Visakhapatnam: 24న అల్పపీడనం
ABN, Publish Date - Jul 19 , 2025 | 07:11 AM
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు, రైతులకు ఇక వర్షాలతో ఉపశమనం లభించనుంది. దక్షిణ కోస్తా పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
విశాఖపట్నం/అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు, రైతులకు ఇక వర్షాలతో ఉపశమనం లభించనుంది. దక్షిణ కోస్తా పరిసరాల్లో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు చెన్నై మీదుగా తూర్పు, పడమరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు కోస్తాపైకి వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల రుతుపవనాలు చురుగ్గా మారి గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గుంటూరు జిల్లా వంజిపురంలో 130.5, ప్రకాశం జిల్లా టంగుటూరులో 123.25, గుంటూరు జిల్లా నల్లపాడులో 106.3, కడప జిల్లా కామకుంటలో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే శుక్రవారం రాత్రి 7 గంటల వరకు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 67.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా సుదీర్ఘకాలం ఎండలు, వర్షాభావం కొనసాగిన కోస్తా, రాయలసీమల్లో వర్షాలు ప్రారంభం కావడం ఖరీఫ్ పంటలకు ప్రాణం పోసినట్టయిందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈనెల 22 వరకు రాష్ట్రంలో ఈ వర్షాలు కొనసాగుతాయని వివరించారు. కాగా, ఈనెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు.
Updated Date - Jul 19 , 2025 | 07:25 AM