ఉపాధిలో శ్మశాన వాటికల అభివృద్ధి
ABN, Publish Date - Aug 03 , 2025 | 11:42 PM
శివుడు కొలువుదీరిన చోటు శ్మశానం అనే నమ్మకం హిందువుల్లో నెలకొని ఉంది.
ప్రథమంగా మైదుకూరు నియోజకవర్గంలో పనులు
ఒక్కో వాటికకు రూ.20 లక్షలు చొప్పున నిధులు మంజూరు
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ చొరవతో అమలు
దువ్వూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శివుడు కొలువుదీరిన చోటు శ్మశానం అనే నమ్మకం హిందువుల్లో నెలకొని ఉంది. అలాంటి శ్మశాన వాటికలు పలు గ్రామాల్లో లేకపోవడం, ఖనన కార్యక్రమాలు ఎక్కడ పడితే అక్కడ కొనసాగిస్తున్న దృశ్యాలు అరుదుగా కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మైదుకూరు నియోజకవర్గంలో శ్మశాన వాటికల ఏర్పాటు ఇందుకొరకు స్థలాల సేకరణ అక్కడ సౌకర్యాలు కల్పించేందుకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. స్థల సేకరణ విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నా వాటిని అధికమించే విధంగా చొరవ తీసుకుంటున్నారు. శ్మశాన వాటికల్లో ఖనన సమయంలో కాల్చే వేదికల్లో షెడ్ల ఏర్పాటు, ఆచార వ్యవహారాల నేపథ్యంలో వేచి ఉండేందుకు వేదికలు, తలనీలాల సమర్పణ సౌకర్యాలు, నీటి సౌకర్యం, స్నానపు గదులు, ఇతరత్రా వాటి కల్పనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక్కొక్క శ్మశాన వాటికకు రూ.20 లక్షలు చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించారు. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం పరిధిలో దువ్వూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం, మైదుకూరు, చాపాడు మండలాల్లో నిధులు కేటాయించి శ్మశాన వాటికల్లో సౌకర్యాల కల్పనకు పనులు చేస్తున్నారు. మండలంలో బుక్కాయపల్లె, క్రిష్ణంపల్లి గ్రామాల్లో శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అయిదు గ్రామాల పరిధిలో వాటి కొరకు మొదటివిడతగా నిధులు మంజూరు చేశారు. మరో అయిదు గ్రామాల పరిధిలో వాటి నిర్మాణ ప్రతిపాదనలు పరిపాలన ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఇలా గ్రామాల్లో శ్మశాన వాటికలతోపాటు అక్కడ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శ్మశాన వాటికలకు రూ.5 కోట్లు మంజూరు
మైదుకూరు నియోజకవర్గంలోని అయిదు మండలాల పరిధిలో శ్మశానవాటికల అభివృద్ధికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5 కోట్లు మంజూరైనట్లు ఆ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 25 గ్రామాల పరిధిలో పనులు చేపట్టేందుకు ఒక్కొక్క వాటికకు రూ.20 లక్షలు చొప్పున కేటాయించి పనులు చేపట్టామని ఆయన వివరించారు.
Updated Date - Aug 03 , 2025 | 11:42 PM