Nara Lokesh: కక్ష లేదు.. శిక్ష తప్పదు
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:05 AM
టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలనే ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు లభిస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. తప్పు చేసి ఉంటే జగన్ అయినా..
ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంది ఎవరినో బొక్కలో వేసేందుకు కాదు
కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే వదిలిపెట్టం:లోకేశ్
జగన్‌ను జైలుకు పంపాలనుకుంటే చంద్రబాబుకు 2 నిమిషాల పని: లోకేశ్
జగన్ చంద్రబాబును జైలుకు పంపారని.. చంద్రబాబు ఆయన్ను జైలుకు పంపాలని ఎక్కడైనా ఉందా? చంద్రబాబును జైలుకు పంపి, మా కార్యకర్తలను వేధించి ఏం చేయగలిగాడు?
మద్యం కేసులో తాను రూపాయి కూడా అక్రమంగా ఆర్జించలేదని జగన్ దేవుడి ముందు ప్రమాణం చేస్తారా..? చిన్నాన్న వివేకా హత్య కేసులో తమ కుటుంబ సభ్యులకు పాత్ర లేదని ప్రమాణం చేస్తారా?
డబ్బులిచ్చాం కనుక ఓట్లు తప్పక పడతాయన్న భ్రమలు మాకు లేవు. ప్రజలతో భావోద్వేగ సంబంధాలు ఉన్నప్పుడే వారు మాతో ఉంటారు.
- మంత్రి లోకేశ్
న్యూఢిల్లీ, జూన్ 19(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధించాలనే ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు లభిస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. తప్పు చేసి ఉంటే జగన్ అయినా.. ఎవరైనా జైలుకు వెళ్తారని తేల్చిచెప్పారు. తమకు హైకమాండ్ లేదని.. తమ ప్రభుత్వంలో అంతిమ నిర్ణయం తమ బాస్ చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘కక్ష సాధించాలంటే జగన్‌ను జైలుకు పంపడం చంద్రబాబుకు రెండు నిమిషాల పని. ఎవరిపైనా కక్ష సాధించే ఉద్దేశం తనకు లేదని ఆయనే చెప్పారు’ అని గుర్తుచేశారు. తాము చట్టపరమైన ప్రక్రియనే అనుసరిస్తామని చెప్పారు. జగన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి తమకు ఎవ రి అనుమతీ అవసరం లేదన్నారు. చట్టాన్ని అమలు చేసేందుకు అనుమతులు అవసరమా అని ప్రశ్నించారు. మద్యం కేసును ప్రారంభించినప్పుడు కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయని, డబ్బులు తీసుకున్నామని అన్నారని.. వంశీపై చర్యలు తీసుకోలేదని కూడా అన్నారని, కానీ చట్ట ప్రక్రియలు ఎక్కడా ఆగలేదని తెలిపారు. తమ లీగల్ టీమ్ బలంగా ఉన్నదని, ఒకట్రెండు సందర్భాల్లో తప్ప నేరం చేసినవారెవరూ బెయిల్ మీద బయటకు రావడం లేదని గుర్తు చేశారు.
అందరినీ అరెస్టు చేయాలనే అతి అంచనాలు సరికాదన్నారు. ప్రజలు తమను ఎన్నుకుంది ఎవరో ఒకరిని బొక్కలో వేయడానికి కాదని.. పరిపాలించడానికి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికే ఎన్నుకున్నారని చెప్పారు. అదే సమయంలో చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రవర్తించారని, శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకున్నారని, వారిని వదిలిపెట్టబోమన్నది తన ఎన్నికల వాగ్దానమని చెప్పారు. ‘జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెడతామని మేమేమైనా వాగ్దానం చేశామా? మేనిఫెస్టోలో పెట్టామా.. సూపర్ సిక్స్ వాగ్దానాల్లో చెప్పామా? మమ్మల్ని రప్పా రప్పా నరుకుతామన్న ప్రగల్భాలకు విలువ లేదు. జగన్ చేసిన నేరాలను మేం విస్మరించలేదు. అంత మాత్రాన ఆయన చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యాలు లేవా’ అని ప్రశ్నించారు. కేసీఆర్ తమ ఫోన్లు ట్యాప్ చేయించారన్న వార్తలపై స్పందిస్తూ.. దానిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ‘‘మద్యం కేసుతో పాటు మరిన్ని అక్రమాలపై కేసులు ఉంటాయి. లిక్కర్ కేసులో త్వరలో చార్జిషీటు వేస్తారు. జనం మరణించారన్నది ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నేరాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంపై మేం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు.’’ అని తెలిపారు. కేవలం ఏడాది పాలనలోనే ఎన్నో సాధించామని, పెట్టుబడులు పెంచడం ద్వారా సంపదను సృష్టించే పథంలో ప్రవేశించామన్నారు. పాఠశాలల్లో ఏపీ సాధించిన విజయంపై తనతో రెండ్రోజులు చర్చిస్తానని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని తెలిపారు. బటన్ నొక్కకుండానే రూ.వేల కోట్ల సొమ్ము ప్రజలకు విడుదల చేశామని, అయినా తమకు పాలాభిషేకాలు అవసరం లేదన్నారు. కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై నిరుత్సాహంతో ఉన్నారన్నది సరికాదని చెప్పారు. మొదటి నుంచీ కార్యకర్తలకు, ఉద్యోగుల బదిలీలకు సంబంధం లేదని, టీచర్ల బదిలీల్లో కూడా రాజకీయ ప్రమేయం ఉండదని లోకేశ్ తెలిపారు.
Updated Date - Jun 20 , 2025 | 05:06 AM