రాజీనా.. రాజీనామానా..?
ABN, Publish Date - Apr 19 , 2025 | 01:03 AM
తిరువూరు మునిసిపల్ చైర్‌పర్సన్ రాజీనామా అంశం నాటకీయ పరిణామాల మధ్య మరో గందరగోళానికి దారితీసింది. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం మధ్యలో చైర్‌పర్సన్ కస్తూరిభాయి అర్థంతరంగా వెళ్లిపోవడం, ఆ తర్వాత అస్వస్థతకు గురికావడం, రాజీనామా ఆమోదం పొందకపోవడం.. వంటి పరిణామాలపై కొందరు వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు గుర్రుగా ఉన్నారు.
తిరువూరులో మళ్లీ రచ్చకెక్కిన చైర్‌పర్సన్ వివాదం
రాజీనామా ఆమోదం సమయానికి చైర్‌పర్సన్‌కు అస్వస్థత
కౌన్సిల్ సమావేశం నుంచి ఆసుపత్రికి..
ఆగ్రహంగా ఉన్న వైసీపీ అసమ్మతివాదులు
రాజీనామా చేయడానికి సన్నాహాలు
బుధవారం వరకూ ఆగాలని స్థానిక నాయకుల బుజ్జగింపు
తిరువూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : తిరువూరు మునిసిపల్ చైర్‌పర్సన్ రాజీనామా అంశం నాటకీయ పరిణామాల మధ్య మరో గందరగోళానికి దారితీసింది. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం మధ్యలో చైర్‌పర్సన్ కస్తూరిభాయి అర్థంతరంగా వెళ్లిపోవడం, ఆ తర్వాత అస్వస్థతకు గురికావడం, రాజీనామా ఆమోదం పొందకపోవడం.. వంటి పరిణామాలపై కొందరు వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు గుర్రుగా ఉన్నారు. రాజీనామా విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని, లేదంటే ముకుమ్మడిగా తమ పదవులు, పార్టీకి రాజీనామా చేస్తామని వారంతా అల్టిమేటం జారీ చేయడంతో అధిష్ఠానం ఈ సమస్య పరిష్కారంపై మల్లగుల్లాలు పడుతోంది.
ఆది నుంచీ వివాదమే..
తిరువూరు మునిసిపాలిటీకి చెందిన 20 వార్డుల్లో 17 వార్డులు గెలుచుకున్న వైసీపీ.. చైర్‌పర్సన్ నియామకంలో తొలి నుంచి వివాదాలు ఎదుర్కొంటోంది. మొదట్లో చైర్‌పర్సన్‌గా మోదుగు ప్రసాద్ పేరును అప్పటి ఎమ్మెల్యే ప్రతిపాదించగా, అధిష్ఠానం కస్తూరిభాయిని ఖరారు చేసింది. అయితే, రెండేళ్ల తర్వాత రాజీనామా చేయాలని, మరొకరికి అవకాశం కల్పించాలని అప్పటి ఎమ్మెల్యే ఆదేశించారు. నాటి నుంచి వైసీపీ కౌన్సిలర్లలో విభేదాలు మొదలయ్యాయి. రెండేళ్ల తర్వాత ఆమె రాజీనామా చేయకపోవడంతో కొందరు వైసీపీ కౌన్సిలర్లు సహాయ నిరాకరణ చెపట్టారు. అధిష్ఠానం కూడా పట్టించుకోకపోవడంతో వివాదం ముదిరింది. పాలన నాలుగేళ్లు పూర్తవడంతో అసమ్మతి కౌన్సిలర్లు, కలెక్టర్, ఆర్డీవో, మునిసిపల్ కమిషనర్‌కు అవిశ్వాసం నోటీసు అందించారు. వివాదం తీవ్రం కావడంతో అధిష్ఠానం అసమ్మతివాదుల్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది. దీంతో గతనెల 3న కస్తూరిబాయి రాజీనామా సమర్పించారు. గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్ రాజీనామా ఆమోదించాల్సి ఉంది. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురయ్యారు. సమావేశం మధ్యలోనే ఆసుపత్రికి వెళ్లిపోయారు. దీంతో సమావేశం వాయిదా పడటంతో, వైసీపీ అమ్మతి కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నాయకులను కలిశారు. సమస్యను పరిష్కరించకుంటే, పార్టీకి, పదవులకు రాజీనామా చేసి, సొంత పనులు చేసుకుంటామని కౌన్సిలర్లతో పాటు పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు తెగేసి చెప్పారు. బుధవారం వరకు ఓపిక పట్టాలని, అన్ని సమస్యలు సర్దుకుంటాయని నాయకులు అసమ్మతి వాదుల్ని బుజ్జగించినట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్ రాజీనామాను ఆమోదిస్తే, బోర్డుకు ఉన్న 10 నెలల కాలంలో నూతన చైర్‌పర్సన్ ఎన్నుకునే అవకాశం ఉంటుందా, లేదా అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 19 , 2025 | 01:03 AM