వాడీవేడిగా పుల్లంపేట మండల సర్వసభ్య సమావేశం
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:07 PM
పుల్లంపేట మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందంటూ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుల్లంపేట, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : పుల్లంపేట మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందంటూ ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పుల్లంపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి అధ్యక్షతన వాడివేడిగా జరిగింది. షాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన కేకే చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఉపాధి హామీ ఏపీవో శ్రీనివాసులు తమ శాఖ పనితీరు సభకు తెలియజేస్తుండగా ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని 22 పంచాయతీల్లో మూడు వేల మంది కూలీలు ఉండగా ఒక్క పంచాయతీలోనే 1200 మంది ఎలా పనిచేస్తారన్నారు. ఒకచోట పనిచేసి మూడు ఫొటోలు, మూడు మస్టర్లు ఒకే ఫొటోతో చేస్తున్నారని, ఇలా రోజుకు అధికంగా కూలీల పేరుతో డబ్బు స్వాహా చేస్తున్నారని ఆధారాలు సభ ముందు ఉంచారు. ఈ యేడాది రూ.63 లక్షల ఉపాధి పనులు దుర్వినియోగం అయ్యాయన్నారు. ఏపీవో శ్రీనివాసులను పదే పదే హెచ్చరించినా ఫలితం లేదన్నారు. విచారణ చేపట్టాలన్నారు. అలాగే దళిత వర్గానికి చెందిన ఎంపీటీసీ తన భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే దళిత వర్గానికి చెందిన ఎంపీటీసీ తన భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేసి చాలా కాలం అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. 50 సెంట్ల భూమి కొని దాని హద్దులు చూపి న్యాయం చేయాలని తహసీల్దారును కోరితే కోర్టుకు పోయి తేల్చుకోమని చెప్పడాన్ని బట్టి చూస్తే పేదలకు న్యాయం జరగడంలేదని తహసీల్దారు పుల్లారెడ్డిపై ఎంపీపీ మండిపడ్డారు. తాను కొన్న భూమికి హద్దులు చూపాలని చలానా కడితే తనకే న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలపై ప్రణాళికలు తయారు చేస్తున్నారన్నారు. వైస్ ఎంపీపీలు జయ, వెంకటనరసమ్మ, ఏవో శ్రీధర్‌రెడ్డి, తహసీల్దారు పుల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 11:07 PM