కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ABN, Publish Date - May 01 , 2025 | 12:56 AM
అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. విజయవాడ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బుధవారం బాహాబాహీకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌పై బీజేపీ యువమోర్చా నాయకులు కోడిగుడ్లు, టమాటాలతో దాడికి పాల్పడటంతో వివాదం మరింత ముదిరింది.
కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ దాడికి యత్నం
అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది
యువమోర్చా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రరత్న భవన్‌లో బైఠాయించి నిరసన తెలిపిన షర్మిల
ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు
విజయవాడ/వన్‌టౌన్/గన్నవరం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. విజయవాడ వేదికగా బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బుధవారం బాహాబాహీకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌పై బీజేపీ యువమోర్చా నాయకులు కోడిగుడ్లు, టమాటాలతో దాడికి పాల్పడటంతో వివాదం మరింత ముదిరింది. తొలుత బీజేపీ యువమోర్చా నాయకులు.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల, కార్యకర్తలు, నాయకులు లోపల ఉన్నారు. బీజేపీ యువమోర్చా నాయకులు వచ్చారని తెలియగానే.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చి గొడవకు దిగారు. పరస్పర తోపులాటల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి యువమోర్చా నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఏఆర్ గ్రౌండ్స్‌కు తరలించారు. కాంగ్రెస్ కార్యాలయ గేటును పోలీసులు మూసేయగా, గేటు తెరవాలంటూ పోలీసులపై కాంగ్రెస్ నాయకులు వాదనకు దిగారు. ఇదంతా చూస్తున్న షర్మిల.. బీజేపీ కార్యాలయంపైకి వెళ్లేందుకు నాయకులకు సూచించినట్టు తెలిసింది. పోలీసులు గేట్లు తెరవకపోవడంతో చాలాసేపు షర్మిల, కాంగ్రెస్ నాయకులు కార్యాలయ ఆవరణలోనే ఆందోళన నిర్వహించారు. పోలీసులు షర్మిలకు నచ్చజెప్పినా వినలేదు. దాడికి ప్రయత్నించిన వారిపై కేసులు నమోదుచేసి, అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేసు నమోదుచేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆమె నిరసన విరమించారు. అనంతరం పోలీసులు షర్మిలను ఆమె వాహనంలోనే గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి షర్మిల బెంగళూరు వెళ్లారు.
నిఘా వైఫల్యం
ఆంధ్రరత్న భవన్ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. కేసరపల్లిలో షర్మిలను అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి నేరుగా గవర్నర్‌పేటలోని పార్టీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చినప్పుడు కనీసం నిఘా లేకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Updated Date - May 01 , 2025 | 12:56 AM