పూడికతీత లేనట్టే..!
ABN, Publish Date - May 18 , 2025 | 01:24 AM
పంట కాలువల నిర్వహణ అంచనా వ్యయంలో కోత విధించడం ద్వారా ఈ ఏడాది పూడికతీత పనులు లేనట్టేనని తెలుస్తోంది. తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని సాగునీటి సంఘాలకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అరకొర నిధులతో ఇప్పుడే పనులు చేపట్టలేమని, కొంతకాలం వేచి చూద్దామన్న ఆలోచనలో అధ్యక్షులు ఉన్నారు. దీంతో ఈ ఏడాది పనులు ఆలస్యం కానున్నాయి. కాగా, కాలువల పూడిక తీత, గట్లు పటిష్టం చేయడం, అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల మరమ్మతుల ఊసేలేకపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
- కాలువల్లో తూడు, గుర్రపు డెక్క తొలగింపునకే అనుమతి
- పనులు చేయాలని సాగు నీటి సంఘాలకు మౌఖిక ఆదేశాలు
- కొంతకాలం వేచిచూసి పనులు చేస్తామంటున్న అధ్యక్షులు
- మచిలీపట్నం మండలంలో సిమెంట్ లైనింగ్ పనులకు అంచనాలు!
- అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల మరమ్మతుల ఊసేలేదు!
- ఆలస్యంకానున్న పనులు... ఆయోమయంలో అన్నదాతలు
పంట కాలువల నిర్వహణ అంచనా వ్యయంలో కోత విధించడం ద్వారా ఈ ఏడాది పూడికతీత పనులు లేనట్టేనని తెలుస్తోంది. తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని సాగునీటి సంఘాలకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అరకొర నిధులతో ఇప్పుడే పనులు చేపట్టలేమని, కొంతకాలం వేచి చూద్దామన్న ఆలోచనలో అధ్యక్షులు ఉన్నారు. దీంతో ఈ ఏడాది పనులు ఆలస్యం కానున్నాయి. కాగా, కాలువల పూడిక తీత, గట్లు పటిష్టం చేయడం, అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల మరమ్మతుల ఊసేలేకపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం :
జిల్లాలోని పంట కాలువల్లో గత ఫిబ్రవరిలో 722 నిర్వహణ పనులకు రూ.32 కోట్లతో అంచనాలు రూపొందించారు. నిధుల కొరత పేరుతో ఈ పనుల అంచనాల్లో భారీగా కోత పెట్టారు. ఒక నియోజకవర్గానికి రూ.3కోట్ల చొప్పున రూ.21 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. గతేడాది కాలువల నిర్వహణ పనులకు రూ.26 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది నిధుల్లో కోత పెట్టడంతో పంట కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా, భారీ వర్షాలు కురిసిన సమయంలో డ్రెయినేజీలు పొంగిపొర్లకుండా ఎంతమేర పనులు చేస్తారనే అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. కేటాయించిన కొద్దిపాటి నిధులతో కేవలం కాలువల్లోని తూటుకాడ, గుర్రపు డెక్కలను తొలగించాలని నిర్ణయించారు. మేలో డ్రెయినేజీల్లో కత్తెర పోట్లు కారణంగా ఉప్పునీరు చొచ్చుకు వచ్చే ప్రాంతం వరకు తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులను మినహాయించారు. ఉప్పునీరు ప్రవేశించని ప్రాంతాల్లో తూడు, గుర్రపుడెక్కలను నిర్మూలించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలని భావిస్తున్నారు.
మట్టి పనులకు నిధుల్లేవ్!
ఈ ఏడాది పంట కాలువలు, డ్రెయినేజీల్లో నిధుల కొరత కారణంగా మెరక వేసిన ప్రాంతాల్లో పూడికతీత, గట్లు బలహీనంగా మారినచోట్ల గట్లు బలోపేతం వంటి మట్టి పనులు చేయడానికి అవకాశం ఇవ్వలేదని, నిధులు కూడా కేటాయించలేదని నీటిపారుదలశాఖ అఽధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు ఆయా సాగునీటి సంఘాల పరిధిలోకి వచ్చే పంట కాలువలు, డ్రెయినేజీల్లో తూడు, గుర్రపు డెక్క తొలగించేందుకు ఎంత మేర నిధులు విడుదలయ్యాయి, ఎంతమేర పనులు చేయాలనే అంశంపై సాగు నీటి సంఘాల అధ్యక్షులకు తెలియజేశారు. మట్టి పనులు చేయడానికి నిధులు విడుదల కాలేదని తేల్చిచెప్పారు. కాలువల నిర్వహణ పనులకు ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరలో వస్తాయని, ఈలోగా అత్యవసరమైన ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తూడు, గుర్రపు డెక్కల నిర్మూలన పనులు ప్రారంభించాలని సాగు నీటి సంఘాల అధ్యక్షులకు నీటి పారుదలశాఖ అధికారులు సూచించారు. కొంతకాలం వేచిచూసి పనులు చేస్తామని అధ్యక్షులు చెబుతున్నారు.
జైకా నిధులతో అయినా పనులు చేస్తారా!
పంట కాలువలు, ప్రధాన డ్రెయినేజీల్లో పూడికతీత పనులకు అరకొరగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాది పూడికతీత పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలోని పంట కాలువలు, డ్రెయినేజీలకు మరమ్మతు పనులు చేయాలనే ప్రతిపాదన ఇటీవల తెరపైకి వచ్చింది. కాలువ గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో గట్లు బలోపేతం, పంట కాలువలు, డ్రెయినేజీలపై పాడైన వంతెనల స్థానంలో నూతన వంతెనల నిర్మాణ పనులను జైకా(జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) నిధులతో చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఒక్కో సాగు నీటి డిస్ర్టిబ్యూటరీ కమిటీకి కనీసంగా రూ.20 లక్షలను కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. జైకా నిధులను కాలువల అభివృద్ధికి వినియోగించే అంశంపై రెండు, మూడు రోజుల్లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం రాఽజధాని అమరావతిలో జరగనుంది. ఈ సమావేశంలో కృష్ణాజిల్లాకు ఈ నిధులను అందుబాటులోకి తెచ్చి, వాటితో చేయాల్సిన పనులకు సంబంధించిన నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నిధుల కేటాయింపునకు ఆమోదం లభిస్తుందా లేదా అనే అంశంపైనా రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
సిమెంట్ లైనింగ్ పనులకు ఆమోదం లభించేనా!
దివిసీమకు సాగు నీరందించే కేఈబీ కాలువకు(కరువు కాలువ) అనుబంధంగా ఉన్న 9/7వ నెంబరు బ్రాంచి కాలువకు డెల్టా ఆధునికీకరణలో భాగంగా 2011లో సిమెంటు లైనింగ్ పనులు చేశారు. కాలువ ప్రారంభమయ్యే పెదయాదర గ్రామం వద్ద, కాలువ చివర కోనగ్రామం వద్ద కొంత మేర కాంక్రీటుతో లైనింగ్ పనులు చేశారు. తుమ్మలచెరువు సమీపంలో కాంక్రీటు పనులు చేయలేదు. దీంతో కాలువ ద్వారా కోన గ్రామంలోని పొలాలకు సాగు నీరు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. ఈ కాలువకు పూర్తిస్థాయిలో సిమెంట్ లైనింగ్ పనులు లేదా కాలువ గట్లకు రెండు వైపులా లోపలి అంచులకు సిమెంటు పనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్ల మరమ్మతుల సంగతేంటి?
దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలాల్లోని ఏడు, మోపిదేవి, మచిలీపట్నం మండలంలోని ఏడు అవుట్ ఫాల్ స్లూయిస్‌ల గేట్లు కొట్టుకుపోయాయి. మచిలీపట్నం మండలంలో 12 గ్రామాల్లోని ఐదు వేల ఎకరాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి వరిపైరు చనిపోతోంది. కోడూరు, నాగాయలంక మండలాల్లోని ఏడెనిమిది గ్రామాల్లో మరో ఐదు వేల ఎకరాల్లోకి ఉప్పునీరు ప్రవేశిస్తుండటంతో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అవుట్ ఫాల్ స్లూయిస్‌లకు కనీస మరమ్మతులు చేయాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. దివిసీమలోని అవుట్ ఫాల్ స్లూయిస్‌లకు మరమ్మతులు చేసేందుకు రూ.37 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇటీవల సాంకేతి బృందం ఈ అవుట్ ఫాల్ స్లూయిస్‌లను పరిశీలించి వెళ్లింది. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని అవుట్ ఫాల్ స్లూయిస్‌లకు కనీస మరమ్మతులు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - May 18 , 2025 | 01:25 AM