దసరా ఉత్సవాలు 11 రోజులు
ABN, Publish Date - Jul 29 , 2025 | 01:03 AM
ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది 11 రోజులపాటు జరగనున్నాయి. సెప్టెంబరు 22వ తేదీన ప్రారంభమయ్యే మహోత్సవాలు అక్టోబరు 2న ముగుస్తాయి. ఈ వివరాలను శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్ మహామండపంలో సోమవారం వెల్లడించారు.
సెప్టెంబరు 22 నుంచి ఉత్సవాలు మొదలు
ఈ ఏడాది అమ్మవారికి ప్రత్యేక అలంకారం
కాత్యాయినీదేవిగా దుర్గమ్మ దర్శనభాగ్యం
తిథుల వృద్ధే కారణమంటున్న పండితులు
విజయవాడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ ఏడాది 11 రోజులపాటు జరగనున్నాయి. సెప్టెంబరు 22వ తేదీన ప్రారంభమయ్యే మహోత్సవాలు అక్టోబరు 2న ముగుస్తాయి. ఈ వివరాలను శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్ మహామండపంలో సోమవారం వెల్లడించారు. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో శరన్నవరాత్రులను 11 రోజులపాటు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. అమ్మవారికి ఏటా పది అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబరు 25న కొత్తగా అమ్మవారు కాత్యాయినీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి పదేళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో శరన్నవరాత్రులు 11 రోజులపాటు జరుగుతాయి. ఇంతకుముందు 2016లో ఈవిధంగా జరిగింది. నాడు తిథి వృద్ధి చెందడంతో కాత్యాయినీదేవిగా అమ్మవారిని అలంకరించారు. తిరిగి ఈ ఏడాది అమ్మవారికి ఆ అలంకారం చేయనున్నారు. సెప్టెంబరు 29వ తేదీన అమ్మవారు జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అదేరోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
అలంకారాలు ఇలా..
సెప్టెంబరు 22వ తేదీ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. 23న గాయత్రీదేవిగా, 24న అన్నపూర్ణాదేవిగా, 25న కాత్యాయినీదేవిగా, 26న మహాలక్ష్మీదేవిగా, 27న లలితా త్రిపురసుందరీదేవిగా, 28న మహాచండీదేవిగా, 29న (మూలానక్షత్రం) సరస్వతీదేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబరు 1న మహిషాసురమర్థినిగా, 2న రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది.
Updated Date - Jul 29 , 2025 | 01:03 AM