Chittoor District SP: జగన్ పర్యటనకు500 మందికే అనుమతి
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:00 AM
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మార్కెట్‌యార్డులో రైతులను కలిసేందుకు బుధవారం వస్తున్నమాజీ సీఎం జగన్‌కు భద్రత దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.
హెలిప్యాడ్ వద్దకు 30 మంది మాత్రమే రావాలి
రోడ్‌షోలు, సభలకు అనుమతి లేదు
గత సంఘటనల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ స్పష్టీకరణ
చిత్తూరు అర్బన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మార్కెట్‌యార్డులో రైతులను కలిసేందుకు బుధవారం వస్తున్నమాజీ సీఎం జగన్‌కు భద్రత దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు, ఇతర జిల్లాల్లో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా.. రైతులతో ముఖాముఖికి 500 మంది వచ్చేందుకు అనుమతి ఇచ్చామన్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు. జగన్ పర్యటన ముగిసేవరకు ఎలాంటి రోడ్‌షోలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. సోమవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మార్కెట్ యార్డు, హెలిప్యాడ్ ప్రాంతం, రూట్ మ్యాప్, ట్రాఫిక్ తదితర అంశాలను పరిశీలించామన్నారు. హెలిప్యాడ్ చుట్టూ డబుల్ లేయర్ బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలని, పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వైసీపీ నేతలకు సూచించామన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 04:02 AM