ఆహార భద్రతపై ముమ్మర తనిఖీలు
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:52 PM
ప్రొద్దుటూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్‌లు, బడ్డీకొట్టులు, నీటి శుద్ధి కేంద్రాలు తదితర వాటిల్లో ఆహార భద్రతపై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
హెచ్చరికలు, నోటీసుల జారీఫ నమూనాల సేకరణ
ప్రొద్దుటూరు రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్‌లు, బడ్డీకొట్టులు, నీటి శుద్ధి కేంద్రాలు తదితర వాటిల్లో ఆహార భద్రతపై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గురువారం జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హరిత ఆధ్వర్యంలో పురపాలిక, పంచాయతీ అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేపట్టారు. పీజీఆర్‌ఎస్ పొందిన ఫిర్యాదుల ప్రకారం ప్రొద్దుటూరులోని చిన్న, పెద్ద హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాల్లో శుచి, శుభ్రత, నాణ్యత పరిణామాలు పరిగణలోకి తీసుకుని సోదాలు చేపట్టారు. ఆహార తయారీ సమయాల్లో స్థానిక అధికారులతో కలిసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. సుందరాచార్యుల వీధిలోని చికెన్ పకోడా సెంటర్లు, బీజీఆర్ సాగర్ బార్ అండ్ రెస్టారెంట్, కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని మహమ్మద్‌ఆలీ బిర్యాని సెంటర్, లక్ష్మీనరసింహ చెన్నూరు బిర్యాని, ది చెన్నూరు స్పెషల్ ధమ్ బిర్యాని సెంటర్లలో మటన్ బిర్యాని, చికెన్ ఫ్రై నమూనాలను సేకరించి పరిశీలన నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. టీపీఎస్ మీటర్ల ఆధారంగా చికెన్ పకోడా సెంటర్లలో నూనె నాణ్యతను పరిశీలించారు. నాణ్యతసరిగా లేని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. మరికొందరికి నోటీసులు అందించారు. నాణ్యత ప్రరిమాణాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఫుడ్ లైసెన్సులను కచ్చితంగా తీసుకోవాలని వివరించారు. హోటళ్లలో శుచి, శుభ్రత అంశంపై పురపాలిక పంచాయతీ అధికారులు నివేదికలు తయారు చేయాలని వివరించారు. గోపవరం పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యాలయంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరు కచ్చితంగా లైసెన్సులు పొందాలని పేర్కొన్నారు. అనధికారిక నీటిశుద్ధి కేంద్రాలను నిర్వహించకూడదని హెచ్చరించారు. వాటర్‌ప్యాకెట్ల తయారీ చేయకూడదని, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, కచ్చితంగా అనుమతులు పొంది నియమ నిబంధనల మేరకే నీటిశుద్ధి కేంద్రాల నిర్వహణ చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు టీడీఎస్ యంత్రం ద్వారా నీటి శుద్ధత పరిమాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రామమోహన్‌రెడ్డి, రామక్రిష్ణ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 11:52 PM