High Court: మరీ ఇంత తాత్సారమా
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:42 AM
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిపై భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఎట్టకేలకు కేసు నమోదైంది. నేహారెడ్డి భీమిలి బీచ్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారంలో హైకోర్టు ఇప్పటికే పలుసార్లు గట్టిగా స్పందించినా, ఆమెపై కేసు నమోదులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు.
నేహారెడ్డిపై చర్యలకు ఇన్నాళ్లూ మీనమేషాలు
హైకోర్టు ఆగ్రహంతో ఎట్టకేలకు కేసు నమోదు
భీమిలీ బీచ్‌లో అక్రమ నిర్మాణాల వ్యవహారంలో
సాయిరెడ్డి తనయను తప్పుబట్టిన హైకోర్టు
కట్టడాలు తొలగించి, చర్యలకు పలు ఆదేశాలు
తాజాగా గట్టి వార్నింగ్‌తో అధికారులకు డెడ్‌లైన్
దీంతో భీమిలి స్టేషన్‌లో అధికారుల ఫిర్యాదు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డిపై భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఎట్టకేలకు కేసు నమోదైంది. నేహారెడ్డి భీమిలి బీచ్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారంలో హైకోర్టు ఇప్పటికే పలుసార్లు గట్టిగా స్పందించినా, ఆమెపై కేసు నమోదులో అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. తాము ఆదేశించినా క్రిమినల్ కేసు పెట్టడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ మేనేజ్‌మెంట్ జోన్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) మెంబర్ సెక్రటరీని గత నెల విచారణ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. దీంతో అధికారులు చివరకు కదిలారు. వచ్చే వాయిదాకు కేసు నమోదు చేసిన వివరాలతో పాటు సీఆర్‌జెడ్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించి నిర్వహిస్తున్న ఐదు రెస్టో బార్లపై ఏమి చర్యలు తీసుకున్నారో వివరించాలని అప్పట్లో హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నేహారెడ్డితో పాటు ఆమెకు చెందిన అవ్యాన్ రియల్టర్స్ సంస్థపై భీమిలి పోలీ్‌సస్టేషన్‌లో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫిర్యాదుచేశారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ చట్టానికి సంబంధించిన సెక్షన్లతో కేసుపెట్టారు. దీనిపై పోలీసులు విచారించాల్సి ఉంది. భీమిలి బీచ్‌లో నేహారెడ్డి చేపట్టిన నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని, దానికి అయిన వ్యయంతోపాటు ఆ చర్యల వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాన్ని అంచనావేసి, దానిని కూడా ఆమె నుంచే వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే గత మార్చి నెలలో పునాదులను కొంతవరకూ తొలగించారు. దానికి రూ.60 లక్షలు వ్యయం అయింది. ఆ కాంట్రాక్టర్‌కు రూపాయి కూడా ఇవ్వకపోవడంతో పనులు ఆపేశారు. మరో వైపు దీని వల్ల జరిగిన పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక కమిటీని వేయాల్సి ఉంది. అది కూడా ఏర్పాటుకాలేదు. సీఆర్‌జెడ్‌లో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన అంశంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిల్ వేయగా, వాటిపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. వాటిని సర్వే చేయడానికి జాతీయ సముద్ర అధ్యయన సంస్థకు జీవీఎంసీ సుమారుగా రూ.17 లక్షలు చెల్లించింది. వారు సర్వే చేసి అన్ని రెస్టో బార్లు నిబంధనలు ఉల్లంఘించాయని నివేదించింది. వాటిపై చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడంతో ఆయా సంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోగలిగాయి. ఆయా సంస్థల యాజమాన్యాలను పిలిచి వివరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను హైకోర్టు పేర్కొంది. వారు చెప్పే సమాధానాలను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఈ అంశం రెండు వారాల్లో విచారణకు రానుంది.
Updated Date - Jul 08 , 2025 | 03:43 AM