ఈ రోడ్డు బాగవుతుందా?
ABN, Publish Date - Jun 15 , 2025 | 11:38 PM
గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు ఏడాదైనా ప్రజలను వెంటాడుతున్నాయి.
అధ్వానంగా మారిన డాణాపురం-హొళగుంద ప్రధాన రహదారి
అడుగడుగున గుంతలు
25 గ్రామాల ప్రజల అవస్థలు
గత వైసీపీ హయాంలో పర్సెంటేజీల భాగోతంతో ప్రజలకు శాపం
కర్నూలు, జూన 15 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు ఏడాదైనా ప్రజలను వెంటాడుతున్నాయి. రహదారుల నిర్మాణానికి మంజూరైన నిధుల్లో లు అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇష్టారాజ్యంగా పర్సెంటేజీలు డిమాండ్ చేసి కాజేశారు. వాటాలు ఇవ్వకపోతే పనులు చేయనివ్వమని తేల్చిచెప్పడంతో కాంట్రాక్టర్లు పారిపోయారు. ఆ పాపాలు ఇప్పటికీ ప్రజలను వేధిస్తున్నాయి. 25 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే హొళగుంద-డాణాపురం ప్రధాన రోడ్డు ఆధునికీకరణ కోసం న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎనడీబీ) మంజూరు చేసిన నిధుల్లో వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో పర్సెంటేజీలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ పనులు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా నిబంధనలు అడ్డుగా ఉండడంతో మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా ఐదారేళ్లుగా రోడ్లు గుంతలమయంగా ఉండిపోయాయి.
డాణాపురం-హొళగుంద రోడ్డు ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేసే అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారి. ఆదోని-బళ్లారి వయా ఆలూరు జాతీయ రహదారి-167 డాణాపురం క్రాస్ 0/0 కి.మీల నుంచి హొళగుంద వరకు 25.490 కిలోమీటర్లు ఉంది. హొళగుంద, ఆదోని మండల పరిధిలోని 25 గ్రామాలకు పైగా ప్రజలు రాకపోకలకు సాగించే కీలకమైన రోడ్డు ఇది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, హోస్పేట్ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల ప్రజలు మంత్రాలయం, శ్రీశైలం వెళ్లాలన్నా, జిల్లా వాసులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి వెళ్లాలన్నా ఈ రోడ్డే ఆధారం. నిత్యం సుమారుగా 500-700కు పైగా వివిధ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు రైతులు, వివిధ గ్రామాల రైతులు వ్యవసాయ ఉత్పత్తులు ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు తరలించాలంటే ఈ రహదారి గుండానే సాగిపోయాలి. ఐదేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో రోడ్డంతా గుంతలు గుంతలుగా మారింది. కొన్ని చోట్ల రెండు మూడు అడుగుల లోతు గుంతలు ఏర్పడడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫ నాటి వైసీపీ నేతల పర్సెంటేజీ భాగోతం:
ఢాణాపురం-హొళగుంద ప్రధాన రోడ్డును డబుల్ రోడ్డు (రెండు వరుసల రోడ్డు)ను ఆధునికీకరణ కోసం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎనడీబీ) కింద 2021లో నిధులు రూ.63 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. పనులు దక్కించుకున్న ఎనఎస్‌పీఆర్ కనస్ట్రక్షన సంస్థ కాంట్రాక్టర్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ రోడ్డు ఆలూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధులు వాటా (పర్సెంటేజీ) ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరికి పర్సెంటేజీ ఇస్తే నష్టం వస్తుందని, పనులు చేయలేనని కాంట్రాక్టర్ తేల్చిచెప్పినా, ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో ఆయన ఈ పనులు చేయలేను బాబోయ్ అంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే ఎనడీబీ పథకం కింద నిధులు మంజూరు కావడంతో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మరమ్మతులు చేయాలన్నా నిబంధనలు అడ్డుగా మారాయి. గుంతల రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రజలు కూటమి ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
ఫ ఆ.. రోడ్లు అధ్వానమే..:
ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడుమూరు, కోసిగి, కౌతాళం మండలాల ప్రజలకు ప్రధానమైన రహదారి ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్డు. 0/0 నుంచి 11.885 కిలో మీటర్ల వరకు అడుగుతీసి అడుగుల వేయలేనంతగా ధ్వంసమైపోయింది. గుంతల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కౌతాళం మండలం ఉరుకుంద లక్ష్మీనరసింహస్వామి (ఈరన్న) క్షేత్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు ఇది. అలాగే.. ఆదోని-ఎమ్మిగనూరు (ఏజీ రోడ్డు) జాతీయ రహదారి-167 బైచిగేరి క్రాస్ నుంచి పెద్దకడుబూరు వయా కపటి రోడ్డు 0/0 నుంచి 13.750 కిలోమీటర్లు అధ్వానంగా మారింది. ఈ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫ సింగిల్ రోడ్డుకైనా నిధులు ఇవ్వండి:
ప్రజల అవస్థలు నివారించాలంటే డబుల్ రోడ్డు స్థానంలో కనీసం సింగిల్ రోడ్డు నిర్మాణం కోసమైనా నిధులు ఇవ్వాలని కోరుతూ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ఢాణాపురం-హొళగుంద రోడ్డుకు రూ.14 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్డుకు రూ.6 కోట్లు, కపటి-పెద్దకడుబూరు రోడ్డుకు రోడ్డుకు రూ.7.50 కోట్ల చొప్పున రూ.27.50 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపించారు. దీనిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి. తిక్కారెడ్డి నేడు సీఎం చంద్రబాబును కలవనున్నారు. అలాగే.. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఫ ఎన్నేళ్లు ఈ అవస్థలు? - పి. సత్యనారాయణరెడ్డి, వందవాగిలి గ్రామం, హొళగుంద మండలం:
హొళగుంద, ఆదోని మండలాల్లోని దాదాపు 25 గ్రామాలకు ప్రధాన మార్గం ఢాణాపురం-హొళగుంద రోడ్డు. పదేళ్లుగా గుంతల రోడ్డులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆదోనికి వెళ్లడానికి పడుతున్న అవస్థలు అన్నీఇన్ని కావు. ఎన్నాళ్లు ఇలా ఇబ్బందిపడాలి.
ఫ ప్రతిపాదనలు పంపాం - ఎస్‌ఈ, రోడ్లు భవనాలు శాఖ, కర్నూలు:
ఢాణాపురం-హొళగుంద రోడ్డును సింగిల్ రోడ్డుగా అభివృద్ధి చేయాడానికి, కపటి - పెద్దకడుబూరు రోడ్డు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ.27.50 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నిధులు ఇస్తే పనులు ఆరంభిస్తాం.
Updated Date - Jun 15 , 2025 | 11:38 PM