ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటి దొంగలు..!

ABN, Publish Date - May 04 , 2025 | 12:48 AM

సిమెంట్‌, ఇసుక, ఇనుమును పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించిన మెటీరియల్‌ను ఇష్టానుసారంగా దారి మళ్లించారు. జిల్లాలోని గృహనిర్మాణ శాఖలోని కొందరు ఏఈలు, డీఈలు సాగించిన ఈ అవినీతి బాగోతాలపై వెల్లువలా ఫిర్యాదులు అందడం, నిజాలు నిర్ధారణ కావడంతో అవనిగడ్డ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన హౌసింగ్‌ అధికారులపై చర్యలు తీసుకుంటూ కలెక్టర్‌ బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు. చల్లపల్లి మండలం గృహనిర్మాణ సంస్థ ఇన్‌చార్జి ఏఈగా పనిచేసిన అరుణకుమారి, వినయ్‌చంద్రను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించడంతో పాటు క్రిమినల్‌ కేసులు కూడా పెట్టాలని ఉత్తర్వులు జారీచేశారు. అవనిగడ్డ నియోజకవర్గ డీఈగా పనిచేసిన బానోజీరావుపై శాఖాపరమైన విచారణతో పాటు ముదినేపల్లి మండల ఏఈ వై.శేషగిరిరావును సైతం సస్పెండ్‌ చేశారు. ఈ మొత్తం అవినీతి వ్యవహారంలో రూ.39 లక్షల మేర దారి మళ్లిందని నిర్ధారణైంది.

గృహనిర్మాణ శాఖలో అవినీతి ఉద్యోగులపై వేటు

రూ.39 లక్షల విలువైన సిమెంట్‌, ఇనుము మాయం

అవనిగడ్డలోని ఇద్దరు ఏఈలు విధుల నుంచి తొలగింపు

క్రిమినల్‌ కేసులు కూడా పెట్టాలని నిర్ణయం

అవనిగడ్డ డీఈపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు

చల్లపల్లి, ఘంటసాల మండలాల గోడౌన్‌ ఇన్‌చార్జి సస్పెన్షన్‌

విధులకు దూరంగా మోపిదేవి మండల ఏఈ

అక్రమాలు రుజువైన ఏడాదికి కలెక్టర్‌ చర్యలు

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో గృహనిర్మాణ శాఖలో పనిచేసిన అసిసెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ)లు తమ చిత్తానుసారం వ్యవహరించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకుండానే ముందస్తుగా లబ్ధిదారులకు సిమెంట్‌, ఇనుము, ఇసుక వంటి మెటీరియల్‌ ఇచ్చినట్టుగా రికార్డుల్లో రాసి, వాటిని పక్కదారి పట్టించి విక్రయించేశారు. ఈ నాలుగు మండలాల్లో గృహనిర్మాణ శాఖలో అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసిన ఏఈలు తమదైనశైలిలో అక్రమాలకు పాల్పడటంతో ఉన్నతాధికారులకు విడతలవారీగా గతంలోనే ఫిర్యాదులు అందాయి. గృహనిర్మాణ శాఖ, విజిలెన్స్‌ అధికారులు విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ నివేదిక బయటకు రాకుండా, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా తెరవెనుక పెద్దలు వ్యవహారం నడుపుతూ వచ్చారు. అవినీతి ఆరోపణలు, విచారణ జరిగాక అదే మండలంలో పనిచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతో ఏఈలు వ్యూహాత్మకంగా గృహనిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయంలో పనిచేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అధికారుల విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైనా సుదీర్ఘకాలంగా జీతాలు పొందుతూ వస్తున్నారు.

అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తూ అక్రమాలు

అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో గృహనిర్మాణ శాఖలో పనిచేసే ఉద్యోగులంతా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసినవారే. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలో పనిచేసే అరుణకుమారి అనే వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ను వైసీపీ ప్రభుత్వ హయాంలో చల్లపల్లి మండల గృహనిర్మాణ సంస్థ ఇన్‌చార్జి ఏఈగా నియమించారు. గతంలో చల్లపల్లి మండలం ఇన్‌చార్జులుగా అరుణకుమారి, వినయ్‌చంద్ర పనిచేసిన కాలంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు సిమెంట్‌, ఇనుము ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. వందలాది బస్తాల సిమెంట్‌, ఏడు టన్నులకుపైగా ఇనుమును మాయం చేశారనే అంశంపై ఫిర్యాదులు అందాయి. ఆ ఇద్దరు ఉద్యోగులపై వచ్చినఆరోపణలపై అధికారులు విచారణచేసి నివేదిక సిద్ధం చేశారు. ఈ విచారణ అనంతరం అరుణకుమారిపై చర్యలు తీసుకోకుండా మచిలీపట్నంలోని జిల్లా గృహనిర్మాణ శాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. వినయ్‌చంద్‌ను కోడూరు మండలానికి బదిలీ చేశారు. మచిలీపట్నంలోని జిల్లా గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేసే ఒక డీఈ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇంతకాలంగా తెరవెనుక చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. కానీ, అరుణకుమారి, వినయ్‌చంద్రను శాశ్వతంగా విధుల నుంచి తొలగించడంతో పాటు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. గతంలో చల్లపల్లి, ఘంటసాల మండలాల సిమెంట్‌ గోడౌన్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన ఏఈ వై.శేషగిరిరావును మాత్రం సస్పెండ్‌ చేశారు.

డీఈ కనుసన్నల్లోనే అక్రమాలు

అవనిగడ్డ గృహనిర్మాణ సంస్థ డివిజనల్‌ ఇన్‌చార్జి (డీఈ)గా పనిచేసిన బానోజీరావు తనదైనశైలిలో వ్యవహరించి అక్రమాలకు తెరతీశాడనే ఆరోపణలున్నాయి. చల్లపల్లి, ఘంటసాల మండ లాల ఇన్‌చార్జుల లాగిన్‌లో నుంచి సిమెంట్‌, ఇనుమును పక్కదారి పట్టించారని డీఈపై పలు ఫిర్యాదులు అందాయి. దీనిపైనా అధికారులు విచారణ చేశారు. సిమెంట్‌, ఇనుము మాయం చేశారని రుజువైంది. దీంతో డీఈపైనా చర్యలు తీసుకోవాలని విచారణ అధికారులు సిఫారసు చేశారు. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. ఘంటసాల మండలంలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు సిమెంట్‌, ఇనుము ఇచ్చేందుకు గోడౌన్‌ ఉంది. చల్లపల్లి ఏఈగా పనిచేసిన వై.శేషగిరిరావు గతంలో ఈ గోడౌన్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన్ను ముదినేపల్లి ఏఈగా బదిలీ చేశారు. బదిలీ అయిన శేషగిరిరావు ఘంటసాల గోడౌన్‌కు సంబంధించిన రికార్డులను అప్పగించలేదు. ఆ తరువాత ఘంటసాల ఏఈగా సురేంద్రను నియమించారు. డీఈ బానోజీరావు, ఏఈ సురేంద్ర తమ చిత్తానుసారంగా వేలాది బస్తాల సిమెంటును మాయం చేశారనే ఆరోపణలపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. సిమెంట్‌ మాయంలో డీఈ పాత్ర అధికంగా ఉన్నట్టుగా విచారణలో వెల్లడైంది. ఘంటసాల ఏఈ సురేంద్ర ఒక వ్యాన్‌ కొనుగోలు చేసి, ఆ వ్యాన్‌ డ్రైవర్‌ ద్వారా లబ్ధిదారులు ఇనుము, సిమెంట్‌ పంపిణీ పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. నియోజవర్గంలో రెండువేల టన్నులకుపైగా ఇసుకను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపిన అంశంపైనా అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి.

పెదపారుపూడి మండలంలో పక్కా అవినీతి

పామర్రు నియోజకవర్గంలోని పెదపారుపూడి మండలంలో సిమెంట్‌, ఇనుము పెద్దమొత్తంలో మాయమైంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇటీవల పెదపారుపూడి మండలం గృహనిర్మాణ సంస్థలో పనిచేసే సిబ్బందిని జిల్లా గృహనిర్మాణ సంస్థ కార్యాలయానికి పిలిపించారు. రికార్డులను తనిఖీ చేశారు. గతంలో పనిచేసిన డీఈ సిమెంట్‌, ఇసుము లబ్ధిదారులకు ఇవ్వకుండానే పామర్రులోనే గుంపగుత్తగా విక్రయించేశారని సిబ్బంది చెప్పినట్లు సమాచారం. గతంలో పామర్రులో పనిచేసిన డీఈ ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నారు. పెడన నియోజకవర్గంలో ఒక మండలంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం చేస్తున్న ఒక ఏఈపైనా విచారణ చేయాలని ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. అధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మోపిదేవి మండల ఏఈ డుమ్మా

మోపిదేవి మండలంలో తాండవ కృష్ణ అనే ఏఈ పనిచేశారు. గతంలో ఈ ఏఈ అవనిగడ్డ మండలం గృహనిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మోపిదేవి మండలం ఏఈగా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించారు. మోపిదేవి, కోసూరివారిపాలెం గ్రామాల్లో గిరిజనుల ఇళ్లను ఈ ఏఈనే కాంట్రాక్టు తీసుకుని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్లు సరిగ్గా నిర్మించకపోవడంతో పాటు రెండువేల టన్ను ఇసుకను మాయం చేసిన కృష్ణను మచిలీపట్నంలోని జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు. తనపై చర్యలు తప్పవని నిర్ధారణకు వచ్చిన ఈయన చాలాకాలంగా విధులకు హాజరుకావట్లేదు.

Updated Date - May 04 , 2025 | 12:48 AM