అడ్డూఅదుపు లేకుండా ఇసుక దోపిడీ
ABN, Publish Date - Jul 12 , 2025 | 11:41 PM
డివిజన్ కేంద్రమైన జమ్మలమడుగు రెవెన్యూ పరిధిలో ఇసుక దోపిడీకి అడ్డూఅదుపులేకుండా పోతోంది.
ట్రాక్టర్లు, టిప్పర్లతో సాగుతున్న అక్రమ రవాణా దేవగుడి తదితర ప్రాంతాల్లో డంపు చేస్తున్న వైనం పట్టించుకోని అధికారులు
జమ్మలమడుగు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రమైన జమ్మలమడుగు రెవెన్యూ పరిధిలో ఇసుక దోపిడీకి అడ్డూఅదుపులేకుండా పోతోంది. రాత్రింబవళ్లు ట్రాక్టరు, టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా పట్టిం చుకునేవారు కరువయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని దానవులపాడు, సున్నపురాళ్లపల్లె గ్రామాల మధ్య పెన్నానదిలో ఇసుక గుంతలు దర్శనమిస్తున్నాయి. పగలు ఇసుక ట్రాక్టర్లకు ఇసుక నింపుతారని ఇటీవల రాత్రి సమయాల్లో ఇసుకను పెన్నానది పక్కన డంప్ చేసి బయటి ప్రాంతాలకు తరలిస్తారని స్థానికులు వాపోతున్నారు. అలాగే దేవగుడి గ్రామంలో ఎస్సీ కాలనీ పక్కనే పెన్నానది సుగుమంచిపల్లె వెళ్లే సర్కిల్‌లో ఇసుక డంప్‌లు ఉన్నాయి. రాత్రి సమయంలో అక్కడ టిప్పర్లకు ఇటాచీలతో ఇసుకను నింపుకుని పి.సుగుమంచిపల్లె గ్రామం మీదుగా ప్రొద్దుటూరు, కర్నూలు వైపు తరలిస్తున్నారని దీంతో ఇసుక వనరులు తగిపోయి తాగునీ టికి సైతం ఇక్కట్లు పడుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పి.సుగుమంచిపల్లె గ్రామానికి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా టిప్పరు డ్రైవర్ ఏమి సమస్య వచ్చిందో అక్కడే ఇసుకను డంపుచేసి వెళ్లిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఇసుక ఉండడం, వాహనాలు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు రోడ్డులో పెన్నానది పరిసర ప్రాంతాల్లో బోర్ల కింద రైతులు పంటలు సాగు చేసేవారు ఆయా గ్రామాలకు సరఫరా అయ్యే మంచినీటి బోర్ల వద్ద ఇసుక లేక బోర్లకు నీళ్లురాక పంటలను పొలాల్లోనే వదలుకోవా ల్సి వస్తోందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు డివిజన్ కేంద్రంలో అధికారులందరికి తెలిసినా ఆ ప్రాంతాలకు వచ్చి పరిశీలించడానికి జంకుతున్నట్లు కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా దోపిడీని అరికట్టాలని లేకుంటే తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సవస్తుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
ఇసుక అక్రమ దోపిడీ చేస్తున్న ప్రాంతాలను రెవెన్యూ, పోలీసు అధికారులతో వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇసుక అక్రమ రవా ణా జరుగకుండా రెవెన్యూ సిబ్బందితో నిఘాపెంచాం
-శ్రీనివాసులరెడ్డి, తహసీల్దార్, జమ్మలమడుగు
Updated Date - Jul 12 , 2025 | 11:41 PM