రక్షణ రంగ ఆకాంక్షలు సాకారం
ABN, Publish Date - May 03 , 2025 | 01:18 AM
గుల్లలమోదలో డీఆర్డీవో నిర్మించనున్న మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ దేశ రక్ష ణ రంగ ఆకాంక్షలను సాకారం చేసే ప్రాజెక్టు అవుతుందని దివి ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రూ.1500 కోట్ల అంచనాలతో నాగాయలంక నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ పనులు ప్రారంభం
అవనిగడ్డ, మే 2(ఆంధ్రజ్యోతి): గుల్లలమోదలో డీఆర్డీవో నిర్మించనున్న మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ దేశ రక్ష ణ రంగ ఆకాంక్షలను సాకారం చేసే ప్రాజెక్టు అవుతుందని దివి ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.1500 కోట్ల అంచనాలతో ప్రధాని నరేంద్ర మోదీ మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ పనులను అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేంద్రానికి నాగాయలంక నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్‌గా నామకరణం చేస్తూ రక్షణ రంగానికి ఈ కేంద్రం దుర్గామాత నవశక్తినిచ్చే కేంద్రంగా అభివర్ణించారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవనుంది. 5 వేల కిలోమీటర్లకు పైబడిన లక్ష్యాలను ఛేదించే మిస్సైల్‌ను ప్రయోగించేందుకు ఈ కేంద్రాన్ని వేదికగా చేసుకోవచ్చుని డీఆర్డీవో భావిస్తోంది. దీని కోసం అత్యాధునిక ఈవో(ఎలకో్ట్ర ఆప్టికల్ సిస్టమ్)ను ఈ కేంద్రంలో వినియోగించనున్నట్లుగా తెలుస్తోంది.
ఇండిజెనాస్ రాడార్ సిస్టమ్
ఇక్కడ అత్యాధునిక ఇండిజెనాస్ రాడార్ సిస్టమ్‌కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ పార్టనర్‌షి్‌పతో డీఆర్డీవో ఇండిజెనాస్ రాడార్ సిస్టమ్‌ను వినియోగిస్తూ ఇంద్ర, అశ్విని, స్వాతి, షోర్డ్‌షిఫ్ వంటి ఆధునిక రాడర్లను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురాగా, వీటిని నాగాయలంకలో ఏర్పాటు చేయబోయే మిస్సైల్ టెస్టింగ్ రేంజ్‌లో పూర్తిస్థాయిలో ఉపయోగించనున్నట్లు సమాచారం. వీ టి ద్వారా భూమికి సమీపం నుండి వెళ్లే మిస్సైల్‌లు, హెలిక్టాపర్లను గుర్తించే వెసులుబాటు ఉంటుంది.
దీర్ఘశ్రేణి క్షిపణులను పరీక్షించే వెసులుబాటు
నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ ద్వారా దీర్ఘశ్రేణి క్షిపణులు సైతం పరీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఇంతకాలం హైదరాబాద్‌లోని డీఆర్డీవో తయారు చేసే క్షిపణులను ఒడిశాలోని బాలసౌర్ నుంచి పరీక్షిస్తుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి బాలసౌర్‌కు చేరుకునేందుకు ఎక్కువ సమయం పడుతుండటం, పరీక్ష చేయాల్సిన క్షిపణుల రక్షణకు కూడా ప్రమాదం పొంచి ఉండటంతో దీర్ఘశ్రేణి క్షిపణుల ను తరలించేందుకు డీఆర్డీవో ఇబ్బందులు పడుతూ వచ్చింది. నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ దూరం బాలసౌర్‌కు వెళ్లే దూరం సగానికి సగం కంటే తక్కువగా ఉండటం, ఇక్కడకు దీర్ఘ శ్రేణి క్షిపణులను తరలించేందుకు కావాల్సిన మౌలిక వసతులు ఇప్పటికే దాదాపుగా కలిగి ఉండటంతో ఈ కేంద్రం నుంచి 5 వేల కిలోమీటర్లు, అంతకు మించి వెళ్లే క్షిపణులను పరీక్షించే అవకాశం ఉంది.
ఏడాదిలోపే తొలి పరీక్ష?
గుల్లలమోదలో నిర్మిస్తున్న మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ నిర్మాణ పనులు ఆరేడు సంవత్సరాలపాటు జరుగుతాయని, ఇందుకోసం దాదాపుగా రూ.25 వేల కోట్లకుపైగా వెచ్చించనున్నారని సమాచారం. అయితే భారత రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంవత్సరం లోపే ఇక్కడి నుంచి క్షిపణి పరీక్షలను నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయబోతున్నారని తెలియవస్తోంది. ఇప్పటికిప్పుడు మిస్సైల్ టెస్టింగ్ నిర్వహణకు కావాల్సిన పర్మినెంట్ రాడార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయటం కష్టమే అయినప్పటికీ బెల్‌తో డీఆర్డీవో నిర్మించిన ఇండిజెనాస్ రాడార్ సిస్టమ్‌ను ఉపయోగించి కూడా స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయనున్నారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీకి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృతజ్ఞతలు
అమరావతిలో సభా వేదిక మీదకు వచ్చే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడుతో పాటు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కలిశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మి స్సైల్ టెస్టింగ్‌రేంజ్ ఏర్పాటుపై మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గుల్లలమోద వచ్చిన డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్
నాగాయలంక/అవనిగడ్డ: గుల్లలమోదలోని క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఉదయం 7 గంటలకు డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ సందర్శించి ప్రారంభ ఏర్పాట్లను ప్రాజెక్టు మేనేజర్ కల్నల్ సమీర్ శర్మతో చర్చించి అనంతరం అమరావతి వెళ్లారు. డీఆర్డీవో డైరెక్టర్ చోబేతోపాటు 20 మంది అధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రాజెక్టు డైరెక్టర్ సమీర్ శర్మతో ఇక్కడి పనులను వేగవంతంగా చేయాలని ప్రత్యేకంగా టెస్ట్ రేంజ్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని సమీర్ వి.కామత్ సూచించినట్లు సమాచారం. వర్చువల్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామానికి చెందిన 200 మందిని ప్రత్యేక అనుమతులతో ఆహ్వానించారు. ఆర్డీ వో కె.స్వాతి, జిల్లా అధికారి పి.సాయిబాబు, తహసీల్దార్ ఎం.హరనాథ్ హాజరయ్యారు.
Updated Date - May 03 , 2025 | 01:18 AM