ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇప్పట్లో సాధ్యమేనా!

ABN, Publish Date - May 13 , 2025 | 01:00 AM

గతేడాది సెప్టెంబరు ఒకటి.. విజయవాడ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. నగరంలో సగభాగాన్ని బుడమేరు బురద ముంచేసింది. అడుగు బయటకు వేసే లోపు వరద నీరు చుట్టేసింది. ఈ పరిస్థితిపై అధ్యయనం చేసిన నిపుణులు ప్రకృతి ప్రకోపం ఒక కారణమైతే, మానవ తప్పిదాలు మరో కారణమని తేల్చారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఇళ్లలోకి చుక్కనీరు చేరకుండా చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక పట్టాలెక్కడంలో రోజులు గడిచిపోతున్నాయి. ప్రాథమికంగా లోపాలను తేల్చిన అధికారుల బృందం వాటిని సరి చేయడానికి ఎటూ అడుగులు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. వరదలు తగ్గి సాధారణ పరిస్థితి రాగానే బుడమేరు ప్రక్షాళన మొదలవుతుందని మంత్రులు, అధికారులు ప్రకటించారు. బుడమేరు ప్రళయం వచ్చి తొమ్మిది నెలలు పూర్తికావస్తున్నా ప్రక్షాళన ఇంకా చర్చల దశలోనే ఉండటం గమనార్హం.

బుడమేరు ప్రక్షాళన ప్రకటనలకే పరిమితం

ఆక్రమణలు నిగ్గుతేల్చినా పడని అడుగు

ఇంకా చర్చల్లోనే విస్తరణ, పటిష్ఠత

ఆక్రమణల తొలగింపు బాధ్యత ఎవరిది

గతేడాది సెప్టెంబరు ఒకటి.. విజయవాడ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. నగరంలో సగభాగాన్ని బుడమేరు బురద ముంచేసింది. అడుగు బయటకు వేసే లోపు వరద నీరు చుట్టేసింది. ఈ పరిస్థితిపై అధ్యయనం చేసిన నిపుణులు ప్రకృతి ప్రకోపం ఒక కారణమైతే, మానవ తప్పిదాలు మరో కారణమని తేల్చారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఇళ్లలోకి చుక్కనీరు చేరకుండా చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక పట్టాలెక్కడంలో రోజులు గడిచిపోతున్నాయి. ప్రాథమికంగా లోపాలను తేల్చిన అధికారుల బృందం వాటిని సరి చేయడానికి ఎటూ అడుగులు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. వరదలు తగ్గి సాధారణ పరిస్థితి రాగానే బుడమేరు ప్రక్షాళన మొదలవుతుందని మంత్రులు, అధికారులు ప్రకటించారు. బుడమేరు ప్రళయం వచ్చి తొమ్మిది నెలలు పూర్తికావస్తున్నా ప్రక్షాళన ఇంకా చర్చల దశలోనే ఉండటం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

బుడమేరు ఉగ్రరూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నగరవాసులు ప్రత్యక్షంగా చూశారు. 100 కిలోమీటర్ల మేర ప్రవహించే బుడమేరు వల్ల విజయవాడ అతలాకుతల మైంది. బుడమేరు పరీవాహక ప్రాంతం 2,930 ఎకరాలు. ఇందులో నగర పరిధిలోనే బుడమేరు భూములు 80 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టు అధికారులు నివేదిక తయారు చేశారు. ఎకరం భూమి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఆక్రమణల విలువ రూ.800 కోట్లుపై మాటే అని నివేదికను రూపొందించారు. విజయవాడ కాకుండా ఇతర ప్రాంతాల్లో 500 ఎకరాలు దీని పరీవాహక ప్రాంతం ఆక్రమణల్లో ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఆక్రమణలను తొలగించి, భవిష్యత్తులో విజయవాడ నగరానికి వరద ముంపు మాట వినపడకుండా ఆపరేషన్‌ బుడమేరు చేపడతామని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ వరదల సమయంలో ప్రకటించారు. ఆక్రమణల లెక్కలు తేలి తొమ్మిది నెలలు కావస్తోంది. ఇంత వరకు ఒక్క ఆక్రమణను తొలగించిన దాఖలాలు కనిపించలేదు. పైగా రోజుకు ఓ ప్రదేశంలో ఆక్రమణలు వెలుస్తున్నాయి. బుడమేరు వాగు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు. చాలా చోట్ల ఇది 10 నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. రియల్‌ వ్యాపారులు బుడమేరును పూడ్చేసి భవనాలు నిర్మించేశారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఈ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్‌ నియోజకవర్గం, గన్నవరం నియోజక వర్గాల్లోనూ బుడమేరు ఆక్రమణలు భారీగా ఉన్నాయని గణాంకాలతో నివేదిక రూపొందించారు.

ఆపరేషన్‌ ఎప్పుడు?

ఆపరేషన్‌ బుడమేరులో భాగంగా వాగు మొదలైన దగ్గర నుంచి కొల్లేరులో కలిసే వరకు ఆక్రమణలు తొలగించి, కుచించుకుపోయిన ప్రదేశాలను 50 మీటర్ల వరకు వెడల్పు చేయాలన్నది అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రస్తుతం ఉన్న డిశ్చార్జి సామర్థ్యాన్ని ఏడు వేల క్యూసెక్కుల నుంచి 25 వేల క్యూసెక్కులకు పెంచాలని భావిస్తున్నారు. ఇది జరగాలంటే ముందుగా ఆక్రమణలు తొలగించి కాల్వను వెడల్పు చేయాలి. ఆక్రమణలు తొలగించడంతోపాటు నగర పరిధిలో బుడమేరు ప్రవాహ మార్గంలో రెండు వైపులా పటిష్టమైన కరకట్టలు నిర్మించి నగరానికి ముంపు నుంచి రక్షణ కల్పించడమే ఆపరేషన్‌ బుడమేరు లక్ష్యమని మంత్రులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ ఎప్పుడు మొదలవుతుందని నాటి ముంపు బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణల కారణంగానే బుడమేరు బురద కమ్మేసిందని ప్రకృతి స్పష్టంగా చూపించింది. ఆపరేషన్‌ మొదలుకావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇంతలో తాజాగా జరుగుతున్న ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే పని అధికారులు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో రెవెన్యూ, జలవనరుల శాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ శాఖల మధ్య ఏమాత్రం సమన్వయం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

చర్చలు నడుస్తున్నాయి

ఆపరేషన్‌ బుడమేరుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బుడమేరు ఆపరేషన్‌ ప్రారంభిస్తాం. దీన్ని ఎన్ని దశల్లో అమలు చేయాలన్న దానిపై చర్చిస్తున్నాం.

-మోహనరావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ

Updated Date - May 13 , 2025 | 01:00 AM