CEO Dinesh Kumar: ఈహెచ్‌ఎస్ సమస్యలు పరిష్కరిస్తాం
ABN, Publish Date - Jul 16 , 2025 | 06:23 AM
ఈహెచ్‌ఎస్ ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్‌కుమార్ హామీ ఇచ్చారు.
ఉద్యోగ సంఘాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో దినేష్‌కుమార్
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఈహెచ్‌ఎస్ ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్‌కుమార్ హామీ ఇచ్చారు. ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం ఈహెచ్‌ఎస్ మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, పీటీడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ తదితరులు ఉద్యోగుల సమస్యలను ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్ స్కీమ్ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని హామీలే తప్ప 2013 నుంచి అమలుకు నోచుకోవడం లేదన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు, రిటైరైనవారికి ఈహెచ్‌ఎస్ కార్డు ఉపయోగపడటం లేదని చెప్పారు. ఈహెచ్‌ఎస్ స్కీమ్‌ను పూర్తిస్తాయిలో పునఃసమీక్షించి నగదు రహిత చికిత్స అందించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులనూ ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం చెల్లించే మొత్తాన్ని రెండు నుంచి ఐదు లక్షలకు పెంచాలని కోరారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, సీపీఎస్ ఉద్యోగులకూ ఈహెచ్‌ఎస్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. సీఎస్ నేతృత్వంలో ఈహెచ్‌ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగేలా చూస్తామన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 06:26 AM