Minister Lokesh: ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో
ABN, Publish Date - Aug 01 , 2025 | 02:59 AM
లిక్కర్ స్కాంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని లోకేశ్ అన్నారు. ఈ వ్యవహారంలో జగన్‌ను అరెస్టు చేస్తారా అని మీడియా అడుగగా.. పై విధంగా స్పందించారు.
పెట్టెల లెక్క జగన్‌కు బాగా తెలుసు
కసిరెడ్డి ఆ డబ్బు తనది కాదంటే అది జగన్‌దే
చట్టం తన పని తాను చేసుకుపోతుంది
జగన్ అరెస్టుపై లోకేశ్ వ్యాఖ్య
ఇంటర్నెట్ డెస్క్: లిక్కర్ స్కాంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని లోకేశ్ అన్నారు. ఈ వ్యవహారంలో జగన్‌ను అరెస్టు చేస్తారా అని మీడియా అడుగగా.. పై విధంగా స్పందించారు. ‘ఫాంహౌస్‌లో పట్టుబడిన రూ.11 కోట్లు తనవి కావని రాజ్ కసిరెడ్డి చెబుతున్నాడంటే.. అవి జగన్‌వేనని పరోక్షంగా అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ డబ్బు తమదంటూ ఇంతవరకూ ఎవరూ ఎందుకు క్లెయిమ్ చేయలేదు? దర్యాప్తులో ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో! ఎంత డబ్బులు చేతులు మారాయో జగన్‌కే తెలుసు. ఆయన్నడిగితే లెక్కలు చెబుతారు. ఏ పెట్టెలో ఎంత డబ్బుందో ఆయనకే బాగా తెలుసు. ఆదాన్ డిస్టలరీ నుంచి పాపాల పెద్దిరెడ్డి కంపెనీ(పీఎల్‌ఆర్)కి డబ్బులు వెళ్లాయో లేదో పెద్దిరెడ్డి చెప్పాలి. కన్‌స్ట్రక్షన్ కంపెనీకి.. లిక్కర్ కంపెనీకి ఏం సంబంధమో, ఏయే ఆర్థిక లావాదేవీలు జరిగాయో వెల్లడించాలి. ఈ డబ్బు పీఎల్‌ఆర్ నుంచి జగన్‌కు వెళ్లింది. లిక్కర్ కంపెనీ రూ.400 కోట్ల బంగారం ఎందుకు కొన్నదో అర్థం కావడం లేదు. తక్కువ ధర ఉన్నప్పుడు జగన్ బంగారం కొన్నారు. ఇప్పుడు ధర అమాంతం పెరిగింది. ఆయన అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్‌కూ.. క్రిమినల్ మైండ్‌కు ఇదో ప్రత్యక్ష ఉదాహరణ’ అని తెలిపారు. జగన్ వల్లే తాను రాజకీయంగా రాటుదేలానని లోకేశ్ అన్నారు. జీవో నం.1తో ప్రతిపక్షాన్ని నిర్బంధించడంతో తమలో కసి పెరిగిందన్నారు. ఉండవల్లి నివాసం వద్ద ప్రజాదర్బార్‌కు అనుమతి ఇవ్వలేదని.. చంద్రబాబు బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టారని.. జిల్లాల పర్యటనలకూ అనుమతులు ఇవ్వకుండా నిరోధించారని.. వీటిన్నింటివల్లే తాను రాటు దేలానని చెప్పారు. ఇంతకాలం నల్లని గడ్డంతో కనిపించిన జగన్ ఒక్కసారిగా తెల్లటి గడ్డంతో కనిపించడం ఆశ్చర్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Updated Date - Aug 01 , 2025 | 03:05 AM