ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్వ.. కనుమరుగు

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:55 AM

బుడమేరు ముంపు నివారణ కోసం మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన కరకట్ట వెంబడి ఇరిగేషన్‌ భూములు కనుమరుగవుతున్నాయి. బుడమేరు ప్రవాహం, రైతుల పొలాల నీళ్ల కోసం ఏర్పాటు చేసిన కాల్వ అంచెలంచెలుగా ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విజయవాడ రూరల్‌ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు వర్షాల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు.

మీనాక్షి నగర్‌లో కాల్వ పూడ్చివేసి చేపట్టిన నిర్మాణం

విజయవాడ రూరల్‌ మండలంలో బుడమేరుపై ఆక్రమణలు

రియల్టర్ల బారిన పడుతున్న ఇరిగేషన్‌ భూములు

దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఇదే తంతు

నీటి ప్రవాహం లేక ఎగదన్నుతున్న వరద నీరు

పంట నష్టపోతున్న అన్నదాతలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ రూరల్‌/పాయకాపురం) : అజితసింగ్‌నగర్‌, పాయకాపురం ప్రాంతాలు గతంలో తరచూ బుడమేరు వరద ముంపునకు గురయ్యేవి. దీంతో మూడు దశాబ్దాల కిత్రం అజితసింగ్‌నగర్‌ రైల్వేట్రాక్‌ వద్ద నుంచి పైపుల రోడ్డు, సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, కండ్రిక కాలనీ వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర కరకట్టను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరకట్ట కోసం తవ్విన మట్టి కారణంగా కాల్వ ఏర్పడింది. బుడమేరుకు వరద వస్తే.. పక్కనే ఉన్న పాయకాపురం, సింగ్‌నగర్‌ ప్రాంతాలకు తగలకుండా ఈ కాల్వ నుంచే వరద వెళ్లిపోయేలా అప్పట్లో విస్తరించారు. దీంతో బుడమేరు వరద అప్పట్లో అజితసింగ్‌నగర్‌, పాయకాపురం ప్రాంతాలపై ప్రభావం చూపేది కాదు.

ఇష్టానుసారంగా కాల్వల పూడ్చివేత

అజితసింగ్‌నగర్‌ రైల్వేట్రాక్‌ నుంచి పైపులరోడ్డు వరకు మినహాయించి, అంతకు దిగువన ఉన్న పాయకాపురం ప్రాంతంలో కరకట్టను ఆనుకుని ఉన్న కాల్వ ఆక్రమణల పాలవుతోంది. ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్ల కోసం చాలాచోట్ల దీనిని పూడ్చేశారు. దీంతో కాల్వ పూడిపోయి వరద నీరు ముందుకు కదిలే పరిస్థితి లేకుండాపోయింది. రియల్టర్లకు తోడు సమీప స్థల యజమానులు, వ్యాపారులు తమ స్థలాలను ఆనుకుని ఉన్న కాల్వను పూడ్చి భవన నిర్మాణాలు చేస్తున్నారు. ప్రధానంగా ఉడాకాలనీ, మీనాక్షినగర్‌, ఎల్‌బీఎస్‌నగర్‌ సమీపంలో ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నష్టపోతున్న రైతులు

ఇటు పాయకాపురం, అటు విజయవాడ రూరల్‌ మండలం మధ్యలో ఉన్న కాల్వను పూడ్చి వేయడం వల్ల పలు గ్రామాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల సమయంలో ఎగువ నుంచి వచ్చిన వరద నీరు దిగువకు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. ఈ నీరు వెనక్కి ఎగదన్నడంతో రూరల్‌ మండలంలోని గ్రామాల్లో రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా అంబాపురం, పాతపాడు, పి.నైనవరం గ్రామాల రైతులపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నాలుగు కిలోమీటర్ల మేర కాల్వను వెంచర్ల కోసం పూడ్చి వేస్తున్నా, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వను పరిరక్షించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Jun 19 , 2025 | 12:55 AM