మూడేళ్లలో మెట్రో
ABN, Publish Date - Jul 26 , 2025 | 01:10 AM
రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు జనరల్ కన్సల్టెంట్లతో ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. విజయవాడలోని ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలో ఆయా కన్సల్టెన్సీ సంస్థలతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒప్పందాలు చేసుకుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు స్పెయిన్‌కు చెందిన ‘టి ప్సా’ సంస్థతోనూ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్‌కు చెందిన శిస్ర్టా సంస్థను జనరల్ కన్సల్‌టెంట్లుగా నియమించుకుంది.
విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు పూర్తికి ఒప్పందం
విజయవాడకు ‘టిప్సా’, విశాఖకు ‘శిస్ర్టా’ జనరల్ కన్సల్టెన్సీల నియామకం
మంత్రి నారాయణ సమక్షంలో ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎంఓయూ
విజయవాడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు జనరల్ కన్సల్టెంట్లతో ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఒప్పందాలను కుదుర్చుకుంది. విజయవాడలోని ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలో ఆయా కన్సల్టెన్సీ సంస్థలతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒప్పందాలు చేసుకుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు స్పెయిన్‌కు చెందిన ‘టి ప్సా’ సంస్థతోనూ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్‌కు చెందిన శిస్ర్టా సంస్థను జనరల్ కన్సల్‌టెంట్లుగా నియమించుకుంది. నాలుగేళ్ల పాటు విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం, నిర్వహణ వంటి సేవలను టిప్సా, శిస్ర్టా సంస్థలు అందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను టిప్సా సంస్థకు రూ.188 కోట్లు, శిస్ర్టా సంస్థకు రూ.214 కోట్లు చెల్లించేందుకు ఏపీఎంఆర్‌సీఎల్ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పి.నారాయణ సమక్షంలో ఎంఓయూ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సత్వర రవాణా వ్యవస్థలను ప్రజలకు అందించటం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ మెట్రో ప్రాజెక్టులను గాడిన పెడుతున్నామన్నారు. నగరాలలో పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ సమస్యలకు మెట్రో రైళ్లు మాత్రమే పరిష్కారమన్నారు. దీనిని గుర్తించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించాలన్న ఉద్దేశంతో వాటికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. విశాఖపట్నం మెట్రో టెండర్లను పిలిచామని, విజయవాడ మెట్రో టెండర్లు కూడా కొద్ది రోజుల్లో ఆహ్వానిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో, విజయవాడలో రూ.10,118 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడుతున్నామని నారాయణ వెల్లడించారు. రెండు మెట్రో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం 20 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, మిగిలిన 60 శాతం కేంద్ర ప్రభుత్వం ఇప్పించే రుణంతో చేపట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ 20 శాతం వాటాగా విజయవాడలో ఏపీసీఆర్డీఏ, విశాఖలో వీఎంఆర్డీఏ ద్వారా నిధులు సమకూర్చనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-1 లో 3 కారిడార్లుగా 46.23 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కిలోమీటర్ల మేర 29 స్టేషన్లతో కారిడార్-1, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటర్ల మే 6 స్టేషన్లతో కారిడార్-2, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర 7 స్టేషన్లతో కారిడార్-3 పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ వస్తుందని తెలిపారు. విశాఖ మెట్రో కోసం కేంద్ర నిధులు రూ.2018 కోట్లు, రాష్ట్ర నిధులు రూ.2863 కోట్లు, భూ సేకరణకు రూ.847 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. విజయవాడ మెట్రో రైలుకు మొదటి దశలో 35.04 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నట్టు చెప్పారు. గన్నవరం బస్‌స్టేషన్ నుంచి పీఎన్‌బీఎస్ వరకు 25.95 కిలోమీటర్ల పొడవున కారిడార్-1, పెనమలూరు సెంటర్ నుంచి బందరు రోడ్డు మీదుగా పీఎన్‌బీఎస్‌కు వరకు 12.45 కిలోమీటర్ల చొప్పున కారిడార్-2 మొత్తంగా 33 స్టేషన్లతో నిర్మించనున్నట్టు చెప్పారు. విజయవాడ మెట్రో భూ సేకరణకు రూ.1152 కోట్ల మేర ఖర్చు అవుతుందని నారాయణ వెల్లడించారు. రుణంగా తీసుకునే మొత్తాన్ని వాయిదాల పద్దతిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చెల్లిస్తుందని తెలిపారు. విశాఖ మెట్రోకు 99.75 ఎకరాలు, విజయవాడ మెట్రో 91 ఎకరాల భూములు అవసరమౌతున్నాయని, భూ సేకరణకు నోటీసులు ఇచ్చామని తెలిపిన మంత్రి మూడేళ్లలో మెట్రో రైల్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.
Updated Date - Jul 26 , 2025 | 01:10 AM