Heavy Rainfall: నేడు, రేపు భారీ వర్షాలు
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:57 AM
రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
విశాఖపట్నం, అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో విస్తరించిన తూర్పు, పడమర ద్రోణి ఉత్తర దిశగా పయనించి కోస్తాంధ్ర మధ్య ప్రాంతాల్లో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నది. దాని ప్రభావంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 48 గంటల్లో కోస్తా, సీమల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
Updated Date - Jul 23 , 2025 | 08:35 AM