Jagan Remarks: విచిత్రాల జగన్
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:29 AM
వామ్మో... ఇవేం మాటలు! ఇవెక్కడి కథలు! ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారా, అని జనం ముక్కున వేలేసుకునేలా జగన్ వ్యవహరించారు.
నెల్లూరులో కట్టు కథలు, వింత వ్యాఖ్యలు
పెద్దిరెడ్డిపై పగతోనే మిథున్ అరెస్టట!
చంద్రగిరి చేజారిందని చెవిరెడ్డిపై కేసులట
కాకాణిపై ఉన్నవి చిన్నచిన్న కేసులేనని చిట్టా
అసలు కేసులు చెప్పకుండా అమాయకత్వం
(నెల్లూరు - ఆంధ్రజ్యోతి)
‘వామ్మో... ఇవేం మాటలు! ఇవెక్కడి కథలు! ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారా?’ అని జనం ముక్కున వేలేసుకునేలా జగన్ వ్యవహరించారు. గురువారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన చెప్పిన మాటలు విని విస్తుపోయారు. పోలీసులు, సిట్ అధికారులు నమోదు చేసిన కేసులకు కొత్త భాష్యం చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ప్రమేయం, పాత్రపై ఆధారాలు సేకరించిన తర్వాతే ‘సిట్’ ఆయనను అరెస్టు చేసింది. కానీ... దీనికి జగన్ 53 ఏళ్లకిందట ఎప్పుడో కాలేజీ గొడవల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారని... ఆ కక్ష తీర్చుకోవడానికే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వింత కథ చెప్పారు. చంద్రబాబు, పెద్దిరెడ్డి 1972లో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహించేవారు. రెండు యూనియన్ల విద్యార్థుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అది నిజమే! కానీ... చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉండేవారే కానీ, ఎప్పుడూ ప్రత్యక్షంగా గొడవల్లోకి వెళ్లలేదు, కొట్టుకోలేదు, కొట్టలేదు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. దీంతో... అక్కసు ఆపుకోలేక చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారంటూ 1978 తర్వాత తప్పుడు ప్రచారం చేశారు. దానిని జనం అప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు... జగన్ మళ్లీ అదే కట్టుకథ చెప్పడం విని నాటి స్టూడెంట్ యూనియన్ల గొడవల గురించి తెలిసిన పెద్దలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు సీఎం కావడం ఇది నాలుగోసారి. పెద్దిరెడ్డిపై కక్ష సాధించాలనుకుంటే... 1995లో తొలిసారి సీఎం అయినప్పుడే ఆ పని చేసేవారు కదా అన్నది జనం ప్రశ్న!
చంద్రగిరిపైనా చెత్త కథ
‘నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంపై పట్టు సాధించినందుకే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి లోపల వేయించారు’’ అనేది జగన్ చెప్పిన మరో వింత కథ. 1983 ఎన్నికల ఫలితాలతోనే చంద్రబాబు చంద్రగిరిని వదిలేశారు. ఆయన జిల్లా మీద, రాష్ట్రం మీద దృష్టి సారించారే తప్ప చంద్రగిరికి మాత్రమే పరిమితం కాలేదు. కుప్పం నుంచే వరుసగా పోటీ చేసి గెలుస్తున్నారు. ఇక చెవిరెడ్డి చంద్రగిరి నుంచి 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ అధికారంలో ఉంది. చెవిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశమే ఉంటే అప్పుడే పెట్టేవారు కదా!
కాకాణిపై చిన్న కేసులా?
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సచ్ఛీలుడిగా అభివర్ణించేందుకు జగన్ నానా తంటాలు పడ్డారు. ‘ఇంత చిన్న కేసులకు అరెస్టు చేసి 64 రోజుల పాటు జైల్లో పెడతారా?’ అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఏడు కేసులను చదివి వినిపించారు. నిజంగానే అవి చిన్న కేసులు. అయితే... కాకాణిని అరెస్టు చేసింది ఆ కేసుల్లో కాదు. రుస్తుం మైన్స్‌లో క్వార్డ్జ్ కొల్లగొట్టడం, కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే దారిలో అనధికారిక టోల్‌గేట్ పెట్టి అక్రమ వసూళ్లు, ఫోర్జరీ సంతకాలతో గ్రావెల్ అక్రమ రవాణా ఇలాంటి తీవ్రమైన అభియోగాలతో నమోదైన కేసుల్లో కాకాణిని అరెస్టు చేశారు. జగన్ మాత్రం ‘చాలా తెలివిగా’ ఆ కేసుల గురించి కాకుండా, చిన్నచిన్న కేసుల చిట్టా మాత్రం చదివి, ‘ఈ మాత్రానికే అరెస్టు చేస్తారా?’ అని అమాయకత్వం ప్రదర్శించారు.
Updated Date - Aug 01 , 2025 | 03:30 AM