగ్ ఏరియా బఫర్ జోన్ పరిధిలో రెసిడెన్షియల్ లే అవుట్లకు సీఆర్‌డీఏ అనుమతులు ఇవ్వటం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎలా ఇస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్లానింగ్ విభాగంలోని అవినీతి అధికారులు కొందరు కాసులకు కక్కుర్తి పడి ఇలా అనుమతులు ఇచ్చారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పరిటాల మైనింగ్ ఏరియాలో అధికారిక లే అవుట్లా?
బఫర్ జోన్‌లో అనుమతులిచ్చేసిన సీఆర్‌డీఏ అధికారులు
500 మీటర్ల పరిధి వరకు అనుమతి ఇవ్వకూడదనేది నిబంధన
స్టోన్ క్వారీ పేలుళ్లతో ఏర్పడే కాలుష్యం కారణంగానే..
ఇక్కడ ఇళ్లు నిర్మించుకుంటే ప్రమాదకర పరిస్థితులే..
అయినా అనుమతులిచ్చిన సీఆర్డీఏపై విమర్శలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఓవైపు రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ పనులకు కంకర అంతా పరిటాల నుంచే తీసుకెళ్లేందుకు కాంట్రాక్టు సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో పరిటాలలోని బఫర్ జోన్ పరిధిలో రెసిడెన్షియల్ లే అవుట్లకు సీఆర్‌డీఏ అధికారులు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.
అదంతా క్రషింగ్ ఏరియా
పరిటాలలో ఉన్న మెటల్స్ కారణంగా దశాబ్దాల కిందటే ఇక్కడ స్టోన్ క్రషింగ్, ఇండస్ర్టియల్స్‌కు అనుమతులు ఇచ్చారు. కాగా, సర్వే నెంబర్ 801లో 1,300 ఎకరాల రెవెన్యూ భూముల్లో మెటల్, గ్రావెల్ క్వారీలకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. ఇదే ప్రాంతంలో పలు యూనిట్లు కూడా ఏర్పాటయ్యాయి. అప్పట్లో కాలుష్య నియంత్రణ మండలి నుంచి తీసుకున్న అనుమతుల మేరకు ఈ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్రషింగ్ యూనిట్ల ద్వారా రోడ్డు, బిల్డింగ్ మెటల్‌ను తయారుచేసి ఎగుమతి చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నరసరావుపేట, ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఇక్కడి నుంచే బిల్డింగ్, రోడ్డు మెటల్ పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణ పనుల నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా బిల్డింగ్ మెటల్ అంతా ఇక్కడి నుంచే వెళ్లనుంది.
నివాసయోగ్యమేనా?
ఇప్పటికే బఫర్ జోన్ వెలుపల ఉన్న రైతులు తమ పొలాల్లోకి దుమ్ము ధూళి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటపుడు బఫర్ జోన్ పరిధిలో నివాస లే అవుట్లకు అనుమతులు ఇస్తే కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఇక్కడ నివసిస్తున్న వారు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాలుష్య జోన్‌లో ఉండేచోట నివాసాలకు అనుమతులు ఇవ్వకూడదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలా సీఆర్‌డీఏ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. జనావాసాలు లేనిచోట స్టోన్ మెటల్స్ యూనిట్లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. అప్పుడు స్థానికంగా బిల్డింగ్ మెటల్ అన్నది అందుబాటులో ఉండదు. స్థానికంగా బిల్డింగ్ మెటల్ ఉత్పత్తి అయితే ధరలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బిల్డింగ్ మెటల్ అందుబాటులో లేకపోతే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దిగుమతి కారణంగా అమాంతం బిల్డింగ్ మెటల్ ధరలు పెరిగిపోతాయి.
బఫర్ జోన్ నిబంధనలు మరిచారా?
మైనింగ్ జోన్లకు సంబంధించి ప్రభుత్వం 153 జీవోను విడుదల చేసింది. దీనిప్రకారం క్వారీలు, స్టోన్ క్వారీయింగ్‌ను నిర్వహించటానికి ఆయా వనరులు ఉన్న ప్రదేశం జనావాసాలతో సంబంధం లేకుండా ఉండాలి. ఆ తర్వాతే వాటిని మైనింగ్ జోన్‌లోకి తీసుకురావాలి. ఈ మైనింగ్ జోన్ చుట్టూ బఫర్ జోన్ ఉంటుంది. పరిటాల గ్రామంలోని సర్వే నెంబర్ 801లో మైనింగ్ బఫర్ జోన్ పరిధి ప్రస్తుతం 500 మీటర్ల వరకు ఉంది. ఈ పరిధిలో ఎలాంటి రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. దీనిపై గతంలో ఇక్కడి నిర్వాహకులంతా కలిసి బఫర్ జోన్ నిడివి 800 మీటర్ల పరిధి వరకు పెంచాలని డిమాండ్ చేశారు. సీఆర్‌డీఏ అధికారులకు కూడా స్టోన్ యూనిట్స్ నిర్వాహకులు లేఖలు రాశారు. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ వివాదానికి చెక్ పడే అవకాశం లేదు.
Updated Date - Jun 20 , 2025 | 12:50 AM