భారీ వర్ష బీభత్సం
ABN, Publish Date - May 03 , 2025 | 01:13 AM
జగ్గయ్యపేట ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భా రీ వర్షం బీభత్సం సృష్టించింది.
జగ్గయ్యపేటలో అర్ధరాత్రి ఈదురుగాలులు
నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌స్తంభాలు..దెబ్బతిన్న పంటలు
జగ్గయ్యపేట, మే 2(ఆంధ్రజ్యోతి): జగ్గయ్యపేట ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భా రీ వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలో పలుచె ట్లు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తెల్లవారుఝామున 3 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణానికి నీటి సరఫరా చేసే వాటర్ వర్క్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రత్యామ్నాయంగా జనరేటర్‌లు ఏర్పాటుచేసి నీటి సరఫరా చేయాల్సి రావటంతో ఆలస్యంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, చైర్మన్ రాఘవేంద్ర, టీడీపీ నేత ధూళిపాళ లక్ష్మణరావు నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలిచారు. ట్రాన్స్‌కో ఏఈ కృష్ణారెడ్డితో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు.
ట్రాన్స్‌కోకు రూ.20 లక్షల నష్టం
వర్షం వల్ల ట్రాన్స్‌కోకు రూ.20లక్షల నష్టం వాటిల్లిందని ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు. రాత్రి నుంచి విద్యుత్ స్తంభాలను నిలబెట్టటం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టామని, ఎక్కడైన సేవాలోపం ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు. జగ్గయ్యపేటలో 18.2 మీ.మీల వర్షపాతం నమోదైనట్లు ఏఎ్‌సఓ ఉపేంద్ర తెలిపారు.
కొట్టుకుపోయిన పాల బూత్
తొర్రగుంటపాలెంలో తెల్లవారుజామున వచ్చిన ఈదురు గాలులకు వెంకటేశ్వర్లు పాలబూత్ కొట్టుకుపోవటంతో అందులో ఉన్న ఫ్రిజ్, పాలు, ఇతర పాల ఉత్పత్తులు ధ్వంసమైయ్యాయి. రూ. 30వేలు విలువైన ఉత్పత్తులు ఉన్నాయని బాధితుడు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తంచేశాడు.
కుదేలైన రైతులు
జగ్గయ్యపేట రూరల్: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవటంతో మొక్కజొన్న, మామిడి, వరి రైతులు కుదేలయ్యారు. మండలంలోని అనుమంచిపల్లి, గండ్రాయి, మల్కాపురం, షేర్‌మహ్మద్‌పేట, అన్నవరం, తక్కెళ్లపాడు గ్రామాల్లో రైతులు తీవ్ర నష్టాలను చవి చూశారు. ఇళ్ల పైకప్పులు లేచిపోగా మామిడి తోటలు కూకటి వేళ్లతో పడిపోయాయి. తోటలు కొన్న రైతులు లబోదిబోమంటున్నారు. వరి, మొక్కజొన్న రైతులు కోతలు కోసి పంటలు ఆరబెట్టారు. ఒక్కసారిగా వచ్చిన వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
త్రుటిలో తప్పిన ప్రమాదం
మల్కాపురంలో ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి దగ్ధమైంది. అప్పటి వరకు కుటుంబ సభ్యులంతా ఆరుబయట పడుకున్నామని, వాతావరణంలో మార్పులతో ఇంటిలోకి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డామని ఇంటి యజమాని సులేమియా తెలిపారు. మండలంలోని షేర్‌మహ్మద్‌పేట, అనుమంచిపల్లి ఆయా గ్రామాల్లో కుటుంబ సభ్యులతో ఇళ్లలో ఉండగా ఆ ఇళ్లపై ఏర్పాటు చేసిన రేకులు గాలికి లేచిపోయి వీధిలో పడ్డాయి. రాత్రి కావటంతో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
Updated Date - May 03 , 2025 | 01:13 AM