Health Awareness: ఉప్పు, పంచదార, నూనెలు తగ్గించండి
ABN, First Publish Date - 2025-04-26T05:01:37+05:30
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు ఉప్పు, పంచదార, నూనెల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. గుంటూరులో నిర్వహించిన "చెక్ బీపీ-స్టాప్ స్ట్రోక్" కార్యక్రమంలో బీపీ స్క్రీనింగ్ చేయాలని పిలుపు ఇచ్చారు.
బీపీ, షుగర్, గుండె జబ్బులకు ఇవే ప్రధాన కారణం
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం: ఎంటీ కృష్ణబాబు
గుంటూరులో ‘చెక్ బీపీ-స్టాప్ స్ట్రోక్’ కార్యక్రమం
గుంటూరు మెడికల్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ‘రోజూ మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, పంచదార, నూనెల వినియోగం బాగా తగ్గించాలి. వీటిని ఎక్కువగా వాడితే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటిని పరిమితిలోపు వాడితే ఆయా వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు’ అని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్(ఐఎ్‌సఏ), రెడ్‌క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని భారతీయ విద్యా భవన్ ప్రాంగణంలో శుక్రవారం ‘చెక్ బీపీ-స్టాప్ స్ట్రోక్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పక్షవాతం అవగాహన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉప్పు, పంచదార, నూనెల వినియోగం తగ్గించాలని ఇటీవల సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరోగ్య శాఖ నిర్ణయించింది. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం నెలకు సగటున 600 గ్రాముల ఉప్పు, 3 కేజీల పంచదార, 1.80 నుంచి 2 కిలోల నూనెను మాత్రమే వినియోగించాలి. ప్రతి రోజూ 40 నిమిషాల సేపు శారీరక వ్యాయామం చేయాలి. అవకాశం ఉంటే మెడిటేషన్ చేస్తే మరింత మంచిది. ఇవన్నీ పాటిస్తే 80 శాతం బీపీ, షుగర్, పక్షవాతం, గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. ’ అని సూచించారు. అధిక రక్తపోటుతో బాధపడే రోగుల్లో 50 శాతం మందికి తమకు బీపీ ఉన్నట్లే తెలియదని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పీ విజయ తెలిపారు. ‘రోగులందరికీ స్ర్కీనింగ్ చేసి బీపీని గుర్తించి మందులు వాడితే 80 శాతం పక్షవాతం నివారించవచ్చు. ఏటా దేశంలో 18 లక్షల మంది దీని బారినపడుతున్నారు. వీరిలో 30 శాతం మంది అంగవైకల్యానికి గురౌతున్నారు. దీనిని దృష్టిలోఉంచుకుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ పరీక్షలు చేసే కార్యక్రమానికి గుంటూరులో శ్రీకారం చుట్టాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపపడతాం’ అని డాక్టర్ విజయ తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ క్లినిక్‌లో బీపీ పరీక్షలను ఆమె ప్రారంభించారు. తొలి రోజు గుంటూరులో ఐదు ప్రాంతాల్లో బీపీ పరీక్షల శిబిరం నిర్వహించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - 2025-04-26T07:09:50+05:30 IST