Heavy Rain Alert: కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన
ABN, Publish Date - Jun 11 , 2025 | 03:50 AM
ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు, షీర్ జోన్ ప్రభావాలతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి దక్షిణ భారతదేశంపైకి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
14 నుంచి నైరుతిలో పురోగతి.. 16 తర్వాత అల్పపీడనం
విశాఖపట్నం,అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు, షీర్ జోన్ ప్రభావాలతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి దక్షిణ భారతదేశంపైకి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో అనేకచోట్ల ఈదురుగాలులతో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతంలో వర్షాలు పెరుగుతుండడం, హిందూ మహాసముద్రం నుంచి తేమగాలులు వస్తుండడంతో ఈ నెల 14 నుంచి నైరుతి రుతుపవనాల్లో కదలిక వస్తుందని, మధ్య, తూర్పుభారతంలో పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఈ నెల 16 తర్వాత పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. దీంతో రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందన్నారు. కాగా, రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు, బుధవారం విజయనగరం, మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Updated Date - Jun 11 , 2025 | 03:51 AM