ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ మళ్లీ పెళ్లి

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:28 AM

కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన ప్రసాద్‌కు మూడు పదుల వయస్సు పైబడినా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవడానికి ఓ అమ్మాయిని చూడమని పెళ్లిళ్ల బ్రోకర్లకు చెప్పి మోసపోయాడు. పెళ్లై భర్త నుంచి దూరంగా ఉంటున్న ఓ పిల్లాడి తల్లిని పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి ప్రసాద్‌ నుంచి రూ.3 లక్షలు గుంజేశారు. విజయవాడ కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన ఘటన ఇది. చెన్నైకు చెందిన యువకుడికి నగరానికి చెందిన యువతితో గత నెలలో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం ఎదురిచ్చి మరీ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన పది రోజులకు యువతి సొంతూరు వెళ్లాలని విజయవాడకు వచ్చింది. బస్టాండ్‌లో దిగి కనిపించకుండాపోయింది. ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే, అంతకుముందే ఆమెకు పెళ్లయినట్టు పోలీసులు గుర్తించారు. అనంతపురానికి చెందిన ఓ యువకుడికి వారం క్రితం కొండపల్లికి చెందిన యువతితో వివాహమైంది. తర్వాత వారానికి నాన్నమ్మకు ఒంట్లో బాలేదని యువతి నగరానికి వచ్చి అదృశ్యమైంది. వరుడు పోలీసులను ఆశ్రయించగా, ఆ మహిళకు గతంలోనే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్టుగా గుర్తించారు. పెళ్లికి పెద్దలుగా ఉన్నవారు ఎదురు కట్నంగా రూ.3 లక్షలు చెల్లించాలని షరతు పెట్టారు. ఇటీవల నగరంలో వరుసగా జరిగిన ఘటనలివి. పెళ్లికాని యువకుల బలహీనతలను క్యాష్‌ చేసుకుంటూ దర్జాగా దొంగ పెళ్లిళ్లు జరిపించేస్తున్నారు. మ్యారేజ్‌ బ్యూరోగా చెప్పుకొనే ఓ గ్యాంగ్‌ ఎదురుకట్నం తీసుకుని యువకుల జీవితాలను ఇలా చీకటిమయం చేస్తోంది.

పెళ్లికాని యువకులే టార్గెట్‌గా నగరంలో దొంగ పెళ్లిళ్లు

పిల్లలుండి భర్తకు దూరంగా ఉంటున్న మహిళలను చూపించి ఎర

ఎదురుకట్నం ఇచ్చి పెళ్లికి సిద్ధమవుతున్న యువకులు

తూతూమంత్రంగా పెళ్లి.. ఆనక మోసపోయి లబోదిబో

నగరంలో మ్యారేజ్‌ బ్యూరోగా చెప్పుకొంటున్న గ్యాంగ్‌ అరాచకం

వాంబేకాలనీ, కొండపల్లిలోనూ ముఠాగా ఏర్పడి మోసాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో మ్యారేజ్‌ బ్యూరోలుగా చెప్పుకొంటున్న కొంతమంది ఓ గ్యాంగ్‌గా ఏర్పడి పెళ్లికాని యువకులను మోసం చేస్తున్నారు. పెళ్లి చేస్తామని చెప్పి ఆభరణాలను, నగదును లాగేసుకుంటున్నారు. ఈ గ్యాంగ్‌ చేస్తున్న ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పీఎన్‌బీఎస్‌ కేంద్రంగా మొత్తం మూడు ఘటనలు జరిగితే, వాటిలో ఒకటి మాత్రమే పోలీసుల వరకు వెళ్లింది. పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళల వివరాలు సేకరించి, పెళ్లికాని యువకుల జీవితాల్లోకి పంపుతున్నారు. తద్వారా ఈ గ్యాంగ్‌ ఆర్థికంగా లాభపడుతోంది. పెళ్లిచూపులు పూర్తికాగానే, వెంటవెంటనే ముహూర్తాలు పెట్టిస్తున్నారు. దుర్గమ్మ ఆలయంలో కానీ, ఇతర ఆలయాల్లో కానీ తూతూమంత్రపు పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

పెళ్లి కూతురిలా మారితే రూ.35 వేలు

అవివాహిత యువకులను టార్గెట్‌ చేసుకుని మోసాలు చేస్తున్న ముఠా నెట్‌వర్క్‌ అంతర్రాషా్ట్రలతో అనుసంధానమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ముఠా లింక్‌లు కర్ణాటక నుంచి బెజవాడ వరకు ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మాత్రం ఈ ముఠాను నడుపుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లై పిల్లలుండి, భర్త నుంచి విడిపోయిన మహిళలను ఎంపిక చేసుకోవడానికి వీరు ప్రత్యేకంగా మహిళలను నియమించుకుంటున్నారు. ఇలా భర్తలకు దూరంగా ఉంటున్న మహిళల వివరాలను తమ వద్ద భద్రపరుచుకుంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని విషయంలో ఇదే జరిగింది. ఆమనిని రాయచూర్‌కు చెందిన ప్రసాద్‌ జీవితంలోకి పంపడానికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కథ నడిచింది. పిల్లలున్న తల్లిని పెళ్లి కుమార్తెలా ముస్తాబు చేసి చూపించి అవతలి వ్యక్తుల నుంచి ఈ గ్యాంగ్‌ లక్షలాది రూపాయలను లాగేసింది. అందులో పెళ్లికుమార్తె వాటాగా రూ.35 వేలు ఇస్తున్నారు. ఆ మిగిలిన మొత్తాన్ని గ్యాంగ్‌లోని సభ్యులు పంచుకుంటున్నారు. అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పి వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని విజయవాడకు రప్పిస్తున్నారు. గ్యాంగ్‌లో ఉన్న మహిళా సభ్యుల ఇళ్లలో లేదా వారికి పరిచయం ఉన్నవారి ఇళ్లల్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆమని కేసు విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలను తెలుసుకుని పోలీసులు అవాక్కవుతున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న మురార్జీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మురార్జీకి సంకెళ్లు వేస్తే పెళ్లిళ్ల పేరుతో ఎన్ని మోసాలు చేశాడన్న సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు.

రాయలసీమ యువకులే టార్గెట్‌

వాంబేకాలనీకి చెందిన ఇద్దరు మహిళలతో పాటు కొండపల్లికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఓ ముఠాగా ఏర్పడి దొంగ పెళ్లిళ్లు చేయిస్తున్నట్టు పోలీసులు అనుమానిసున్నారు. రాయలసీమకు చెందిన యువకులను టార్గెట్‌ చేసుకుని ఈ మహిళలు దొంగ పెళ్లిళ్లు చేయించి లక్షల రూపాయలు వసూలు చేసి పరారవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మోసపోయిన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. విషయం బయటపడితే పరువు పోతుందని భావిస్తున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 01:28 AM