వాయువేగంగా..
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:55 AM
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (టీఈపీఆర్) రూపకల్పనకు కన్సల్టెంట్ కోసం ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను విడుదల చేసింది. రాజధాని అమరావతిలో 5వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు
ఆర్‌ఎఫ్‌పీ విడుదల చేసిన ఏపీఏడీసీఎల్
టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు కోసం కసరత్తు
ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్డు మధ్య ఏర్పాటు చేసే అవకాశం
విజయవాడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (టీఈపీఆర్) రూపకల్పనకు కన్సల్టెంట్ కోసం ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడీసీఎల్) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను విడుదల చేసింది. రాజధాని అమరావతిలో 5వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీఏడీసీఎల్ అధికారులు టీఈపీఆర్ కోసం కన్సల్టెంట్ నియామకానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎయిర్‌పోర్టు కోసం అవుటర్, ఇన్నర్ రింగ్‌రోడ్డు మధ్యలో భూములను సమీకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సాంకేతిక, ఆర్థిక, సాఽధ్యాసాధ్యాలపై దృష్టిపెట్టింది. సమగ్ర నివేదిక ఇవ్వటానికి కన్సల్టెన్సీ సంస్థకు 32 వారాల సమయాన్ని ఏపీఏడీసీఎల్ ఇచ్చింది. ఆసక్తి కలిగిన కన్సల్టెన్సీలు చేయాల్సిన సర్వేలపై కూడా ఆర్‌ఎఫ్‌పీలో సమగ్ర వివరాలను పొందుపరిచారు. ముందుగా అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. ఆ తర్వాత టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలి. దీని తర్వాత భూమికి సంబంధించి సమగ్ర వివరాలు అందించాలి. విమానాశ్రయ ప్రతిపాదిత స్థలానికి సంబంధించి సర్వే చేపట్టి, ఆ తర్వాత మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయాలి. ఫైనాన్షియల్ మోడల్‌పై కూడా నివేదిక ఇవ్వడంతో పాటు పర్యావరణ, సోషల్ ఇంపాక్ట్ సర్వే కూడా నిర్వహించాలి. డిమాండ్, మార్కెట్ అసెస్‌మెంట్ స్టడీ, కేస్ స్టడీ, బెస్ట్ ప్రాక్టీసెస్ వంటి వివరాలను కూడా కన్సల్టెన్సీ సంస్థ అందించాలి. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన విస్తీర్ణం, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ డిమాండ్ అసెస్‌మెంట్, ఎకనామిక్-ఫైనాన్షియల్ వయబిలిటీ వంటివి కూడా పొందుపరచాలి. పాసెంజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్ డిజైన్ల రూపకల్పనతో పాటు కార్లు, బస్సులు, కార్గో వెహికల్స్‌కు పార్కింగ్ ప్లేస్‌లు నిర్ణయించటం, పర్యాటకులకు విమానాశ్రయంలోనే వసతి సదుపాయాలు, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా నివేదికలో పొందుపరచాలి.
Updated Date - Apr 23 , 2025 | 12:55 AM