ఫుట్‌పాతలనూ వదలని వ్యాపారులు
ABN, Publish Date - Jun 14 , 2025 | 12:15 AM
‘కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లు ఒంటిమిట్టలో వ్యాపారులు ఫుట్‌పాతలను కూడా వదలడం లేదు.
ఒంటిమిట్ట, జూన 13 (ఆంధ్రజ్యోతి): ‘కాదేదీ కబ్జాకనర్హం అన్నట్లు ఒంటిమిట్టలో వ్యాపారులు ఫుట్‌పాతలను కూడా వదలడం లేదు. స్థానిక పోలీసుస్టేషన నుంచి కోదండరామాలయం వరకు రోడ్డుకిరువైపులా అధికారులు ఫుట్‌పాతలను ఏర్పాటు చేశారు. కానీ ఇవి ప్రయాణికులకు కాకుండా వ్యాపారులకు ఉపయోగపడుతున్నాయి. కారణం వ్యాపారులు తమ సరకులు ఫుట్‌పాతలపై పెట్టి విక్రయిస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కడప - చెన్నై ప్రధాన రహదారిన ఒంటిమిట్ట ఉండడంతో ప్రతినిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భారీ వాహనాలు అధిక సంఖ్యలో వెళుతుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌అండ్‌బి అధికారులు ఫుట్‌పాతలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఫుట్‌పాతలపై కాకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కోదండరామాలయానికి రాష్ట్ర గుర్తింపు రావడంతో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది ఒంటిమిట్టకు వచ్చి బస్టాండు నుంచి రోడ్డుపై నడుచుకుంటూ ఆలయానికి వెళుతున్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నడిచే ప్రయాణికులకు రక్షణ కరవైందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పుట్‌పాతలు ప్రయాణికులకు ఉపయోగపడేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jun 14 , 2025 | 12:16 AM