ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mango Farmers: నిండా ముంచి పరామర్శలా

ABN, Publish Date - Jul 09 , 2025 | 05:31 AM

అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని జగన్‌ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం వారికి అన్యాయం జరిగిపోతోందంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో మామిడి రైతులు రెండుసార్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.

  • అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతులకు మొండిచెయ్యి

  • ఐదేళ్లలో ఒక్క పైసా సబ్సిడీ కూడా ఇవ్వని జగన్‌

  • కూటమి ప్రభుత్వం కిలోకు రూ.4 ఇస్తుంటే ఆక్రోశం

  • నేడు బంగారుపాళ్యంలో రైతుల పరామర్శకు మాజీ సీఎం

  • జగన్‌ పర్యటనలో రోడ్డుషో, సభలకు అనుమతి లేదు: ఎస్పీ

(చిత్తూరు-ఆంధ్రజ్యోతి)

అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని జగన్‌ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం వారికి అన్యాయం జరిగిపోతోందంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో మామిడి రైతులు రెండుసార్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. 2023లో అప్పటి కలెక్టర్‌ షన్మోహన్‌ మద్దతు ధర ప్రకటించినా పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోలేదు. అవన్నీ వైసీపీ పెద్దాయన పర్యవేక్షణలో సిండికేట్‌లో ఉండటంతో కలెక్టర్‌ కూడా గట్టిగా ఆదేశాలు ఇవ్వలేకపోయారు. అలాగే 2021 సీజన్‌లోనూ తోతాపురి ధరలు పాతాళానికి పడిపోయాయి. పరిశ్రమలు కిలో రూ.6-7కే కొనుగోలు చేశాయి. ఈ రెండు సీజన్లలో రైతులు దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నా, అప్పటి సీఎం జగన్‌ జోక్యం చేసుకోలేదు. కిలోకు నయా పైసా కూడా సబ్సిడీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డుకు మాజీ సీఎం పరామర్శకు రావడాన్ని రైతులే తప్పుబడుతున్నారు. మామిడి కాయలు అమ్ముడుపోక పరిస్థితి దయనీయంగా ఉన్న సమయంలో పట్టించుకోని జగన్‌... సీజన్‌ ముగిసే సమయంలో వచ్చి ఓదార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. మామిడి రైతులతో మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అప్పుడు.. ఇప్పుడు ఆదుకుంది చంద్రబాబే

ఈ ఏడాది మామిడి రైతులు నష్టపోతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించారు. ఈ లెక్కన జిల్లా రైతులకు సుమారు రూ.200 కోట్లు ఇస్తున్నారు. ఆయా ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రూ.6 ధరను కచ్చితంగా అమలు చేయిస్తున్నారు. ప్రతిరోజూ ఫ్యాక్టరీల వద్ద సుమారు 340 మంది ప్రభుత్వ ఉద్యోగులు షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటున్నారు. రైతుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటున్నారు. 2018లో ధరలు పతనమైనప్పుడు కూడా అప్పటి సీఎం చంద్రబాబు కిలోకు రూ.2.50 సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు.

పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ ఇస్తోంది రూ.3 మాత్రమే

ప్రభుత్వం కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించి ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాలని ఆదేశించినా డిమాండ్‌ లేదంటూ జిల్లాలో సగం ఫ్యాక్టరీలు రూ.6 ఇస్తుండగా, మిగిలినవి రూ.5 చొప్పున ఇస్తున్నాయి. కానీ, సదుంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబసభ్యుల ఫ్యాక్టరీ ‘పీఎల్‌ఆర్‌ ఫుడ్స్‌’ కిలోకు రూ.3 మాత్రమే ఇస్తోంది. అందులోనూ పరిమితులు పెట్టుకుని ఇప్పటివరకు 8వేల టన్నులే కొనుగోలు చేసింది. వైసీపీ హయాంలో ఆ ప్రాంతంలోని రైతులంతా పీఎల్‌ఆర్‌ ఫ్యాక్టరీకే మామిడిని తరలించేలా ఒత్తిడి చేశారు. అప్పట్లో ఆయన చెప్పిన ధరే జిల్లావ్యాప్తంగా అమలైంది.

వైసీపీ నేతల ర్యాంపుల్లో రూ.2లే

తవణంపల్లె మండలం గాజులపల్లె సమీపంలో వైసీపీ నేత మురళీమోహన్‌రెడ్డి తిరుమల వే బ్రిడ్జి పేరిట ఓ ర్యాంపును లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. అక్కడ కిలోకు రూ.2 మాత్రమే చెల్లిస్తున్నారు. విషయం తెలుసుకున్న తవణంపల్లె ఎమ్మార్వో, ఏవో అక్కడికెళ్లి ప్రశ్నించారు. వినకపోవడంతో ఇటీవల కరెంటు కనెక్షన్‌ తొలగించారు. దీంతో ఆ యజమాని తన బంధువైన రైతు సుబ్రమణ్యంరెడ్డితో మామిడి కాయలు రోడ్డుపై వేయించి నిరసన చేయించారు. దీంతో ఎమ్మార్వో మళ్లీ కరెంటు కనెక్షన్‌ ఇవ్వాల్సి వచ్చింది. కాయలు రోడ్డుపై పోస్తున్న ఫొటోను రోత పత్రికలో పదేపదే వేస్తూ అందరు రైతులకు ఆపాదించి వార్తలు వండి వారుస్తున్నారు.

తమిళనాడులో రైతులపై కేసులు

పొరుగును ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోన కూటమి ప్రభుత్వమే రైతుల్ని పెద్దఎత్తున ఆదుకుంటోంది. కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో అనేక ఆంక్షలతో రూ.4 సబ్సిడీ ఇస్తుండగా.. తమిళనాడులో అసలు పట్టించుకోవడం లేదు. వేలూరులో ఇప్పటికి మూడుసార్లు రాస్తారోకో, బంద్‌ చేసిన రైతులపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

రైతులతో ముఖాముఖికే పర్యటన: ఎస్పీ మణికంఠ

మాజీ సీఎం జగన్‌ బంగారుపాళ్యం పర్యటనలో ర్యాలీలు, రోడ్డు షోలు, బహిరంగ సభలకు అనుమతులు లేవని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకునేందుకే ఈ పర్యటన పరిమితమని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయటి ప్రాంతాల నుంచి కొంతమందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Jul 09 , 2025 | 05:33 AM