ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతా పెద్దవారే!

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:50 AM

సాధారణంగా అధిక వడ్డీకి ఆశపడి సామాన్యులు మోసపోతుంటారు. కానీ, రూ.300 కోట్లకు ఎగనామం పెట్టిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారంతా ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యులేనంటే నమ్ముతారా? కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు సైతం కనీసం ఆ కంపెనీ వివరాలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి మోసపోయిన ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.

విజయవాడలోని అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయం

‘అద్విక’లో పెట్టుబడులు పెట్టినవారంతా ప్రముఖులే..

ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలే ఎక్కువ

లిస్టులో పోలీసులు, వైద్యులు కూడా..

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాలవారు

ట్రేడింగ్‌ కంపెనీ, పీఎస్‌కు బాధితుల క్యూ

అధిక వడ్డీ ఆశచూపి ఆకర్షించిన ఎండీ ఆదిత్య

1,200 మంది ఖాతాదారులు.. రూ.300 కోట్ల పెట్టుబడి

బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్న బాధితులు

సొమ్మంతా హవాలాలో దుబాయి చేరినట్టు గుర్తింపు

ల్యాప్‌టాప్‌లో బయటపడిన ఆదిత్య రాసలీలలు

విజయవాడ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : రూ.లక్ష పెట్టుబడి పెడితే, నెలకు రూ.6 వేలను వడ్డీగా చెల్లిస్తామని చెప్పి ఏజెంట్లు, ఖాతాదారులకు ఝలక్‌ ఇచ్చిన విజయవాడలోని అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్యతో పాటు కిరణ్‌ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే, ఆదిత్య చేసిన లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొత్తం 1,200 మంది ఖాతాదారుల నుంచి రూ.300 కోట్లను పెట్టుబడిగా వసూలుచేసి బోర్డు తిప్పేయడంతో ఈయన లీలలు వెలుగులోకి వస్తున్నాయి.

బాధితులుగా ప్రముఖులు

ఆదిత్య.. విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఎదురుగా, ఈఎస్‌ఐ రోడ్డులో ఉన్న ఫార్చ్యూన్‌ హైట్స్‌లో అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల కిందట ప్రారంభించాడు. పెట్టుబడి పెట్టినవారికి నెలకు రూ.6 వేల వడ్డీని గత డిసెంబరు వరకు చెల్లించాడు. ఆ తర్వాత నుంచి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దీంతో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగింది. ఆదిత్య ఇస్తున్న వడ్డీ సాధారణ, మధ్యతరగతి వారినే కాదు.. ప్రముఖులను కూడా ఆకర్షించింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, వైద్యులు ఇక్కడ రూ.లక్షలు పెట్టుబడి పెట్టారు. రాష్ట్రమంత్రి అనుచరులు, కేంద్రమంత్రి సహాయకులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇలా పెట్టుబడులు పెట్టిన వారికి అసలు ఆదిత్య అంటే ఎవరో తెలియదు. అతని ముఖం కూడా చూడలేదు. కొంతమంది ప్రత్యక్షంగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుబడులు పెట్టగా, మరికొందరు స్నేహితుల ద్వారా డబ్బు పెట్టించారు. ఒకప్పుడు భవానీపురం ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, ఇప్పుడు నిఘా విభాగంలో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ రూ.50 లక్షలను తన స్నేహితుడి ద్వారా పెట్టుబడి పెట్టించాడు. అలాగే, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఏలూరు జిల్లాలకు చెందిన రాజకీయ నేతలు.. వారి అనుచరుల ద్వారా పెట్టుబడులు పెట్టించారు. ఆదిత్యతో పాటు అతడి స్నేహితుడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పత్రికల్లో రావడంతో ఖాతాదారులు అద్విక ట్రేడింగ్‌ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే మాచవరం పోలీసులు ఆదిత్య, కిరణ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం మరో 20 మంది బాధితులు పోలీసుల వద్దకు వచ్చి తమ గోడు చెప్పుకొన్నారు. కాగా, పోలీసులు ఆదిత్యను తీసుకుని అద్విక కార్యాలయానికి వెళ్లారు. లోపల రికార్డులను, పెట్టుబడిదారుల వివరాలను పరిశీలించారు. ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ఆదిత్య వెనుక ఇంకా మరికొంతమంది ఉన్నారని పోలీసులు గుర్తించారు.

డిలీట్‌ చేసిన నెంబరెవరిది?

పోలీసుల అదుపులో ఉన్న ఆదిత్య తన భార్య సుజాతతో మాట్లాడుకుంటానని ఓ కానిస్టేబుల్‌కు చెప్పాడు. దీంతో ఆ కానిస్టేబుల్‌ తన సెల్‌ఫోన్‌ ఇచ్చాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత డయల్‌ కాల్స్‌లో ఆ నెంబర్‌ను డిలీట్‌ చేసి ఫోన్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఆ నెంబరు ఎవరిదన్నది ప్రశ్నగా మారింది. భార్య సుజాతతోనే మాట్లాడాడా, ఇంకెవరితోనైనా సంభాషించాడా అన్నది సస్పెన్స్‌గా ఉంది.

‘అద్విక’ పేరుతో మోసం

అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యకలాపాలు ఫార్చ్యూన్‌ హైట్స్‌ మొదటి అంతస్థులో జరుగుతుండగా, అద్విక మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ థ్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ అనే మరో సంస్థను గురునానక్‌ కాలనీలో నిర్వహిస్తున్నారు. వివిధ ప్రైవేట్‌ బ్యాంకుల్లో మేనేజర్ల హోదాల్లో పనిచేసిన కొంతమంది కలిసి ఈ సొసైటీని గత నవంబరులో ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ఆదిత్య తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 14 మంది ఒక్కొక్కరు రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి ఈ సొసైటీ నడుపుతున్నారు. దీనికి ఉన్న అద్విక పేరు తన ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో కలవడంతో మొత్తం ఈ సొసైటీ తనదని ఆదిత్య చెప్పుకొన్నాడు. ట్రేడింగ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారందరికీ ఇదే చెప్పాడు. అద్విక మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ప్రారంభించాక బ్యాంకింగ్‌ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించుకున్నారు. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేసిన కిరణ్‌ అనే వ్యక్తికి సొసైటీలోని సభ్యులు ఈ విషయం చెప్పారు. అప్పుడు కిరణ్‌ ఆదిత్య భార్య సుజాతను వారికి పరిచయం చేశాడు. కొటక్‌ మహేంద్ర బ్యాంక్‌లో గోల్డ్‌లోన్‌ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండటంతో సుజాతను చైర్మన్‌ చేశారు. ఈ సొసైటీ ప్రారంభోత్సవానికి ట్రేడింగ్‌ కంపెనీలో సభ్యులుగా ఉన్న వారందరినీ ఆదిత్య పిలిచాడు. అప్పటికే ఈ సొసైటీ తమదేనని బిల్డప్‌ ఇచ్చాడు. తర్వాత అద్విక మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ తనదేనని ఆదిత్య చెప్పుకొంటున్న విషయం సొసైటీ పాలకవర్గానికి తెలిసింది. దీంతో చైర్మన్‌గా ఉన్న సుజాతను పిలిచి అడిగారు. సొసైటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఐదారుసార్లు మాత్రమే ఈ కార్యాలయానికి వచ్చిన ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌ 10న పదవికి రాజీనామా చేసింది.

అరెస్టుకు ముందు సమావేశం

పోలీసులు అరెస్టు చేయడానికి ముందు ఆదిత్య ఏజెంట్లతో సమావేశం నిర్వహించాడు. అప్పటికే నష్టాలు ఉన్నాయని తెలిసినా ఏజెంట్లను నమ్మించే ప్రయత్నం ఈ సమావేశంలో చేశాడు. తనను నమ్మితే మొత్తం చెల్లింపులు చేస్తానని భరోసా ఇచ్చాడు. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక తాము నమ్మలేమని ఏజెంట్లు మూకుమ్మడిగా చెప్పారు. ఆ సమావేశంలో ఆదిత్య ప్రసంగ వీడియోలు ‘ఆంధ్రజ్యోతి’కి అందాయి.

హవాలా మార్గంలో దుబాయికి..

పెట్టుబడులుగా వసూలు చేసిన నిధులను ఆదిత్య హవాలా మార్గంలో దుబాయికి మళ్లించినట్టు పోలీసులు గుర్తించారు. దుబాయిలో షబానా అనే ట్రేడింగ్‌ కంపెనీకి ఈ డబ్బు వెళ్లింది. కొద్దిరోజుల కిందట ఆదిత్య తన పుట్టినరోజు వేడుకలను వైజాగ్‌లోని స్టార్‌ హోటల్‌లో నిర్వహించాడు. దీనికి అక్షరాలా రూ.70 లక్షలు ఖర్చయ్యింది. విజయవాడ నుంచి ఏజెంట్లను, ఉద్యోగులను విమానంలో అక్కడికి తీసుకెళ్లాడు. అంతేకాదు.. ఆదిత్య శృంగారలీలలు కూడా బయటపడుతున్నాయి. ఆదిత్య ల్యాప్‌టాప్‌ను పోలీసులు విశ్లేషించగా, అందమైన అమ్మాయిలు, ఆదిత్య నగ్నంగా ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ అందమైన అమ్మాయిల ఫొటోలను ఆయన ఒక ఫోల్డర్‌లో భద్రపరిచాడు.

సొసైటీతో ఆదిత్యకు సంబంధం లేదు

ఎన్టీఆర్‌ కాలనీలోని అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి అద్విక మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీతో ఎలాంటి సంబంధం లేదు. 14 మంది డైరెక్టర్లుగా సహకార శాఖ అనుమతితో ఈ సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. మహిళా సాధికారత కోసం ఇందులో మహిళలను ఉద్యోగులుగా నియమించాం. వారికి బ్యాంకింగ్‌ రంగంపై అవగాహన కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ బ్యాంకింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇప్పించాం. వాళ్లు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఉద్యోగులుగా నియమించాం. మా సొసైటీలో ఖాతాదారులకు సంబంధించిన అన్ని వివరాలు పక్కాగా ఉన్నాయి. అద్విక ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సభ్యులు చెల్లింపులు చేయకపోవడంతో చాలామంది ఖాతాదారులు మా వద్దకు వచ్చారు. ఈ సొసైటీలో అతనికి సంబంధం లేదని చెప్పాం. మా సొసైటీ పేరు, అతని కంపెనీ పేరు ఒకటే కావడంతో ఈవిధంగా ప్రచారం చేసుకున్నాడు. అందుకే మా సొసైటీ పేరును మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం. సంస్థను ప్రారంభించి ఏడాది కాకపోవడంతో సాధ్యం కాలేదు.

- కుందేటి రమేశ్‌, సీఎఫ్‌వో, అద్విక మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ

Updated Date - Jun 28 , 2025 | 12:50 AM