కాసులు కురిపిస్తున్న కాటా డ్యూటీ
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:29 AM
ఎన్టీటీపీఎస్‌లో బూడిద కాటా డ్యూటీకి భలే గిరాకీ ఏర్పడింది. ఇక్కడ డ్యూటీ చేస్తే రోజుకు వేల రూపాయల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఉద్యోగులు ఎదురు డబ్బులిచ్చి మరీ డ్యూటీ వేయించుకుంటున్నారని తెలిసింది. ‘కాసు కొట్టు.. కాటా డ్యూటీ పట్టు’ అన్న చందంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు యాస్ కాటా డ్యూటీలో అక్రమంగా సంపాదించే డబ్బును వాటాలు వేసుకొని మరీ పంచేసుకుంటున్నారని సమాచారం. ఇందులో ఉన్నతాధికారుల నుంచి కిందస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఒక ఏడీఈ కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
- ఎన్టీటీపీఎస్‌లో యాస్ కాటా డ్యూటీకి భలే గిరాకీ
- ఎదురు డబ్బులిచ్చి డ్యూటీలు వేయించుకుంటున్న ఉద్యోగులు
- అంతర్గత బదిలీల్లో అధికారుల చేతివాటం
- అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ఎన్టీటీపీఎస్‌లో బూడిద కాటా డ్యూటీకి భలే గిరాకీ ఏర్పడింది. ఇక్కడ డ్యూటీ చేస్తే రోజుకు వేల రూపాయల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఉద్యోగులు ఎదురు డబ్బులిచ్చి మరీ డ్యూటీ వేయించుకుంటున్నారని తెలిసింది. ‘కాసు కొట్టు.. కాటా డ్యూటీ పట్టు’ అన్న చందంగా తయారైంది ఇక్కడ పరిస్థితి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు యాస్ కాటా డ్యూటీలో అక్రమంగా సంపాదించే డబ్బును వాటాలు వేసుకొని మరీ పంచేసుకుంటున్నారని సమాచారం. ఇందులో ఉన్నతాధికారుల నుంచి కిందస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఒక ఏడీఈ కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం):
ఎన్టీటీపీఎస్‌లో విద్యుత ఉత్పత్తి నిమిత్తం బొగ్గును మండించగా వచ్చే బూడిదకు మంచి డిమాండ్ ఉంది. బూడిద ఇప్పుడు బంగారం అయ్యింది. రాష్ట్రంలో ఉన్న పలు సిమెంట్ కంపెనీల వారు ఎన్టీటీపీఎస్‌తో ఎంవోయూలు కదుర్చుకొని ట్యాంకర్లలో బూడిదను రవాణా చేసుకుంటున్నారు. బ్రిక్స్ కంపెనీల వారు సైతం బాడి లారీలు, ట్రాక్టర్లు ద్వారా బూడిదను తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోజుకు సుమారు 150 పైగా ట్యాంకర్లు, లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్లాంట్లో ఉన్న సైలో వద్ద బూడిద లోడ్ చేసుకున్నాక కాటా మిషన్ వద్ద బరువు తూకం వేయించుకొని ట్యాంకర్లు, లారీలు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాహనం లోనికి రావాలన్నా, బయటకు వెళ్లాలన్నా యాస్ కాటాలో ఉన్న ఉద్యోగులదే కీలక పాత్ర. డబ్బులు ముట్టకపోతే లోడింగ్ చేయరని, వాహనాలను లోనికి కూడా అనుమతించడం లేదని పలువురు వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండతో ఈప్రక్రియ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా జరుగుతోందని సమాచారం. ప్రతి రోజు ఇలా కాటా వద్ద వచ్చే డబ్బులో 30 శాతం ఒక అధికారికి, మిగిలిన 70 శాతం ఉద్యోగులకు, వారికి సహకరించే వారికి పోతున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వాటాల దగ్గర తేడా వచ్చి ఈ విషయం కాస్త బయటకు పొక్కింది.
డబ్బు కోసమే అదనపు సిబ్బంది నియామకం
యాస్ కాటా వద్ద వాస్తవానికి విధులు నిర్వహించేందుకు సరిపడ సిబ్బంది ఉన్నా అదనంగా నియమిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డ్యూటీ చేస్తే డ్యూటీ ముగించుకొని ఇంటికి డబ్బులతో వెళ్లే వెసులుబాటు ఉండటంతో ముడుపులు చెల్లించి మరీ యాస్ కాటా డ్యూటీ కోసం ఉద్యోగులు క్యూ కడుతున్నారు. ఈక్రమంలో అంతర్గత బదిలీల్లో భారీగా నగదు చేతులు మారుతుందోని ఆరోపణలున్నాయి. ఖాళీ అయిన చోట ఉద్యోగులను ఏర్పాటు చేయకుండానే గతంలో పని చేసిన ఒక ఉన్నతాధికారి కాసులకు కక్కుర్తి పడి కాటా వద్ద ఉద్యోగులను నియమించారు. కోల్డ్ ప్లాంట్, బ్రాయిలర్ మిల్స్‌లో సుదీర్ఘ అనుభవం గల ఉద్యోగులను తీసుకొని వచ్చి యాస్ కాటా డ్యూటీ వేయడం వల్ల ప్లాంట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ యాస్ డ్యూటీకి బదిలీ చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఎన్టీటీపీఎస్ ఉన్నతాఽధికారులు స్పందించి ప్లాంట్‌లో జరుగుతున్న ఈ అక్రమాలపై దృష్టి సారించి అక్రమార్కుల భరతం పట్టాలని ప్లాంట్ పతిష్టను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
అంతా అయోమయం!
ప్లాంట్ నుంచి బూడిద రవాణా చేసుకునే అనుమతులు ఎవరికి ఉన్నాయో, ఎవరికి లేవో, ఏ వాహనం లోనికి వెళుతుందో, ఏ వాహనం బయటకు వస్తుందో తెలియక ఎస్‌పీఎఫ్ స్టాప్ తలలు పట్టుకుంటున్నారు. వాహనాలను లోడింగ్‌కు అనుమతిస్తూ ఉద్యోగులు గేట్ పాస్ ఇస్తే దాన్ని ఎస్‌పీఎఫ్ అఽధికారులు లోనికి పంపుతారు. వచ్చి పోయే వాహనాలకు అసలు అనుమతి పత్రాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తమకు తెలపాలని గతంలో పని చేసిన ఉన్నతాధికారిని లిఖిత పూర్వకంగా కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఈ విషయాన్ని సైతం ఉన్నధికారులు పరిగణలోకి తీసుకొని బూడిద రవాణాలో జరుగుతున్న అవినీతి బాగోతానికి చరమగీతం పాడాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jun 18 , 2025 | 01:29 AM