Temperature Rise: దక్షిణాదిలో అప్పుడే వేడి సెగలు
ABN, Publish Date - Feb 27 , 2025 | 02:55 AM
దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడే వేడి సెగలు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు...
ఏపీ, కర్ణాటక, కేరళల్లో వడగాడ్పులు
గాలిలో తేమ శాతం తగ్గడమే కారణం
మార్చిలో మరింతగా మంటలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రారంభం కాకముందే భానుడు భగ్గున మండుతున్నాడు. దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడే వేడి సెగలు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాడుపగిలేలా ఎండలు కాస్తున్నాయి. కేరళ, కర్ణాటక, దానికి ఆనుకుని మహారాష్ట్రలోని ముంబై నగరంలో వడగాడ్పులు వీచినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంది. ఫిబ్రవరిలో వడగాడ్పులు వీయడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు, అక్కడక్కడా ఐదారు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు దేశంలోనే అత్యధికంగా ఎక్కువ రోజులు ఏపీలోని రాయలసీమ, కోస్తా, కేరళ, కర్ణాటకల్లో నమోదయ్యాయి. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో ముందుగానే వేసవి ప్రారంభం కావడం సాధారణమే అయినా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకు వాతావరణంలో మార్పులే కారణమని పేర్కొంటున్నారు. కొన్ని రోజులుగా దక్షిణాదితోపాటు పశ్చిమ, మధ్యభారతంలో గాలిలో తేమ శాతం తక్కువగా నమోదవుతోంది. గాలిలో తేమశాతం 40 నుంచి 50 వరకూ నమోదవుతుండడంతో పొడి వాతావరణం నెలకొని ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో వడగాడ్పులు వీచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బెంగళూరుతోపాటు కేరళ, కర్ణాటక, రాయలసీమలో కొన్నిచోట్ల గాలిలో తేమశాతం గణనీయంగా పడిపోతోంది. బుధవారం కర్నూలులో 20, అనంతపురంలో 25, నంద్యాలలో 30, కడపలో 37 శాతం నమోదైంది. తీర ప్రాంతమైన బాపట్లలో 33, నరసాపురంలో 24 శాతానికి పడిపోవడంతో ఆయా చోట్ల వాతావరణం పొడిగా మారింది.
నగరాల్లో పెరిగిన వేడి
దశాబ్దకాలంగా వానాకాలంలో వర్షం కురిసే సమయం/రోజులు తగ్గిపోతున్నాయి. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టిగా కురుస్తోంది. దీంతో వర్షం నీరు భూమిలో ఇంకిపోయే అవకాశం తక్కువగా ఉంది. నగరాలు/పట్ణణాల్లో వర్షపు నీరు ఇంకే యంత్రాంగం పూర్తిగా తగ్గుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి సముద్రాల జగన్నాథకుమార్ పేర్కొన్నారు. నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారడం, డ్రైన్లు మొత్తం సిమెంట్‌తో నిర్మించడం, ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడం, ప్లాస్టిక్ పెరగడం, భూగర్భ జలాలు తగ్గడంతో వేడి వాతావరణం పెరుగుతుందన్నారు. వాహనాల కాలుష్యం కూడా కారణమన్నారు. బెంగళూరు, ముంబై మహా నగరాలతోపాటు కేరళలో పలుచోట్ల వడగాడ్పులు వీయడానికి వాతావరణంలో మార్పులతోపాటు స్థానికంగా నెలకొనే పరిస్థితులే కారణమని వివరించారు. మార్చిలో కూడా ఇదే స్థాయిలో ఎండలు కొనసాగుతాయన్నారు. కాగా పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం లానినా కొనసాగుతున్నా... దాని ప్రభావంతో ఎండలు తగ్గుతాయా? లేదా?... అన్నదానిపై వాతావరణ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం లానినా బలహీనంగా ఉన్నందున వేసవి తీవ్రత తగ్గేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మార్చిలో వర్షాలు కురిసే ప్రాంతాల్లో భూమిలో తేమ శాతం పెరిగి కొన్ని రోజులపాటు వేడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో జనవరి ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు వర్షపాతం 72 శాతం తక్కువగా నమోదైందని గుర్తుచేస్తున్నారు. దీంతో భూ వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉంటోంది.
Updated Date - Feb 27 , 2025 | 02:55 AM