రోడ్డుపక్కన కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:04 AM
రోడ్డు పక్కన చాపలు, గంపలు, బుట్టలు అల్లుకుంటూ కూర్చున్న వారిపైకి ఓ కారు దూసుకుపోవటంతో ఒక మహిళ చనిపోగా, ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.
మహిళ మృతి, ముగ్గురికి స్వల్ప గాయాలు
విద్యాధరపురం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన చాపలు, గంపలు, బుట్టలు అల్లుకుంటూ కూర్చున్న వారిపైకి ఓ కారు దూసుకుపోవటంతో ఒక మహిళ చనిపోగా, ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గుప్తా సెంటర్ వద్ద శనివారం సాయం త్రం జరిగింది. మృతురాలి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశా రు. నాలుగు స్తంభాల సెంటర్, రామాలయం వద్ద పిల్లి యశోద కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆమెతో పాటు భర్త, అత్త, మామ, ఆడబిడ్డ, ఇంకా పలువురు గుప్తా సెంటర్ షాదీఖానా వద్ద రోడ్డు పక్కన ఎదురు కర్రలతో బుట్టలు, చాపలు, గంపలు అల్లుకుని, అమ్ముకుని జీవిస్తుంటారు. సాయంత్రం ఐదున్నర గంటలకు యశోద, ఆమె అత్తమామలు పిల్లి రాములమ్మ(50), లక్ష్మయ్య, ఆడబిడ్డ దుర్గ కూర్చుని బుట్టలు అల్లుకుంటుండగా కుమ్మరిపాలెం సెంటర్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన కారు వారి పైకి దూసుకెళ్లింది. లక్ష్మయ్య, యశోద, ఆమె ఆడబిడ్డ దుర్గ పక్కకు పడిపోయారు. వారి ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. రాములమ్మ మీదుగా కారు వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రాములమ్మను భవానీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పిల్లి యశోద ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Apr 20 , 2025 | 12:04 AM