Totapuri Farmers: అవే రోత రాతలు
ABN, Publish Date - Jul 12 , 2025 | 04:45 AM
చేసింది... అరాచక యాత్ర! దానికి అడ్డగోలు సమర్థన! పైగా... రైతులను అవమానిస్తారా? అంటూ రోత పత్రికలో రాతలు! బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ‘మామిడి రైతులకు పరామర్శ’ పేరిట వైఎస్ జగన్ చేసిన ‘దండయాత్ర’...
రైతుల పేరుతో జగన్ పత్రిక విన్యాసాలు
అవమానించారంటూ ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు
‘వైసీపీ రైతుల’ అభిప్రాయాలతో మాయలు
అందరూ జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలే
వారిలో కొందరికి మామిడి తోటలే లేవు
కొందరు ‘సాక్షి’తో మాట్లాడిందే లేదు
వైసీపీ దండయాత్రపైనే ‘దండుపాళ్యం’ శీర్షిక
హవ్వ..ఇంత మాయా?
బంగారుపాళ్యం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జగన్ పర్యటనలో తన మామిడికాయలను వైసీపీ వారు రోడ్డుమీద పారబోశారంటున్న దూర్వాసులు అనే రైతు ఆవేదనను గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ‘అబ్బే కాదుకాదు... జగన్ పర్యటనలో నేనే స్వచ్ఛందంగా మామిడి కాయలు పారబోశాను’ అని దూర్వాసులు చెప్పినట్టు శుక్రవారం రోతపత్రిక వెల్లడించింది. అసలు విషయం ఏంటంటే... కాయలు కోల్పోయి బాధను వ్యక్తం చేసిన దూర్వాసులుది బంగారుపాళ్యం మండలం ఈచనేరిపల్లె! రోతపత్రిక మాత్రం... అదే పేరున్న తుంబపాళ్యం గ్రామానికి చెందిన వైసీపీ నేతతో మాట్లాడించి, ‘ఆ కాయలు నావే. నేనే పారబోశా’ అని చెప్పించింది. రెండు ట్రాక్టర్ల కాయలను కోల్పోయిన రైతు దూర్వాసులు ఆవేదన వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఆయనను శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా తన కాయల్ని వైసీపీ వాళ్లే పడేశారని, తాను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నానని స్పష్టం చేశారు.
రైతులతోనూ రాజకీయమే
‘మామిడి రైతుల కష్టాలపై ఒక్క కథనమైనా ప్రచురించారా?’ అని రోత పత్రిక వాపోయింది. తోతాపురి రైతుల కష్టాలు, తగ్గిన ధరలు, ఈ పరిస్థితికి కారణమేమిటి, పల్ప్ ఫ్యాక్టరీల యజమానుల వైఖరి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు... ఇలా అన్ని కోణాల్లో ‘ఆంధ్రజ్యోతి’ పలు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అవన్నీ అక్షర సత్యాలే! రోత పత్రిక మాత్రం కేవలం రాజకీయ దురుద్దేశంతో, ప్రభుత్వంపై బురదజల్లే లక్ష్యంతో అసత్యాలు, అర్ధసత్యాలతో తప్పుడు కథనాలు ప్రచురించింది. ఇక... బుధవారం జగన్ పర్యటనలోనూ అవే అబద్ధాలు చెప్పారు. శుక్రవారం కూడా రోతపత్రికలో ఇవే అబద్ధాలు దర్శనమిచ్చాయి.
చేసింది... అరాచక యాత్ర! దానికి అడ్డగోలు సమర్థన! పైగా... ‘రైతులను అవమానిస్తారా?’ అంటూ రోత పత్రికలో రాతలు! బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ‘మామిడి రైతులకు పరామర్శ’ పేరిట వైఎస్ జగన్ చేసిన ‘దండయాత్ర’... ఈ సందర్భంగా వైసీపీ శ్రేణుల వీరంగంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తలను ఖండించేందుకు వైసీపీ నానా తంటాలు పడింది.
వైసీపీ నేతలే వ్యూహాత్మకంగా తమ తోటల్లోని తోతాపురిని రోడ్లపై పారబోయడం, ఏ సంబంధమూలేని రైతుల మామిడినీ ఎత్తుకొచ్చేయడం, ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి చేయడం, పోలీసులను రప్పా రప్పా అని బెదిరించడం, అనుమతించిన దారిని కాదని బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన జగన్‌ను నిలువరించిన ఎస్పీపైనే మండిపడటం... ఈ పరిణామాలన్నీ వివరిస్తూ ప్రశాంతమైన బంగారుపాళ్యంలో ‘దండుపాళ్యం తరహాలో’ దౌర్జన్యానికి దిగారని ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించింది. ఇందులో సామాన్య రైతుల ప్రస్తావనే లేదు. రైతులను అవమానించిందీ లేదు. అయినా సరే... ‘రైతులను అవమానిస్తారా?’ అంటూ జగన్ రోతపత్రిక వాపోయింది. ‘రైతులు’ అంటూ కొందరి అభిప్రాయాలను ప్రచురించింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా రోతపత్రిక రాతలు ఎంత డొల్లగా ఉంటాయో మరోసారి రుజువైంది. ‘రైతులు’గా సాక్షి పేర్కొన్న వారిలో కొందరు గ్రామ, మండల స్థాయి వైసీపీ నాయకులు. మరికొందరు... క్రియాశీల కార్యకర్తలు. వీరిలో కొందరికి అసలు భూములే లేవు. మరికొందరికి భూములున్నా మామిడి తోటలు లేవు. కొందరు అసలు తాము ‘సాక్షి’తో మాట్లాడిందే లేదని చెప్పారు. కొంతమంది తాము రైతుల సమస్య గురించి మాత్రమే చెప్పామని... ‘ఆంధ్రజ్యోతి’పై ఆరోపణలు, విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. అందులో చాలామంది... వైసీపీ స్థానిక నేతలే! కొందరైతే... తమకేమీ తెలియదని, ‘సాక్షి’తో తాము మాట్లాడలేదని స్పష్టం చేశారు.
వైసీపీ నేత... రైతులే!
‘కూటమి నేతలే అసలైన దండుపాళ్యం బ్యాచ్’ అంటూ యాదమరి మండలం పెరుమాళ్లపల్లెకు చెందిన మనోహర్ రెడ్డి పేరుతో రోత పత్రికలో ఒక ‘అభిప్రాయం’ ప్రచురించారు. ఆయన జడ్పీ వైస్ చైర్మన్, వైసీపీ నేత ధనంజయ రెడ్డికి వరుసకు మామ అవుతారు. ఆయన భార్య వైసీపీ ఎంపీటీసీ. ఆ విషయం పక్కనపెడితే... ఆయనకు ఒక్క ఎకరా మామిడి తోట కూడా లేదు.
‘ఇంత నీచంగా వర్ణిస్తారా..?’ అంటూ విజయపురం మండలం నారపరాజుకండ్రిగ గ్రామానికి చెందిన రైతు రామకృష్ణమ రాజు చెప్పినట్లు ‘సాక్షి’లో ప్రచురించారు. ఆయన ఆరేళ్లు ఆ మండల వైసీపీ కన్వీనర్‌గా, 4 సంవత్సరాలు నగరి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జిల్లా వైసీపీ బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈయనకు 25 ఎకరాల పొలముండగా, 20 ఎకరాల్లో మామిడి సాగు చేసుకున్నారు.
‘ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి’ అంటూ చౌడేపల్లె మండలానికి చెందిన యువరైతు రంగనాథ్ చెప్పినట్లు ప్రచురించారు. ఈయనకు 12 ఎకరాల పొలమున్నా మామిడి సాగు చేయలేదు. ఇంట్లో తినడానికి ఐదారు టేబుల్ వెరైటీస్ మామిడి చెట్లను మాత్రమే సాగు చేసుకున్నారు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గృహసారథిగా కూడా పనిచేశారు.
‘రైతులకు క్షమాపణ చెప్పాలి’ అని పుంగనూరు పట్టణానికి చెందిన నారాయణప్ప చెప్పినట్లు సాక్షిలో ప్రకటించారు. ఈయన పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయుడు. ఇంకా... ‘రైతులు’ అంటూ రోత పత్రికలో ప్రచురించిన అభిప్రాయాలన్నీ వైసీపీ నేతలవే.
సిగ్గు పడాల్సింది ఎవరు?
‘పాలకుడిగా చెప్పుకోవడానికి సిగ్గు పడాలి’ అని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించారు. తనకు గిట్టని మీడియా పేర్లను ప్రస్తావిస్తూ... ‘దిగజారిపోయాయి’ అని నీచ వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులకు పరామర్శ పేరిట వైసీపీ శ్రేణులు వేసిన వీరంగం, రైతుల పేరిట ఆడిన నాటకాలకు సిగ్గు పడాల్సింది ఎవరన్నది అసలు ప్రశ్న! మామిడి రైతులను రాజకీయానికి వాడుకుంటున్నది ఎవరు? వారికి అండగా నిలిచి... ధైర్యాన్ని నింపుతున్నది ఎవరు? డిమాండ్ లేక రెండేళ్ల కిందట తయారైన పల్ప్ కూడా అమ్ముడు కాకపోవడంతో ఈసారి మామిడి కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీల యజమానులు వెనుకాడారు. మరోవైపు బంపర్ క్రాప్‌తో ధరలు పడిపోయాయి. దీన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు గతనెల 5వ తేదీనే తోతాపురి మామిడికి కిలోకు రూ.4 వంతున ప్రభుత్వ సబ్సిడీని ప్రకటించారు. పల్ప్ యూనిట్ల యజమానులు లేదా వ్యాపారులు కిలోపై రైతులకు రూ.8వంతున చెల్లించేలా... మొత్తంగా కిలోకు రూ.12 దక్కేలా చర్యలు తీసుకున్నారు. యూనిట్ల నిర్వాహకులు, వ్యాపారులు, రైతు సంఘాల నేతలతో అధికారుల ద్వారా పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేయించి ఆ ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పల్ప్ యూనిట్ల యజమానులకు ఈ సీజనులో పెట్టుబడుల కోసం బ్యాంకు రుణాలిప్పించేందుకు సైతం చొరవ తీసుకున్నారు. ఈ చర్యలే మామిడి రైతుల్లో ధైర్యాన్ని నింపాయి. జగన్ మాత్రం తోతాపురి సీజన్ ముగిశాక... 80 శాతం కొనుగోళ్లు కూడా పూర్తయ్యాక ‘పరామర్శ’ పేరిట దండయాత్ర చేశారు.
మాకేం తెలియదే..
‘రైతులను నేరస్తులతో పోలుస్తారా?’ అంటూ చిత్తూరు రూరల్ మండలం దిగువకండ్రిగ గ్రామానికి చెందిన యుగంధర్ నాయుడు చెప్పినట్లు ప్రచురించారు. ఆయన గ్రామ స్థాయి వైసీపీ నాయకుడు. 5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. కానీ, సాక్షి పత్రికలో తన ఫొటోతో వార్త వచ్చిందని ఈయనకు తెలియదు. ఆ విషయం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ఆయనే చెప్పారు. ఇక... వైసీపీ రైతు విభాగ నాయకుడు శంకర్ రెడ్డి సంగతీ అంతే. ‘‘సాక్షి రిపోర్టర్ ఫోన్ చేసి నా ఫొటో అడిగారు. స్టేట్‌మెంట్ పంపుతామని చెప్పారు. నా అంతట నేను ఏ అభిప్రాయమూ చెప్పలేదు’’ అని చెప్పారు.
Updated Date - Jul 12 , 2025 | 01:02 PM