ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Illegal Drugs Trade: తియ్యని మత్తు

ABN, Publish Date - Jul 22 , 2025 | 05:41 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నగరాల్లోని పలు పాన్‌ షాపులు, సిగరెట్‌ దుకాణాల్లో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఒడిశా, బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటిని తయారుచేసి...

  • అడ్డదారుల్లో గంజాయి అమ్మకాలు

  • ఒడిశా, బిహార్‌, పశ్చిమబెంగాల్‌ కేంద్రంగా గంజాయి కలిపిన చాక్లెట్ల తయారీ

  • ఆకర్షణీయ ప్యాకెట్‌లపై ఆయుర్వేద ముద్ర.. తెరిచి చూస్తే గంజాయి వాసన

  • తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

‘‘ఆ ప్యాకెట్‌ చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెరిస్తే నల్లటి గోళీ ఆకారంలో ఒక చాక్లెట్‌ ఉంటుంది. వాసన చూస్తేనేమో గంజాయిలా, తింటేనేమో తియ్యగా ఉంటుంది. ఆ తర్వాత మత్తులోకి జారుకోవడమే ఇక! చిన్నారులకైతే ఏం చేస్తున్నామో కూడా తెలియనంత మైకం!! ఇదీ గంజాయి కలిపిన ఆ చాక్లెట్‌ల ప్రభావం. గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో పాటు విస్తృత దాడులు చేస్తుండటంతో అక్రమార్కులు గంజాయి అమ్మకానికి సరికొత్త అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆ కోవలోదే ఈ గంజాయి చాక్లెట్‌. అనుమానం రాకుండా ఆయుర్వేదం పేరు చెప్పి ‘భాంగ్‌ గోళీ’ అంటూ అమ్మేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి.’’

(తెనాలి - ఆంధ్రజ్యోతి)

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నగరాల్లోని పలు పాన్‌ షాపులు, సిగరెట్‌ దుకాణాల్లో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఒడిశా, బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో వీటిని తయారుచేసి, అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్‌ వ్యాపార యాప్‌ల ద్వారా కూడా ఆయుర్వేద గుళికల పేరుతో యథేచ్ఛగా సరఫరా చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా సాగిన గంజాయి వ్యాపారం, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అక్రమార్కులు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. లిక్విడ్‌ గంజాయి సరఫరాకు ప్రయత్నాలకు అధికారులు చెక్‌ పెట్టడంతో ఇప్పుడు గంజాయి చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేశారు. వీటి వల్ల ఇప్పటికే గంజాయి అలవాటు ఉన్న వారే కాకుండా చిన్నారులు కూడా తినే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈగిల్‌ బృందాల ముమ్మర దాడుల్లో వీటి గుట్టు బయటపడింది. వరుస దాడులతో రవాణాదారులు సరుకున్న బ్యాగ్‌లు వదిలేసి పారిపోతుండటంతో.. వాటి మూలాలను పట్టుకోవటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఏపీలో విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాలు, తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్‌ వంటి చోట అమ్మకాలు సాగుతున్నాయి.

చాక్లెట్టే కదా.. అని వదిలేస్తే!

చాక్లెట్టే కదా! తింటే ఏమవుతుందిలే అనుకుంటే.. మీ చిన్నారుల జీవితాలు మత్తుకు బానిసయినట్టే. మినార్‌, చార్‌మినార్‌, మహదేవ్‌ ఘోలా, లహరి, తరంగ్‌, రాయల్‌ వటి, భోలా పవర్‌ గోళీ, ఆనంద్‌, మహాకల్‌, మస్తీ వంటి పేర్లతో మార్కెట్‌లోకి ఈ తరహా చాక్లెట్‌లు వచ్చేశాయి. పైగా వాటిపై ఆయుర్వేద గుళికలంటూ కలరింగ్‌ ఇచ్చేస్తున్నారు. వీటిని తినటం వల్ల చిన్నారుల్లో వింత ప్రవర్తన కనిపిస్తుంది. తాజాగా హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో ఇదే పరిస్థితి ఎదురైంది. దీనికి కారణం తెలియక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. వింతగా ప్రవర్తించిన పది మందిపై కొద్ది రోజులు నిఘా ఉంచారు. గంజాయి చాక్లెట్లు తినటం వల్లే ఇలా జరిగినట్లు తేలడంతో పోలీసులు అమ్మకాలు చేసిన దుకాణాలపై దాడులు చేసి, గంజాయి చాక్లెట్‌ గుట్టును రట్టు చేశారు. తాజాగా గుంటూరులోని ఒక పాన్‌ దుకాణంలోనూ భారీగా గంజాయి చాక్లెట్లు టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు పట్టుబడ్డాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక ఈగిల్‌ బృందాలను ఏర్పాటు చేసింది. ఇటీవల తెనాలి రైల్వేస్టేషన్‌లో తాంబ్రమ్‌-ఝాన్సీ ఎక్స్‌ప్రె్‌సలో చెన్నై తరలిస్తున్న మినార్‌ అనే పేరుతో ఉన్న గంజాయి చాక్లెట్‌లను పోలీసులు పట్టుకున్నారు.

ఏవోబీలోని ఏజెన్సీ కేంద్రంగా..

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు డబ్బు ఆశ చూపి దళారులు గంజాయి సాగు చేయిస్తున్నారు. అక్రమ సాగుకు ప్రస్తుతం ఒడిశా ఏజెన్సీ ప్రాంతం అడ్డాగా మారింది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో సాగు అధికంగా ఉందనేది అధికారుల మాటే! అక్కడ పండించిన గంజాయిని నేరుగా కాకుండా.. మత్తు కలిగించే ఆకులు, పుష్పాలను ఎండబెట్టి, ఆ పొడిని ఇతర మిశ్రమాలతో కలిసి చాక్లెట్‌ల తరహాలో తియ్యగా ఉండేలా తయారు చేస్తున్నారు. ఆ ప్యాకెట్‌లపై ఆయుర్వేద గుళికలంటూ ముద్రిస్తున్నారు. వాటిని తింటే నిద్రలేమి ఉండదని, నొప్పుల నుంచి ఉమశమనం లభిస్తుందని, ఒత్తిడిని తగ్గించటంతోపాటు, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందంటూ ముద్రించి మరీ అమ్మకాల కోసం ప్రత్యేక టీమ్‌ల ద్వారా ప్రధాన నగరాలకు పంపుతున్నారు. గతంలో ఓ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థ ద్వారా ఆయుర్వేద పొడులు, మాత్రల పేరుతో జరిగిన సరఫరాను పోలీసులు రట్టుచేయటంతో హ్యాష్‌ ఆయిల్‌ పేరుతో గంజాయిని ఆయిల్‌గా మార్చి రవాణా చేశారు. దీనిని కొన్ని చోట్ల పట్టుకోవడంతో ఇప్పుడు గంజాయి చాక్లెట్ల తయారీకి రూటు మార్చారు. ఒడిశా, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో మరో అడుగు ముందుకు వేసి, చాక్లెట్‌ ప్యాకెట్లు లేకుండా పాన్‌ మసాలా పేరుతో పాన్‌ డబ్బాల్లో చిన్నపాటి గోళీల ఆకారంలో గంజాయి గుళికలు తయారు చేసి సరఫరా చేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2025 | 09:48 AM