ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sand Inspection: కొల్లిపరపై కంటితుడుపే

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:30 AM

కొల్లిపర, గుండిమెడ... ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అత్యంత కీలకమైన రీచ్‌లు. కొల్లిపర పరిధిలో లభించే ఇసుక చాలా నాణ్యమైనది. సాధారణంగానే అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. గనులు, రెవెన్యూ, ఇతర అధికారులను...

  • ఆ రీచ్‌లో అసలేం జరిగింది?

  • తీసుకున్న చర్యలు ఏమిటి?

  • గనులు, పోలీసు శాఖల మౌనం

  • అక్రమార్కులపై కేసులు లేవు

  • మధ్యాహ్నం ఉత్తుత్తి సీజ్‌లు..

  • మంత్రి ఉన్నంతసేపు హడావుడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కొల్లిపర, గుండిమెడ... ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో అత్యంత కీలకమైన రీచ్‌లు. కొల్లిపర పరిధిలో లభించే ఇసుక చాలా నాణ్యమైనది. సాధారణంగానే అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. గనులు, రెవెన్యూ, ఇతర అధికారులను ఏమార్చి, మరి కొందరిని ప్రలోభపెట్టి రాత్రి, పగలు తేడాలేకుండా ఇసుక మైనింగ్‌ చేస్తున్నారు. వర్షాకాలంలో రీచ్‌లోకి వెళ్లి ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నిషేధాజ్ఞలు ఉన్నా అక్రమార్కులు ఇసుక మైనింగ్‌ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్న జిల్లా మంత్రి నాదెండ్ల మనోహర్‌ శనివారం కొల్లిపర రీచ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో అక్కడ నదిలో నాలుగు, ఒడ్డున మరో రెండు భారీ యంత్రాలు ఇసుకను తోడేస్తున్నాయి. 30కిపైగా లారీలు లోడింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. మంత్రిని చూసి అక్కడున్న కొందరు పరుగో పరుగు. ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయని తెలిసి కొందరు అక్కడే ఇసుక తిన్నెల మాటున భారీగా నగదు (రూ.8.5 లక్షలు) దాచారు. మంత్రి వెంట రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు.ఎలాంటి రహదారి బిల్లులూ లేకుండా లోడింగ్‌తో వెళ్లేందుకు సన్నద్ధమైన లారీలను, ఇసుక తవ్వకాలు చేస్తున్న భారీ యంత్రాలను సీజ్‌ చేశారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసకుంటామని మంత్రి మనోహర్‌ హెచ్చరించారు. అక్కడే ఉన్న ఇసుక గుట్టను, దాని నిర్వహణ రికార్డులను పరిశీలించారు. నిజానికి వర్షాకాలానికి ముందే నదిలోనుంచి ఇసుక తీసి గుట్టగా పోశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జూన్‌ 1 నుంచి అక్టోబరు 15 వరకు నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే, కొల్లిపర రీచ్‌లో నిల్వఉన్న ఇసుక స్వయం సహాయక సంఘాల నియంత్రణలో ఉంది.

అక్కడ సిద్ధంగా ఉన్న నిల్వ ఇసుకను మాత్రమే లారీల్లో లోడింగ్‌ చేయాలి. కానీ మంత్రి తనిఖీకి ముందే కొల్లిపరలో రాత్రిపగలు తేడాలేకుండా ఇసుక మైనింగ్‌ జరుగుతోంది. ఇది గనులు, రెవెన్యూ, పోలీసు శాఖకు తెలియనిదేమీ కాదు. అయితే, తెరవెనక పెద్దల ప్రమేయం ఉండటంతో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

మంత్రి వచ్చివెళ్లగానే షరామామూలే..

కొల్లిపర రీచ్‌ను అనధికారికంగా వేమూరుకు చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఇక్కడి తెనాలి నియోజకవర్గ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫలితంగా ఆయన కనుసన్నల్లో జరిగే అక్రమ ఇసుక మైనింగ్‌ను ఎవరూ టచ్‌చేయలేని పరిస్థితి. ఇక్కడ జరుగుతున్న ఇసుక దోపిడీని పట్టుకోవాలని ఈ ప్రాంతానికే చెందిన ఓ టీడీపీ నేత ప్లాన్‌ చేశారు. పాపం.. అది లీక్‌ అయింది. కొద్ది గంటల వ్యవధిలోనే మంత్రి మనోహర్‌ అక్కడ ప్రత్యక్షమయ్యారు. మంత్రి తనిఖీ తర్వాత అక్కడున్న లారీలు, భారీ యంత్రాలను అధికారులు సీజ్‌ చేశారు. మంత్రి వెళ్లిపోగానే, రాత్రికంతా దృశ్యం మారిపోయింది. కేసులు లేవు. వాహనాల సీజ్‌లు లేవు. అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలే లేవు. అసలు ఇసుక అక్రమ తవ్వకాలే జరగడం లేదని నిర్ధారించేశారు. దీనివెనుక ఏం జరిగి ఉంటుంది? ఎవరి ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి? వాటికి సమాధానం లేదు. నిజానికి వీటికి బదులు ఇవ్వాల్సింది గనులశాఖ. ఇదే విషయమై జిల్లా గనుల శాఖ అధికారిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించింది. మంత్రి ఆకస్మిక తనిఖీల సమయంలో తాను కొల్లిపర రీచ్‌కు వెళ్లలేదని ఆయన తెలిపారు. అది తహసీల్దార్‌ పరిధిలో అంశమని తెలిపారు. వాహనాలపై పెనాల్టీ వేశారన్నారు. మంత్రి తనిఖీల తర్వాత, నింపాదిగా సోమవారం ఆయన కొల్లిపరకు వెళ్లి పరిశీలించారు. అక్రమ తవ్వకాలే లేవని సర్టిఫికెట్‌ ఇచ్చారు.

జగన్‌ ప్రభుత్వంలోనూ కొల్లిపర రీచ్‌లో భారీ అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇదే విషయంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) విచారణ చేయగా, అక్రమాలే లేవని అప్పటి గుంటూరు కలెక్టర్‌ 2024లో నివేదిక ఇచ్చారు. నివేదికపై ఎన్జీటీకి అనుమానం వచ్చి కేంద్ర పర్యావరణ బృందాన్ని కొల్లిపరకు పంపించి వాస్తవిక పరిశీలన చేయించింది. పర్యావరణాన్ని పణంగాపెట్టి నదీగర్భాన్ని తోడేశారని పర్యావరణ నిపుణులు తేల్చి ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. దీంతో గుంటూరు కలెక్టర్‌పై ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే దృశ్యం ఇప్పుడు పునరావృతం అవుతున్నట్లుగా ఉంది. గత శుక్ర వారం రాత్రి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వితీస్తున్న జీపీఎస్‌ ఆధారిత ఫొటోలు, ఫిర్యాదులు ఉన్నాయి. అయినా, అక్కడ అక్రమ తవ్వకాలే జరగడం లేదని గనుల అధికారి చెప్పడం విశేషం.

కొల్లిపరలో లోడింగ్‌ నిలిపివేత

కొల్లిపర, జూలై 14(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా కొల్లిపర ఇసుక రీచ్‌ విషయంలో మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎట్టకేలకు స్పందించారు. గుండిమెడ, కొల్లిపర ఇసుక రీచ్‌లలో యథేచ్ఛగా తవ్వకాలు అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించడంతోపాటు మంత్రి నాదెండ్ల మనోహర్‌ జరిపిన తనిఖీల నేపథ్యంలో చర్యలకు సిద్ధమయ్యారు. సోమవారం కొల్లిపర సమీపంలోని ఇసుక స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. అక్కడున్న ఇసుక నిల్వలను పరిశీలించి లోడింగ్‌ను నిలిపివేయించారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రొక్లెయిన్‌తో నదిలో గాడికొట్టించారు. తహసీల్దార్‌ సిద్ధార్థ మాట్లాడుతూ.. కొల్లిపర స్టాక్‌పాయింట్‌లో 30 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిర్వాహకులకు అప్పగించామన్నారు. ప్రస్తుతం స్టాక్‌పాయింట్‌లో 1,620 మెట్రిక్‌ టన్నులు మాత్రమే నిల్వ ఉందన్నారు. నిర్వాహకుల నుంచి బిల్లులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక స్టాక్‌పాయింట్‌ నుంచి ఎంత లోడింగ్‌ జరిగిందనే విషయం లెక్కతేల్చేవరకు లోడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jul 15 , 2025 | 05:34 AM