Advocates Association: న్యాయమూర్తిపై ట్రోల్స్.. న్యాయ వ్యవస్థపై దాడే
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:32 AM
సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేయడాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఖండించింది. ఓ కేసులో ఉత్తర్వులు వెలువరించిన అనంతరం ఆయనను లక్ష్యంగా చేసుకుని సామజిక మాధ్యమాలలో...
జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై విమర్శలను ఖండించిన న్యాయవాదుల సంఘం
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేయడాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఖండించింది. ఓ కేసులో ఉత్తర్వులు వెలువరించిన అనంతరం ఆయనను లక్ష్యంగా చేసుకుని సామజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేయడంపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు వ్యక్తిగతంగా న్యాయమూర్తి ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా న్యాయవ్యవస్థ పునాదులను, న్యాయపాలనను కదిలిస్తాయని పేర్కొంది. న్యాయమూర్తులు భయం, పక్షపాతం లేకుండా తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని భావిస్తామని, అలాంటివారిని అపఖ్యాతి పాల్జేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దీనిని న్యాయవ్యవస్థపై ప్రత్యక్షదాడిగా భావించాలని సంఘం పేర్కొంది. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని, పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. న్యాయమూర్తిపై ట్రోల్స్ చేసిన వారిని గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి సి. సుబోధ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Updated Date - Jul 05 , 2025 | 04:34 AM