Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:47 AM
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టితో కూడా విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పారు.
నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి అనిత
మృతుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తాం: మంత్రి అనగాని
అందరం వచ్చి అండగా నిలుస్తున్నాం: మంత్రి ఆనం
మెరుగైన వైద్యం అందిస్తున్నాం: మంత్రి సత్యకుమార్
తిరుపతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టితో కూడా విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పారు. ఆమెతోపాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ గురువారం తిరుపతికి విచ్చేసి తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమెరాలున్నాయని, వాటిని పరిశీలించి, ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. వెంటనే రూ.25లక్షలు వారికి చేరే ఏర్పాట్లు చేశామని, వారి స్వగ్రామాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మళ్లీ బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు కొండంత భరోసా ఇవ్వాల్సిన సమయమని, అందుకే అందరం వచ్చి అండగా నిలుస్తున్నామని చెప్పారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఘటనపై నివేదిక కోరామని, దాని ఆధారంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 03:47 AM