Kanchi Kamakoti Peetham: కంచి పీఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మ
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:30 AM
కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన గణేశ్ శర్మ నియమితులయ్యారు. ఆయనకు ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా సన్యాస దీక్ష ఇవ్వనున్నారు.
అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడికి అవకాశం
బాసర జ్ఞానసరస్వతి దేవస్థానంలో విధులు
తర్కం, మీమాంస, సామ, యజుర్వేదాలలో స్వామీజీ శిక్షణ
తండ్రి అన్నవరం దేవస్థానం
30న సన్యాస దీక్ష ఇవ్వనున్న శంకరాచార్య విజయేంద్ర సరస్వతి
చెన్నై/అన్నవరం/బాసర, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్ష ఇస్తారని కంచి పీఠం శ్రీకార్యం మేనేజర్ చల్లా విశ్వనాథ శాస్త్రి శుక్రవారం తెలిపారు. అన్నవరం దేవస్థానం వ్రత పురోహితుడిగా పనిచేస్తున్న దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతులకు 2000 ఏప్రిల్ 24న గణేశ శర్మ జన్మించారు. తల్లి గృహిణి. గణేశశర్మ ఆరో ఏటనే రత్నాకర భట్టు వద్ద రుగ్వేదం అభ్యసించి నిష్ణాతులయ్యారు. అనంతరం తెలంగాణలోని బాసర జ్ఞానసరస్వతి దేవస్థానంలో పండితుడిగా వ్యవహరించారు. ఆ సమయంలో బాసర పర్యటనకు వచ్చిన విజయేంద్ర సరస్వతి ఆయనను శంకర మఠానికి తీసుకెళ్లారు.
అక్కడ తర్కం, మీమాంసతో పాటు సామవేదం, యజుర్వేదంలో స్వామీజీ స్వయంగా శిక్షణ ఇచ్చారు. 2018 జనవరి 28న జయేంద్ర సరస్వతి మహాసమాధి చెందడంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆరేళ్ల పాటు ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. కాగా, సన్యాస దీక్ష స్వీకరించిన అనంతరం మే 2న కంచి పీఠంలో జరిగే ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో విజయేంద్ర సరస్వతితో పాటు ఉత్తరాధికారి కూడా పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. గణేశ శర్మ నియామకంపై స్థానిక పండితులు, పురోహితులు, గ్రామస్థులు, బాసర దేవస్థానం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 04:30 AM