ఆంధ్రజ్యోతి చొరవ.. దివ్యాంగ విద్యార్థికి దారి
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:53 AM
ఐఐటీ బొంబాయిలో సీటు సాధించడమే ఆ విద్యార్థి కల. వైకల్యం ఉన్నప్పటికీ ఆ దిశగా ఎంతో కష్టపడి ప్రయత్నించి, సాధిం చాడు. కానీ, చివరి నిమిషంలో ఆ కలను చెరిపేసింది ఓ ప్రభుత్వ నిబంధన. అయినప్పటికీ పట్టు వదల్లేదు. ఆశ కోల్పోలేదు. తండ్రి, ఆత్మీయుల సహాయంతో, ఆంధ్రజ్యోతి సహకారంతో ప్రయత్నిం చాడు. ఆ ప్రయత్నమే అతని ఆశయానికి దారి చూపింది.
ఫలించనున్న బొంబాయి ఐఐటీ కల
దివ్యాంగుల కోటాలో ఆల్ ఇండియా మూడో ర్యాంక్
అనివార్య కారణలతో సీటు లభించని పరిస్థితి
ఆంధ్రజ్యోతి చొరవతో స్పందించిన ఇంటర్ డైరెక్టర్ కృతిశుక్లా
న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆనందంలో విద్యార్థి
విజయవాడ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : జేఈఈ మెయిన్స్‌లో దివ్యాంగుల కోటాలో సత్యసాయి శబరీష్ ఆల్ ఇండియాలో మూడో ర్యాంకు సాధించాడు. అన్నీ అనుకున్నట్టే ఐఐటీ బొంబాయిలో సీటు ఖాయమనుకునే సమయంలో జోసా కౌన్సెలింగ్ నిబంధన ఆ విద్యార్థిని ఒక్కసారిగా వెనక్కి లాగేసింది. రాష్ట్రస్థాయిలో ఇంటర్మీడియెట్ బోర్డు దివ్యాంగ విద్యార్థులకు ఒక్కో సంవత్సరానికి ఐదు సబ్జెక్టుల చొప్పున రెండేళ్లకు పది సబ్జెక్టులు ఇస్తుంది. ఒక్కో సంవత్సరానికి కనీసం నాలుగు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ విద్యా సంవత్సరం పూర్తయినట్టే. అలాగే, దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఒక లాంగ్వేజ్‌కు మినహాయింపు ఇచ్చేవారు. అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ రాస్తే సరిపోతుంది. కానీ, ఈ విధానాన్ని 2024 సంవత్సరానికి మాత్రమే వర్తించేలా అప్పట్లో జీవో విడుదల చేశారు. మొత్తం నాలుగు సబ్జెక్టుల మార్కులను సరాసరి చేసి, ఐదో సబ్జెక్టును కూడా కలిపేవారు. కానీ, ఈ జీవో 2024 విద్యా సంవత్సరానికి మాత్రమే అమలు చేసినట్లు తెలిసింది. అదే నిబంధన ఉందనే అభిప్రాయంతో సాయి శబరీష్ ఈ ఏడాది అదే మాదిరిగా ఇంటర్ పరీక్షలు రాశాడు. కానీ, ఈ ఏడాది ఆ నిబంధన లేదని తెలుసుకుని, బొంబాయి ఐఐటీలో సీటు సాధించడం కష్టమని తెలుసుకున్న సాయి శబరీష్ తన తండ్రి సహాయంతో అన్ని ప్రయత్నాలు చేశారు. చివరి ప్రయత్నంగా ‘ఆంధ్రజ్యోతి’ని సంప్రదించారు. ‘ఆంధ్రజ్యోతి’ విషయాన్ని ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్ కృతిశుక్లాకు తెలపగా, ఆమె వెంటనే స్పందించారు. యోగాంధ్ర కార్యక్రమంలో ఉన్నప్పటికీ మెసేజ్ ద్వారా సదరు విద్యార్థి పరిస్థితిని అడిగి తెలుసుకుని వెంటనే పాత జీవోను పునరుద్ధరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.
ఆశ వదిలేసిన సమయంలో ఆదుకున్నారు
మా అబ్బాయి బొంబాయి ఐఐటీలో సీటు వస్తుందనే నమ్మకం కోల్పోయాం. ఉదయం నుంచి కలవని అధికారి, తిరగని కార్యాలయం లేదు. చివరి ప్రయత్నంగా ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాన్ని సంప్రదించాం. వారి సూచనలు, సలహాలతో ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్ కృతిశుక్లాను సంప్రదించాం. ఆమె ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నప్పటికీ ఓపికతో మా సమస్యను తెలుసుకున్నారు. పాత జీవోను పునరుద్ధరించి సీటు వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆశలు వదిలేసుకున్న సమయంలో సమస్యకు వెంటనే పరిష్కారం చూపిన ఆంధ్రజ్యోతికి, కృతిశుక్లాకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. - కృష్ణమూర్తి, విద్యార్థి తండ్రి
Updated Date - Jun 20 , 2025 | 12:53 AM